గురుదాస్‌పూర్‌లో హ‌స్తానిదే విజ‌యం

sunil jhaker
sunil jhaker

గురుదాస్‌పూర్‌: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షుడు సునీల్‌ జాకడ్‌ ఘన విజయం సాధించారు. బిజెపికి కంచుకోటలాంటి ఈ నియోజకవర్గంలో ఏకంగా 1,93,219 ఓట్ల భారీ ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. జాకడ్‌కు 4,99,752 ఓట్లు రాగా, బిజెపి అభ్యర్థి స్వరణ్‌ సలారియాకు 3,06,533 ఓట్లు వచ్చాయి. ఆప్‌ అభ్యర్థికి కేవలం 23,579 ఓట్లే లభించాయి. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, భాజపా ఎంపీ వినోద్‌ ఖన్నా ఈ ఏడాది ఏప్రిల్‌లో కన్నుమూయడంతో ప్రతిష్ఠాత్మక గురుదాస్‌పూర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమయింది. 1998, 1999, 2004, 2014లలో నాలుగుసార్లు ఖన్నా ఈ స్థానం నుంచే నెగ్గారు. 2009లో మాత్రం వినోద్‌ఖన్నాను ఓడించి కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రతాప్‌సింగ్‌ బజ్వా నెగ్గారు. ఆరు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ఈ ఉప ఎన్నికల్లోనూ దానిని పునరావృతం చేయాలని ఉవ్విళ్లూరింది. తాజా ఎన్నికల్లో విజయం సాధించడంపై జాకడ్‌ స్పందిస్తూ- పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ నాయకత్వంపై ప్రజలు తమ విశ్వాసాన్ని మరోసారి చాటుకున్నారని చెప్పారు. బిజెపిని ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్‌కు ప‌ట్టం క‌ట్టార‌ని సియం అన్నారు. వెంగ‌ర ఉపఎన్నిక‌ల్లో కూడా ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కే ప‌ట్టం క‌ట్టిన విఫ‌యం అంద‌రికీ తెలిసిందే.