గర్భిణుల్లో టైఫాయిడ్‌

                      గర్భిణుల్లో టైఫాయిడ్‌

PREGNANT
PREGNANT

గర్భిణీల్లో జ్వరాలు వస్తుంటాయి. వైరల్‌ ఫీవర్స్‌, సీజనల్‌ ఫీవర్స్‌, వచ్చి నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుంటాయి. గర్భిణుల్లో పారసిటమాల్‌, ఆంటిబయాటిక్స్‌ వాడితే తగ్గిపోతుంది. ఒక్కోసారి టైఫాయిడ్‌ జ్వరం వస్తే బిడ్డపై ప్రభావం ఉంటుంది. ఇదిఅభివృద్ధి చెందిన పారిశ్రామిక నగరాల్లో చాలా తక్కువ. దక్షిణ అమెరికా, మెక్సికో, ఇండియా, ఈజిప్ట్‌, పాకిస్తాన్‌ వంటి అభివృద్థి చెందే దేశాల్లో ఎక్కువగా కన్పిస్తుంది. ఇది ముఖ్యంగా వర్షాకాలంలో, శీతాకాలంలో, పరిశుభ్రత లేనిచోట, మురికివాడల్లోనూ, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలోని వారికి ఎక్కువగా వస్తుంది. రోడ్లపై ఈగలు, కీటకాలు, దుమ్ము, పడిన ఆహారాన్ని నీరుని తీసుకున్న, గర్భిణీల్లో మట్టి, సుద్ద, బియ్యం, ఇటుక, బొగ్గు వంటి అసహజ పదార్థాల్ని తినాలనే కోరిక (దీన్నే పికా అంటారు) ఉంటుంది. అపరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల టైఫాయిడ్‌ జ్వరం వస్తుంది. జబ్బు పడిన వారి మలమూత్రాదుల వల్ల కలుషితమైన ఆహారం, నీరు వల్ల గర్భిణుల్లో ఈ జ్వరం వ్యాప్తి చెందుతుంది. టైఫాయిడ్‌ సాలెమ్నెల్లా టైఫై అనే సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. ఈ సూక్ష్మజీవులు నోటి ద్వారా నీరు, ఆహార పదార్థాలు శరీరంలోకి ప్రవేశించి చిన్న ప్రేవుల్లోని గ్రంధుల్లో మార్పులు కలిగిస్తాయి. ఇన్‌ఫెక్షన్‌ సోకి లక్షణాలు బయటపడటానికి 10-14 రోజులు పడుతుంది. ఈ సూక్ష్మజీవులు రోగి రక్తంలో, ప్రేవుల్లో ,మలంలో ఉంటాయి. కొంతమందిలో టైఫాయిడ్‌ క్రిములు పసరుతిత్తు(గాల్‌బ్లాడర్‌)లో ఉండిపోయినప్పుడు ప్రతి సంవత్సరం టైఫాయిడ్‌తో బాధపడుతుంటారు.. ఇలాంటి వారు గర్భం దాల్చినప్పుడు తల్లిబిడ్డ ఇద్దరికి ప్రమాదం. ఈ టైఫాయిడ్‌ బాసిల్లె తల్లి నుంచి ప్లాసెంటా ద్వారా బిడ్డకు వస్తుంది. 1000బాసిల్లె ఉంటే ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లే. ఈ టైఫాయిడ్‌ జ్వరాన్నే సన్నివాత జ్వరం, ఎంటరిక్‌ గ్య్రాస్ట్రిక్‌ ఫీవర్‌, అబ్డామినల్‌ టైఫస్‌ అంటారు. లక్షణాలు: టైఫాయిడ్‌ జ్వరం మూడువారాలు లేదా 21 రోజులుంటుంది. లక్షణాలు ఒక రోగికి ఉన్నట్లు మరొక రోగికి ఉండవు. ఇవి రోగి ఆరోగ్య స్థితి, వ్యాధి నిరోధకశక్తి, పరిసరాలు, వ్యాధి తీవ్రతల్ని బట్టి మారుతుంటాయి.
