గజల్ బెయిల్ అభ్యర్థనపై నిర్ణయం రేపటికి వాయిదా

హైదరాబాద్: మహిళను లైంగికంగా వేధించిన కేసులో గజల్ శ్రీనివాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. బెయిల్ మంజూరు చేయాలంటూ గజల్ తరపు న్యాయవాది ఈ నెల 12న న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ నేడు విచారణకు రావడంతో ఇరు వర్గాల తరఫు న్యాయవాదులు వాదనలు పినిపించారు. నిందితుడి బారిన మరికొంత మంది మహిళలు పడ్డారని బెయిల్‌పై బయటకు వస్తే బాధితులు, సాక్షులను ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసు తరఫు న్యాయవాది వాదించారు. గజల్ శ్రీనివాస్ విషయంలో పోలీసులు అదనపు కేసులు బనాయించారని, ఇప్పటికే గజల్ శ్రీనివాస్ 20రోజులకు పైగా జైలులో ఉన్నారని, ఇప్పటికైనా బెయిల్ ఇవ్వాలని గజల్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఏ2 నిందితురాలిగా ఉన్న పార్వతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పైనా వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం గజల్ శ్రీనివాస్, పార్వతి బెయిల్ పిటిషన్‌కు సంబంధించిన నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది.