గులాబీ శ్రేణుల్లో గుబులు

TRS
TRS

‘హరీష్‌ వ్యాఖ్యల కలకలం
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితిలో ఏం జరుగుతోంది? పైకి అంత సవ్యంగా ఉన్నట్లు కన్పిస్తున్నా లోలోపల మాత్రం ఏదో జరుగుతోందనే అనే అనుమానాలు మాత్రం తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్‌ తనయుడు కెటిఆర్‌ రాజకీయాల్లో రంగ ప్రవేశం చేయక ముందు పార్టీలో రెండో కేంద్రంగా ఉన్న హరీష్‌రావుకు ఇప్పుడు సరైన స్థానం లభించడం లేదని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఈ మధ్య ఏ ఇంటర్వ్యూలో చూసినా మంత్రి హరీష్‌రావుకు ఒకే ప్రశ్న ఎదురవుతోంది. కెటిఆర్‌ సిఎం అయితే ఆయన దగ్గర మంత్రిగా పనిచేయటానికి సిద్దమా? అనేది ఆయనకు ఇబ్బందిగా మారిది. కెసిఆర్‌ నాయకత్వంలో ఆయన కోరుకున్న విధంగా, క్రమశిక్షణ కార్యకర్తగా నడుచు కుంటానని చెబుతున్నా, ఆయన మదిలో ఏదో ఆవేదన,నిర్వేదం రగులుతోంది.టిఆర్‌ఎస్‌ నిర్మాణంలో పాలుపంచుకున్న హరీష్‌రావుకు ఇది సహజంగా ఒకింత ఇబ్బందికర పరిణామమే. అయితే ఆయన మాత్రం తనకు కెసిఆర్‌ ఆదేశాలే శాసనం అంటూ ప్రతి వేదిక మీదా చెబుతూ ఉన్నారు. అయినా హరీష్‌రావుకు అమానాలు తప్పటం లేదా? ఎందుకు హరీష్‌రావు శుక్రవారంనాడు ఇంత సంచలన వ్యాఖ్యలు చేశారు. వయస్సు పైబడిన నాయకులు కూడా అందరూ ఇంకా పదవులు పట్టుకుని వేలాడుతున్న ఈ రోజుల్లో హరీష్‌రావు ఏమంత పెద్ద వయస్సు అయిపోయిందని రాజకీయ నిష్క్రమణ వంటి వ్యాఖ్యలు చేయటం. దీని వెనక కారణం ఏంటీ అన్నది టిఆర్‌ఎస్‌ వర్గాల్లో ప్రస్తుతం విస్తృత చర్చ సాగుతోంది. సిద్దిపేట సమీపంలో ఉన్న ఇబ్రహీంపూర్‌ సమావేశంలో మాట్లాడుతూ ‘మీ ప్రేమ, అభిమానం చూస్తుంటే ఇలా ఆదరణ ఉన్నప్పుడే రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమించాలి అన్పిస్తోంది.పదవిలో ఉన్నా లేకున్నా ప్రజా సేవ చేస్తూనే ఉంటా, మీ ఆదరా భిమానాలు చూశాక ఇక రాజకీయాల నుంచి తప్పుకున్నా చాలు అన్పిస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాబీ నబీ ఆజాద్‌ టిఆర్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలకు ధీటుగా బదులిస్తూనే హరీష్‌ మరోవైపు ఇంత బేలగా ఎందుకు మాట్లాడారు? అన్న చర్చ సాగుతోంది. ఇంతకాలం ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన హరీష్‌కు చాలా వరకు అటువంటి బాధ్యతల అప్పగింత ఈ మధ్య తగ్గించారు. ఇప్పుడు ట్రబుల్‌ షూటర్‌ పనులను కెసిఆర్‌ కుమారుడు కెటిఆర్‌ చూస్తున్నారు.సెప్టెంబర్‌ 2న కొంగర కలాన్‌లో జరిగిన ప్రగతి నివేదన సభ నిర్వహణ బాధ్యత కూడా హరీష్‌రావుకు ఇవ్వకుండా పూర్తిగా కెటిఆర్‌కే ఇచ్చారు.కానీ ఆ వెంటనే సెప్టెంబర్‌7న హుస్నాబాద్‌లో జరిగిన పార్టీ ఆశీర్వాద సభ నిర్వహణ బాధ్యత హరీష్‌రావుకే అప్పగించగా ఆ సభను ఆయన విజయవంతం చేశారు.ఇటీవల 105 మంది అభ్యర్థుల ఖరారు తర్వాత ఉమ్మడి మెదక్‌ జిల్లాలో చెలరేగిన అసంతృప్తి జ్వాలలను చల్లార్చే పనులను ప్రస్తుతం హరీష్‌ చూస్తున్నారు. రాష్ట్రంలో మిగతా జిల్లాలను కెటిఆర్‌ చూస్తున్నారు. కానీ మిగతా జిల్లాల నేతలు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని, పార్టీ గెలిచేది ఎలా అంటూ హరీష్‌పై తీవ్రంగా వత్తిడి చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే సిఎం పీఠంపై కెటిఆర్‌ను కూర్చోపెట్టి కెసిఆర్‌ ఢిల్లీ వైపు వెళతారని ప్రచారంలో ఉంది, పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన కొండా సురేఖ కూడా ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్పారు.