చంద్రబాబు విదేశి పర్యటనపై కేంద్రం అంక్షలు 

Chandrababunaidu
Chandrababunaidu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు దావోస్‌ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చంద్రబాబు విదేశీ పర్యటనపై కేంద్రం ఆంక్షలు పెట్టడం ఇదే తొలిసారి. దావోస్‌ పర్యటనను  7 రోజులకు బదులుగా 4  రోజులకే కుదించుకోవాలని కేంద్రం స్పష్టంచేసింది. సిఎం  వెంట 14 మంది ప్రతినిధులు వెళ్లేందుకు అనుమతి కోరగా… నలుగురికే అనుమతి ఇచ్చింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం) కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు ఈ నెల 20న బయలుదేరి వెళ్లనున్నారు. వివిధ దేశాలకు చెందిన వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులు, ప్రభుత్వాల ప్రతినిధులతో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు నెలకొల్పేందుకు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరవుతున్నారు. ఆయన వెంట మంత్రులు, అధికారులతో కూడిన భారీ ప్రతినిధి బృందం దావోస్‌కి వెళ్లడం  జరుగుతుంది. ఈసారి కూడా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనాలని సిఎం  చంద్రబాబు భావించారు.