చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి : ఆర్‌.కృష్ణయ్య

R Krishnaiah

హైదరాబాద్‌ (ధర్నాచౌక్‌) : పార్లమెంటులో బిసి బిల్లు పెట్టి చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. పార్లమెంటులో బిసి బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఇందిరాపార్కు వద్ద ఆర్‌.కృష్ణయ్య ఆధ్వర్యంలో వందలాది మందితో భారీ ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బిసి బిల్లు విషయంలో చొరవ తీసుకొని దేశంలోని అన్ని పార్టీల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అఖిల పక్షాలతో ప్రతినిధి బృదం ఏర్పాటుచేసి ప్రధాని నరేంద్రమోడీని కలవాలని డిమాండ్‌ చేశారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్ళు గడుస్తున్నా పాలకులుమాత్రం బిసిలకు రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించడంలేదని విమర్శించారు. జనాభా ప్రకారం బిసిలకు చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు ఇచ్చి రాజ్యాధికారంలో వాటా కల్పించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వస్తుందన్నారు. ప్రస్తుతం బిసి వర్గానికి చెందిన వ్యక్తి దేశ ప్రధానిగా ఉన్నారని, చట్ట సభల్లో రిజర్వేషన్లు సాధించుకోవడినికి ఇదే సరైన సమయమన్నారు. రాజకీయాలకు అతీతంగా బిసిలంతా రిజర్వేషన్లకోసం పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వాలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించడానికి అభ్యంతరమేమిటని కృష్ణయ్య ప్రశ్నించారు. జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టినప్పుడు, బిసిలకు పెట్టేందుకు ఒక్క రాజకీయ పార్టీ ముందుకు రాకపోవడం దుర్మార్గమన్నారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జకృష్ణ, విద్యార్థి నాయకులు ర్యాగరమేష్‌, నీల వెంకటేష్‌, పాండు, కుల్కచర్ల శ్రీనివాస్‌, రాజేందర్‌, అంజి తదితర వందలాది మంది పాల్గొన్నారు.