చమురు మంటలను ఎగదోస్తున్న అమెరికా

       చమురు మంటలను ఎగదోస్తున్న అమెరికా

america
america

పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్‌) జనవరి నుంచి వైదొలుగుతున్నట్లు అరబ్‌ దేశం ఖతార్‌ ప్రకటించ డంతో అరబ్‌ ప్రాంతంలోని భౌగోళిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికారపీఠం అధిష్టించిన నాటి నుండి అమెరికా ఫస్ట్‌ వంటి శుష్కనినాదంతో అవకాశవాద రాజకీయాలు నడు పుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వలాభంతో చమురు ఉత్పత్తి చేస్తున్న వివిధ దేశాల మధ్య విభజించు పాలించు అనే కుట్రపూరిత దుర్విధానాన్ని పాటిస్తూ ప్రపం చంలో చమురు మంటలకు కారణభూతడయ్యాడు.

ఇప్పటికే సౌదీ అరేబియా తదితర అమెరికా అనుకూల దేశాలు తమ అడుగులకు మడుగులొత్తే విధానానికి వ్యతిరేకంగా వెళ్తున్న ఖతార్‌ను వెలివేశాయి. ఒపెక్‌ కూటమి నుండి బయటకు వచ్చి ప్రపంచ దేశాలతో ఒంటరిగా చమురు వ్యాపారం ప్రారంభిం చింది. కానీ ఖతార్‌ ఈ కఠిన నిర్ణయం వెనుక గత కొన్నాళ్లుగా ఒపెక్‌ దేశాలపై పెత్తనం చేస్తున్న దేశాల వైఖరే కారణం అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొన్నాళ్లుగా అగ్రరాజ్యం అండ చూసుకొని సౌదీ అరేబియా ఖతార్‌ వంటి చిన్న చమురు ఉత్పత్తి దేశాలపై పెత్తనం సాధించేందుకు ప్రయత్నిస్తోంది.

తమకు అనుకూలంగా ధరలు మార్పు చేయడం, ఉత్పత్తి క్రమం, ప్రణాళికలో భారీ మార్పులు చేయడం చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. కొన్నాళ్లుగా సౌదీ అరేబియా, ఖతార్‌ మధ్య తలెత్తిన విభేధాల కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఖతార్‌ ప్రకటించడంతో ఒపెక్‌ దేశాలపై పెత్తనం చేస్తున్న దేశాల తీరుకు హెచ్చరికగా పరిగణించవచ్చు. 1960 ప్రాంతంలో చమురు ఎగుమతి దేశాల కూటమిగా ఏర్పడిన నాటి నుంచి ముడిచమురు ఉత్పత్తి, ఎగుమతులపై చిన్నపాటి విభేదాలు రేకెత్తినప్పుడల్లా, వాటి పరిష్కారం కోసమే ఒపెక్‌ ఉనికిలోకి వచ్చింది.

ఆధునిక ప్రపంచాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న చమురు ఉత్పత్తి దేశాల కూటమి అనుక్షణం అప్రమత్తతో, సంయమనంతో వ్యవహరిస్తూ ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన పలు విభేదాలకు సామరస్యపూర్వక పరిష్కారం సాధిం చిన ఒపెక్‌ కూటమి ఏనాడూ ఇంతటిసంక్షోభానికి గురికాలేదు. ప్రపంచ ఆర్థిక అభివృద్ధి గమనంలో ఒపెక్‌ చాలా శక్తివంతమైన కూటమి మాత్రమే కాదు. అంతకన్నా కీలకమైనది.మొత్తంగా ప్రపంచ చమురు ఉత్పత్తిలో 40 శాతం వాటా 15 ఒపెక్‌ దేశాల కూటమిదే.

అందులో సౌదీ అరేబియా అమెరికా అండతో పెద్దపాత్ర పోషిస్తోంది. ఒపెక్‌ దేశాల కూటమి మొత్తం చమురు ఉత్పత్తిలో 35 శాతం చమురుసౌదీ ఒక్కటే ఉత్పత్తి చేస్తున్నది. ఎప్పుడైతే చమురు ఉత్పత్తులపై కన్నేసి అమెరికా ఆధిపత్యం కోసం ప్రయత్నాలు ప్రారంభించిందో అరబ్‌ దేశాలన్నీ అతలాకు తలం అయ్యాయి. పెట్రోలియం ఉత్పత్తులపై ఆధిపత్యం కోసం దేశదేశాలను చెరబట్టి, వారి దేశ అంతర్గత వ్యవహారాలలో తల దూర్చి, దేశాధ్యక్షులను కూల్చి అమెరికా ఆరని చిచ్చుపెట్టింది.

ఆయా దేశాలలో తాను తాన అంటే తందానా అనే కీలుబొమ్మ ప్రభుత్వాలను స్థాపించి, వారి వ్యవస్థలను మొత్తం తన గుప్పిట్లోకి తీసుకొనే వికృత రాజకీయ క్రీడకు తెరలేపింది. ఫలితంగా ఆయా దేశాల ఆర్థిక, సార్వభౌమాధిపత్యం మొత్తంగా ప్రమాదంలో పడింది. దేశాలు తీవ్ర అంతర్గత సంక్షోభంలో పడిపోయాయి. చమురు ధరలను ఇష్టారాజ్యంగా తమకు అనుగుణంగా నియంత్రిస్తున్నందు వలన, చమురు దిగుమతులకు వివిధ దేశాలు అమెరికన్‌ డాలర్లలో చెల్లించాల్సి ఉన్నందున అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే అనేక దేశాల కరెన్సీలు దారుణంగా బలహీనపడ్డాయి.

భారత ప్రభుత్వం ఈవిషయంలో చాలా చిత్రంగా ప్రవర్తించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నా గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం 11సార్లు ఎక్సైజ్‌ సుంకాన్ని సవరించింది. ధరల తగ్గుదల ఫలాన్ని వినియోగదారులకు బదిలీ చేయలేదు. మరోవైపు దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం నానాటికీ పెరుగుతున్నది. చమురు మంటల కారణంగా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుల జీవితాలు అతలాకుతలమ వ్ఞతున్నాయి. వీటి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి నియంత్రణా చర్యలు చేపట్టడం లేదు.
– సి.ప్రతాప్‌