మొదటివారంలో: అనీజిగా ఉండడం, ఒళ్లునొప్పులు, తలనొప్పి, బడలికగా ఉండటం, గొంతునొప్పి, పొడిదగ్గు ఉంటాయి. పొట్టలోని ప్రేగుల్లో వాపు వస్తుంది. దీని వల్ల పొట్ట ఉబ్బరం ఆకలి లేక పోవడం, వికారం, వాంతులు, ఎపిగ్యాస్ట్రిక్‌ పెయిన్‌ ఉంటుంది. నోటిదుర్వాసన, చిగుళ్లవాపు, నాలుకపై తెల్లటి పూత, మలబద్దకం ఉంటుంది. జ్వరం రోజురోజుకు పెరుగుతుంటుంది. మొదటి నాలుగైదు రోజులు 100-101డిగ్రీల ఫారన్‌ హీట్‌ ఉండి, తగ్గుతూ, హెచ్చుతూ క్రమంగా జ్వర తీవ్రత104 డిగ్రీల వరకు పెరుగుతుంది. దీన్నే ‘ స్టెప్‌ లాడర్‌ ఫీవర్‌ అంటారు. వారం చివరలో హైఫీవర్‌ వల్ల రోగి మగతగా ఉంటాడు. పొడిదగ్గు, కండరాల నొప్పులు నాడి నిమిషానికి80 సార్లు కొట్టుకుంటుంది. రోగి ముఖం పొంగరించి ఉంటుంది. వికారం, వాంతులు, ఉంటాయి.
రెండవవారంలో: చిన్న ప్రేవుల్లోని పేయర్స్‌ గ్రంధుల్లో వాపు ఎక్కువై పుండ్లు పడతాయి. జ్వర తీవ్రత ఎక్కువగా 103-104 డిగ్రీల ఫారన్‌ హీట్‌ వరకు ఉంటుంది. రోగి మూలుగుతూ మగతగా ఉంటాడు. సంధి లక్షణాలుంటాయి. నిస్త్రాణ నాడి 100-110 వరకూ ఉంటుంది. రోగి మలమూత్రాలు దుర్వాసనగా ఉంటాయి. పల్చని విరేచనాలు ఎక్కువగా అవుతాయి. ఆయాసం, కడుపుబ్బరం పొత్తి కడుపును అదిమితే నొప్పి ఉంటుంది. స్ప్లేన్‌ పెరుగుతుంది. గర్భిణీల్లొ రాష్‌ ఉండదు.
మూడవవారంలో : జ్వరం సాయంత్రం 104 డిగ్రీలుంటే ఉదయం 102 డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉంటూ, క్రమంగా తగ్గుముఖం పడుతుంది. నిస్త్రాణంతో రోగి కదలికలలేని పరిస్థితి లో ఉంటారు. రక్తస్రావాలు కన్పిస్తాయి. మెంటల్‌కన్‌ఫ్యూజన్‌, ఆకలి లేకపోవడం, బరువుతగ్గడం, నిస్సత్తువ ఉంటుంది. నాల్గవవారంలో రోగి లక్షణాలన్నీ పూర్తిగా తగ్గిమెల్లగా కోలుకుంటారు. జ్వరం నార్మల్‌కు వస్తుంది. నోటి దుర్వాసన తగ్గి ఆకలి అవుతుంది. రాత్రిళ్లు చెమటలెక్కువగా పడుతుంటాయి.
నిర్ధారణ: వైడల్‌ డెస్ట్‌, బ్లడ్‌ కల్చర్‌, రక్త, మలమూత్ర పరీక్షల ద్వారా నిర్థారించవచ్చు.
కాంప్లికేషన్స్‌ : బ్రాంకైటీస్‌, న్యుమోనియా, వెన్నెముకనొప్పి, డీహైడ్రేషన్‌,మూత్రం రాకపోవడం, మూత్రంలో ఆల్బుమిన్‌ రావడం కాలి సిరలలో త్రాంబోసిన్‌ (రక్తంగడ్డ) ఏర్పడటం, న్యూరైటిస్‌, రక్తహీనత, గాల్‌బ్లాడర్‌ వాపు, లారింజైటిస్‌, కంటిచూపు దెబ్బతినడం, చెవుడు, కండ్డకలక, కీళ్లనొప్పులు, స్పాండిలైటిస్‌ జుట్టు రాలిపోవడం, అబార్షన్‌కావడం, 60-80 శాతం మందిలో నెలలు నిండకుండానే కాన్పుకావడం,15శాతం మందిలో గర్భస్థ పిండం చనిపోవడం, నియోనాటల్‌ టైఫాయిడ్‌, యూటిరోప్లాసెంటల్‌ ఇన్ఫెక్షన్‌, గ్యాస్ట్రో ఈసోఫాజియల్‌ రిఫ్లెక్స్‌ పుట్టుకతో లోపాలు 20-25శాతం మందిలో అనేక దుష్పలితాలు ఏర్పడతాయి.
జాగ్రత్తలు:- వ్యక్తిగత చేతుల పరిశుభ్రత అవసరం.రోగిని వెలుతురు, గాలి అందేటట్లు ఉన్న గదిలో వేరువేరుగా పడుకోబెట్టాలి.
