గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులందరికీ 1న జీతాలు :

Yenamala-2
AP Minister Yenamala

గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులందరికీ 1న జీతాలు :

ట్రెజరీ శాఖ సమీక్షా సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకారం

• జిల్లాల్లో ఒక్కో శాఖకు ఒక డీడీఓ మాత్రమే

• ఇక నుంచి అన్ని డిజిటల్ ఓచర్లే

• ట్రెజరీ శాఖలో జూలై 1 నుంచి ఇ-ఫైలింగ్

• అన్ని శాఖల్లో రెవెన్యూ వ్యయం తగ్గించాలని ఆదేశం

• ఉద్యోగుల ఆధార్ నెంబర్ అనుసంధానం తప్పనిసరి

• ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇచ్చే తేదీపై చర్చ

సచివాలయం,:  రాష్ట్రంలోని అందరు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే  జీతాలు చెల్లించడానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకరించారు. సచివాలయం 2వ బ్లాక్ లోని తన చాంబర్ లో ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్, డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్(డీడబ్ల్యూఏ) విభాగాల పనితీరుని సమీక్షించారు. ఈ సందర్భంగా  గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులకు సంబంధించి 30 ఏళ్లుగా ఉన్న డిమాండ్ జీతాల అంశం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ  రవిచంద్ర వివరించారు. దాంతో వారికి 1వ తేదీనే జీతాలు చెల్లించడానికి మంత్రి అంగీకరించారు.
దీనిని త్వరలో అమలు చేస్తామని అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు స్వయం సంమృద్ధి సాధించాలన్నారు. విద్యార్థుల పరీక్ష ఫీజులు, వాహనాల టాక్స్ చెల్లింపులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ ఫీజుల చెల్లింపులు వంటివి చలానాల రూపంలో కాకుండా ఇక నుంచి ఆన్ లైన్ లో చెల్లించడానికి ప్రజలకు అవకాశం కల్పించాలని మంత్రి ఆదేశించారు. అన్ని రకాల చెల్లింపులకు సంబంధించి డిజిటల్ ఓచర్లను అంగీకరించే విధానం ప్రవేశపెట్టాలని చెప్పారు. ఈ విధానం వల్ల బస్తాల, బస్తాల ఓచర్లను తరలించే భారం తప్పుతుందని, కనిపించని ఓచర్ల కోసం వెతుకులాట ఉండదన్నారు. 13 జిల్లాల్లో ప్రభుత్వంలోని ఒక్కొక్క శాఖకు ఒక్క డీడీఓ (డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్) మాత్రమే ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం పోలీస్ శాఖలో ఈ విధానం కొనసాగుతోందని, అదేవిధంగా అన్ని శాఖలలో అమలు చేయాలని మంత్రి చెప్పారు.
ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్, డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ ఈ మూడు విభాగాల్లో జూలై 1 నుంచి ఇ-ఫైలింగ్ విధానం అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ కార్యకలాపాలు ఆన్ లైన్ లో జరపడం, పేపర్ లెస్ పాలన,  ఇ-చెల్లింపులు వంటి వాటి ద్వారా ప్రభుత్వం వ్యయం తగ్గుతుందన్నారు. అన్ని శాఖల వారు రెవెన్యూ వ్యయం తగ్గించాలని మంత్రి చెప్పారు. ఆదాయ వనరులు సమకూర్చే శాఖలు రాబడికి సంబంధించి చేసే ఖర్చును తగ్గించుకోవాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి తీసుకువచ్చిన అప్పులను తక్కువ వడ్డీకి మార్చి ఆర్థిక భారం తగ్గించాలని చెప్పారు. ప్రభుత్వానికి రావలసిన డబ్బు ఎవరు ఎక్కడ చెల్లించినా వెంటనే ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
   ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రతి పెన్షన్ దారు తమ ఆధార్ నెంబర్లను ట్రెజరీలోని హెచ్ఆర్ఎంఎస్ లో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  జీతాలు, కాంట్ట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు వాటితోపాటు అన్ని రకాల ప్రభుత్వ చెల్లిపులు ఆన్ లోనే చెల్లిస్తున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. సమగ్ర ఆర్థిక యాజమాన్య విధానం(సీఎఫ్ఎంఎస్) అక్టోబర్ 2 నుంచి ఆచరణలోకి తీసుకురానున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. ఈ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జమాఖర్చులు అన్నీ ఆన్ లైన్ లో రియల్ టైమ్ లో జరుగుతాయని వివరించారు.
తద్వారా వ్యవస్థలోని విధానాల్లో సరళీకరణ ఏర్పడి పర్యవేక్షణ పారదర్శికంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి ఒకసారి ఇచ్చే  ఇంక్రిమెంట్ ప్రస్తుతం చేరిన తేదీతో సంబంధం లేకుండా  1వ తేదీన ఇస్తున్నారు. దాదాపు 4.45 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందున ప్రతి నెలా ఈ ప్రక్రియ కొనసాగించడంతో పని భారం ఎక్కువైపోతోంది. దీనిని తగ్గించడానికి మూడు నెలలకు ఒకసారి ఒక తేదీన ఇవ్వాలన్న ప్రతిపాదనను పరిశీలించారు. అంటే జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యలో ఏడాది పూర్తి అయ్యే వారందరికీ జనవరి 1వ తేదీనే ఇంక్రిమెంట్ కలుపుతారు. అదేవిధంగా ఏప్రిల్ 1 నుంచి జూన్ 30వ తేదీ మధ్యలోని వారందరికీ ఏప్రిల్ 1న కలుపుతారు. ఈ ప్రతిపాదనపై చర్చించారు.