గ్రామాల్లో పడకేసిన పాలన

VILLAGES
VILLAGES

ఒక్క అడుగు ముందుకు పడని వైనం
నిధుల లేక నీరసిస్తున్న గ్రామాలు
మరికొన్న చోట్ల సిబ్బంది కొరత
పడకేసిన పన్ను వసూళ్లు
హైదరాబాద్‌: గ్రామ పంచాయితీలలో పరిపాలన పడకేసింది. పాలన అస్తవ్యస్థంగా మారింది. నిధులు కొరత, ప్రత్యేకాధికారులు పాలన, ఎన్నికల కోడ్‌ అన్ని కలిసి గ్రామాల్లో అభివృద్ధి ముందుకు సాగడం లేదు. బతుకమ్మ పండగ సందర్భంగా గ్రామాల్లో నిధులు వెచ్చించలేని పరిస్థితులు నెలకొన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రత్యేకాధికారులతో పాటు గ్రామకార్యదర్శుల కొరత కారణంగా ఆర్థిక పరిస్థితులు మరింత అధ్వాన్న స్థితికి వస్తున్నాయి. గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. గ్రామాల్లో పాలనాధికారి ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయితీలలో సర్పంచ్‌ల పాలన ఈ యేడాది ఆగస్టు 2వ తేదితో ముగిసింది. అప్పటి నుంచి పాలన ప్రత్యేకాధికారులు చేతుల్లోకి వచ్చింది. గతంలో కంటే అధికారుల పాలనలో ప్రజలు తీవ్ర అసంతృప్తి ఉంది. అధికారులు తమ ప్రాంతాలకు రావడం లేదని, సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎన్నికలు కోడ్‌ ఉండడంతో కనీస మౌలిక సదుపాయాల విషయంలో పాలనలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని చోట్ల నిధులు, మరికొన్ని చోట్ల నిధులు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకోలేదని పరిస్థితులు ఉన్నాయి. ప్రతి గ్రామపంచాయితీకి ఒక్కొక్క కార్యదర్శి ఉండాల్సి ఉండగా, ఐదారు గ్రామపంచాయితీలకు ఒక కార్యదర్శిని నియమించడంతో పనులు ఏ విధంగా ముందుకుసాగుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు గతంలో కేటాయించిన నిధులను సైతం వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. పారిశుధ్యం, వీధి దీపాలు, మంచినీరు తదితర వాటి విషయంలో ఖర్చు చేసేందుకు వెనకంజు వేస్తున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తే తప్ప పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. రెండు నెలల్లో ఎన్నికలు జరపాలన న్యాయస్థానం ఆదేశించింది. ఆ దిశగా అధికారులు చర్యలు ప్రారంభించలేదు.
ఒక్కొక్క గ్రామానికి ఒక్కో కార్యదర్శిని నియమిస్తే అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించే అవకాశం ఉంది. కానీ ఐదారు గ్రామాలకు కలిసి ఒకరు చొప్పున ఉండడంతో కేంద్ర, రాష్ట్ర పథకాలను అమలుచేయడంలో విఫలం అవుతున్నారు. ఎక్కువ గ్రామాలు కావడంతో ఒత్తిడి పెరిగి ఏ ఒక్క గ్రామంపై కూడా శ్రద్ద చూపించడం లేదు. గ్రామాల్లో కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన కార్యదర్శులు ఒత్తిడితొ ఒక, రెండు గ్రామాలకు వెళ్లి మిగిలిన గ్రామాలపై సవతి ప్రేమ చూపించడంతో ఆ ప్రాంతాలలో అభివృద్ధి కుంటుపడుతుందన్న వాదన విపిపిస్తుంది. పాత, కొత్త గ్రామ పంచాయితీ అన్ని కలిసి 12741కి చేరాయి. ఐదారు గ్రామాలకు ఒక కార్యదర్శి చొప్పున నియామకాలు జరిగాయి. మొత్తం 12741 పంచాయితీలు కాగా వాటిలో 4380 కొత్తవి ఉన్నాయి. వీటిలో 1326 గ్రామపంచాయితీల్లో వంద శాతం ఎస్టీలు ఉన్నారు. షెడ్యూల్డ్‌ గ్రామపంచాయితీలు 1311 ఉన్నాయి. 12741 గ్రామపంచాయితీల్లో 1,13,271 వార్డులు ఉన్నాయి.