– రోగికి పాలు, పళ్ల రసాలు, బార్లీ గంజి, మజ్జిగ, ఇడ్లీ, బ్రెడ్‌గ్లూకోజ్‌ వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. రక్త స్రావాలుంటే ఆహారం ఏమి ఇవ్వకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. టైఫాయిడ్‌ ఉంటే అన్నం తినకుండా ఉంటేనే మంచిది.
– కడుపులో పుండ్లు త్వరగా మానడానికి జ్వరం తగ్గిన తర్వాత సులభంగా జీర్ణమయ్యే పోషకాహారం విటమిన్‌ సి మినరల్స్‌ఉన్నవి ఇవ్వాలి.
– రోగి శరీరాన్ని ప్రతి రోజూ వేడినీళ్లలో తడిపి పిండిన బట్టతో శుభ్రంగా తుడవాలి.
– రోగి మలమూత్రాలు ఇతరుల నుండి వేరుగా విసర్జించేటట్లు చూడాలి. టాయిలెట్స్‌ ఎప్పటికప్పుడు ఫినాయిల్‌తో శుభ్రం చేయాలి.
– రోగి వాడిన వస్తువులు ఇతరులు వాడకూడదు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.
– 1886లో విడ్వర్డ్‌ వైట్‌ టైఫాయిడ్‌ వాక్సిన్‌ కనుగొన్నాడు. దీన్ని ఎండమిక్‌ ఏరియాలో ఎక్కువగా టైఫాయిడ్‌ జ్వరాలంటే పిల్లలకు, గర్భిణీలకు వాక్సిన్‌ ఇవ్వడం మంచిది.
– గర్భిణిగా ఉన్నప్పుడు టైఫాయిడ్‌ వస్తే ప్రమాదకరం 70%అబార్షన్స్‌,బిడ్డలోలోపాలు, ఫ్రీమెచ్యూర్‌ డెలివరీ, రక్తహీనత, అసహజ ప్రసవం వంటివి కలుగుతాయి. చంటి పిల్లల్లో ఫిట్స్‌, విరోచనాలు, ఇన్‌ఫెక్షన్స్‌, టైఫాయిడ్‌ వస్తుంది. కాబట్టి జ్వరం 4-5 రోజుల్లో తగ్గకపోతె వెంటనే డాక్టర్‌ సంప్రదించి వైద్య పర్యవేక్షణలో మందుల్ని వాడాల్సి ఉంటుంది. తల్లిబిడ్డ ఆరోగ్యం ఎలా ఉండేది స్కానింగ్‌ ద్వారా తెలుసుకొని కాంప్లికేషన్స్‌ కూడా చూసుకోవాలి.
హోమియోచికిత్స: జెల్సీమియం- జ్వరం ఆరంభంలో తలనొప్పి, కండరాల నొప్పులు, శరీరం బరువుగా ఉండటం,నిద్ర మత్తుగా ఉండటం, నీరసం, వణుకు ఉంటే వాడదగ్గ మందు.
– రూస్టాక్స్‌: మెదటివారంలో విపరీతమైన కీళ్లనొప్పులు భరించలేక అటుఇటు దొర్లడం, కడుపునొప్పి, విరోచనాలు, చలికి తట్టుకోలేక ఎప్పుడూ కప్పుకోవాలనే అనిపించడం, వేడికాపడం వల్ల ఉపశమనముంటే వాడవచ్చు.
– బాక్టీరియా : ఏమాత్రం కదిలినా ఒళ్లునొప్పులు, మగత, కండరాల నొప్పులు, విపరీతమైన పక్షవాతం వచ్చినంత బలహీనత, నీరసం, జ్వరం, నోటిదుర్వాసన, మలమూత్రాల దుర్వాసన చెమటలున్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు.
– ఏసిడ్‌ఫాస్‌: రెండవ వారంలో మగత, నీరసం, కన్‌ఫ్యూజన్‌ తలంతా మొద్దుబారినట్లుంటే వాడదగ్గ మందు.
– ఆర్స్‌ఆల్బ్‌: మాడవవారంలో ఆందోళన, అస్థిమితం, చనిపోతాననే భయం, కడుపునొప్పి, డ్రీహైడ్రేషన్‌- కంపు కొట్టే విరేచనాలు, నిస్సత్తువ ఉంటే దీన్ని వాడాల్సి ఉంటుంది. వైద్య పర్యవేక్షణలో వ్యాధి లక్షణాల్ని బట్టి మందుల్ని వాడాల్సి ఉంటుంది.
– డాక్టర్‌. కె.ఉమాదేవి, తిరుపతి