గుజ‌రాత్‌లో ఇంటింటి ప్ర‌చారాన్ని ప్రారంభించిన అమిత్‌షా

amith shah in gujarath
amith shah in gujarath

అహ్మదాబాద్‌: వచ్చే నెల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘గుజరాత్‌ గౌరవ్‌ మహా సంపర్క్‌ అభియాన్‌’ పేరిట ఆరు రోజుల ప్రచార కార్యక్రమాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. అభివృద్ధి నినాదంతో ఇంటింటికీ ఓటర్లను పలకరించి భాజపాకు ఓటేయాలని అభ్యర్థించారు. 50 వేల పోలింగ్‌ బూత్‌ల పరిధిలోని ఓటర్లు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు కాకముందు ఎమ్మెల్యేగా వ్యవహరించిన నారాయణపుర నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని షా ప్రారంభించారు. తొలుత ఇక్కడి అంబాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ సైతం రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు మోదీ రాసిన లేఖలను ఇంటింటికీ వెళ్లి పంచిపెట్టారు. భాజపా అభ్యర్థులకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు.