గ్రేటర్‌ ప్రచారానికి పవన్‌ కల్యాణ్‌ని ఆహ్వానించే యోచనలో టి.టిడిపి నేతలు

Pawan Kalyan

హైదరాబాద్‌ : జిహెచ్‌ఎంసి ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీలు తమ ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గ్రేటర్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టి.టిడిపి నేతలు ప్రచార బరిలోకి సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఆహ్వానించే పనిలోపడ్డారు. త్వరలో పవన్‌ కల్యాణ్‌ను టి.టిడిపి ముఖ్యనేతలు స్వయంగా కలిసి ఆహ్వానించనున్నట్లు తెలిసింది. అయితే తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్లకు ఝలక్‌ ఇచ్చినట్లు సమచారం. టి.టిడిపి నేతలు మంగళవారం పవన్‌కు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. త్వరలో జరుగనున్న జిహెచ్‌ఎంసి ఎన్నికల నేపథ్యంలో బిజెపి, టిడిపి కూటమి తరపున ప్రచారం చేయాలని తెలుగుతముళ్లు కోరగా.. అందుకు పవన్‌ కల్యాణ్‌ ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. ప్రస్తుతం సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ షూటింగ్‌లో తీరకలేకుండా ఉన్న పవన్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి వస్తాడో, రాడో స్పష్టంగా తెలియడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి. కాగా 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బిజెపి, టిడిపి తరపున పవన్‌ ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో గ్రేటర్‌ ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూసిన తెలుగు తమ్ముళ్లకు పవన్‌ నుంచి ఎలాంటి ఖచ్చితమైన హామీ రాకపోవడంతో నిరాశలో పడినట్లు సమాచారం. అయితే పార్టీ అధినేత, ఎపి సిఎం చంద్రబాబు చొరవ తీసుకుని మాట్లాడితే పవన్‌ కల్యాణ్‌ ఒప్పుకోవచ్చుననే అభిప్రాయం టిడిపి నేతలు వ్యక్తం చేస్తున్నారు.