గ్రామపంచాయితీలన్నింటిని కలిపి క్లస్టర్లుగా విభజన చేశారు. రెండు మూడు, నాలుగు, ఐదు గ్రామంపంచాయితీలను కలిపి ఒక క్లస్టర్‌గా తయారు చేశారు. అంటే నాలుగు గ్రామపంచాయితీలకు ఒక కార్యదర్శి విధులు నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. క్లస్టర్లు మార్చిన క్రమంలో మరింత ఇబ్బందులు వస్తున్నాయి. ఉదాహరణకు కరీంనగర్‌ జిల్లాలో పాత గ్రామపంచాయితీలు 276 ఉండగా, కొత్తవి 54 ఉన్నాయి. అంటే మొత్తం 330 గ్రామాలున్నాయి. వీటిలో 109 మంది మాత్రమే కార్యదర్శులు పనిచేస్తున్నారు. మరోవైపు 167 ఖాళీలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో క్లస్టర్ల పరంగా కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులు పూర్తిస్థాయిలో విధుల్లో లేకపోవడంతో ఆస్తిపన్ను వసూళ్లు, ఇతర పన్నుల వసూలు పూర్తిగా మందగించాయి. సొంత ఆదాయం అంటూ కనిపించకుండా పోయింది. పంచాయితీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు వచ్చినప్పటికీ వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే నిర్మాణంలో అంగన్‌వాడీ భవనాలు, పంచాయితీ భవనాల ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు పనులు ఆగిపోయాయి. గ్రామాల కంప్యూటరీకరణ, ఎల్‌ఇడి బల్బులు, పారిశుద్య పనులు అస్తవ్యస్థంగా మారాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో మరిన్ని పంచాయితీలు ఏర్పడడంతో కొత్తగా ఏర్పడిన వాటిలో సమస్యలు మరింత జఠిలంగా మారింది. కొత్త పంచాయితీలకు డివిజన్లు ఏర్పాటు చేయకపోవడం, డివిజన్‌ పంచాయితీ అధికారి పోస్టులను ఎత్తివేయడం, వారిని కొత్త జిల్లాలకు పంపడంతో అన్ని బాధ్యతలు కార్యదర్శి మాత్రమే చూస్తున్నారు. మరోవైపు పంచాయితీలకు సంబంధించి పనులను పట్టించుకోవాలని ప్రత్యేకాధికారులు పట్టించుకోవడం లేదు. రోజువారి పనుల్లో ఒక్కటి కూడా ముందుకు సాగడం లేదు. పండగల సమయంలో పారిశుధ్య పనులు మొదలు బతుకమ్మ తదితర వాటికి ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం జరుగుతుంది. తెలంగాణలో బతుకమ్మ పండగను గత యేడాది ఘనంగా నిర్వహించడగా, ఈ యేడాది ఇప్పటి వరకు ఏర్పాట్లు చేయలేదు. నిధుల లేమి అంటూ కారణాలు చూపుతూ ఒక్క పని ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ప్రత్యేకాధికారుల పాలనతో పాటు కార్యదర్శుల కొరత, ఎన్నికలు అన్ని కలిసి గ్రామాభివృద్ధి కుంటుపడింది.
ప్రత్యేకాధికారుల పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలంటూ ఆదేశాలును ఆగస్టు 1న జారీ చేశారు. మరోవైపు నిధుల వినియోగం, కొత్త పంచాయితీలకు కొత్తగా బ్యాంకు అకౌంట్‌లకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామపంచాయితీలకు సంబంధించిన నిధుల వినియోగంపై మార్గదర్శకాలు విడుదలయ్యాయి. వాటిలో ఎక్కువ శాతం జీత భత్యాలకు వెళ్లనున్నాయి. 30శాతం పంచాయితీ కార్మికుల జీతభత్యాలు, 20శాతం అంతర్గత రహదారులు, 15శాతం చొప్పున నీటి సరఫరాకు, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, ఐదు శాతం సమావేశాలు, ఇతర ఖర్చులకు ఉపయోగించుకోనున్నారు. మరోవైపు పంచాయితీలను ప్రత్యేక అధికారులకు అప్పగించడం ద్వారా తాగునీటి సరఫరా, కొత్త నిర్మాణాల అనుమతులు, ట్రేడ్‌ లైసెన్సులు, దుకాణాలు, వాణిజ్యవ్యాపార అన్నిలావాదేవీలు పకడ్బందీగా జరగాలన్నారు. వీటిలో ఏ ఒక్కటి కూడా అమలుకు నోచుకోవడం లేదు. రోజురోజుకు పంచాయితీలలో పాలన అధ్వాన్నంగా మారిందన్న వాదన వినిపిస్తుంది.