గవర్నర్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్దం

KUNTIA
KUNTIA

హైదరాబాద్‌: పూర్తి మెజార్టీ లేకున్నా గవర్నర్‌ బిజెపికి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ రామచంద్ర కుంతియా విమర్శించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి అప్రజాస్వామ్య పాలనగా కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోందన్నారు. కర్ణాటకలో బిజెపికి ప్రభుత్వం ఏర్పాటు అవకాశం కల్పించడాన్ని నిరిస్తూ భారతదేశ వ్యాప్తంగా శుక్రవారం రోజున ధర్నా చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. ఈ ధర్నాలో పార్టీ శ్రేణులు పాల్గొని కర్ణాటకలో అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని కోరారు. యడ్యూరప్ప సిఎం అవుతానని ముందే చెప్పడాన్ని బట్టి చూస్తూ బిజెపి నేతలు ముందే ఏర్పాటు చేసుకున్నట్లు స్పష్టమవుతోందని ఆరోపించారు. శాసనసభాపక్షనేత జానారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ జరుగుతున్న అధికార దుర్వినియోగంపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి చర్యను ఖండిస్తూ నిరసన కార్యరకమాలు చేపట్టమని పార్టీ ఆదేశించిందని తెలిపారు. మండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని కుమారస్వామి స్వయంగా చెప్పారని అన్నారు. జెడెఎస్‌ ఎమ్మెల్యేలకు వందకోట్లు ఆఫర్‌ చేస్తున్నారని చెప్పారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే సిఎం కెసిఆర్‌ నోరుమెదపక పోవడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. బిజెపితో కెసిఆర్‌ రహస్య మైత్రి స్పష్టమవుతోందని విమర్శించారు. టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ కాంగ్రెస్‌, జెడిఎస్‌ కూటమి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పినా అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంగా భావించి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లు, జిల్లాల్లో నిరసర కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
నేడు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు
కర్ణాటకలో బిజెపికి అనుకూలంగా వ్యవహరించి యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రశారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని టిపిసిసి నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉదయం 10గంటల నుంచి ఆందోళనలు చేయాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆదేశించారు.