గత ప్రభుత్వాలు ఎర్రజొన్న రైతుల సమస్య విస్మరించారు

గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎర్రజొన్న రైతుల సమస్యలపై దృష్టి సారించలేదని..సిఎం కేసిఆర్..మంత్రులు పోచారం, హరీష్‌రావు, ఎంపీ కవితలు అర్మూర్ ఎర్రజొన్న రైతుల సమస్యలను పరిష్కరించారని..ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2008లో ఎర్రజోన్న రైతుల సమస్యల పరిష్కారం కోసం 8 రోజులు అమరణ నిరాహారదీక్ష చేశానని గుర్తు చేశారు. అధికారంలో లేమనే పరేషాన్లో ఉన్న కాంగ్రెస్ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారన్నాఉరు. గతంలో ఎన్నడూలేని విధంగా ఎర్రజోన్న క్వింటాల్‌కు రూ.2300 నిర్ణయించామన్నారు. సిఎం స్వయం రైతు కనుకే వెంటనే స్పందించారన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమై కర్ణాటక బళ్లారిలో ఎర్రజోన్నకు 1600లే మద్దతు ధర ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సిఎం కేసిఆర్ మీద ఎర్రజోన్న రైతులు నమ్మకముంచి తమ ఆందోళనలను విరమించారన్నారు. స్థానిక కాంగ్రెస్ నేత సురేష్‌రెడ్డి మనుషులే దీక్షల్లో పాల్గొన్నారనీ, రైతులెవ్వరూ కాంగ్రెస్ మాటలు నమ్మటం లేదన్నారు. కాంగ్రెస్ హాయంలో ఎర్రజోన్న రైతులు బకాయిల కోసం రోడ్డెక్కితే కాల్పులు జరిపారన్నారు. ఇంత త్వరగా ఏ ఉద్యమం లోనూ పరిష్కారం లభించలేదన్నారు. సురేష్‌రెడ్డి స్పీకర్‌గా ఉండి కూడా ఎర్రజోన్న రైతులకోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఇంత మద్దతు ధర ఇచ్చినా రెచ్చగొడుతున్న సురేష్‌రెడ్డిని తమ దగ్గరకు రావద్దని రైతులు వెనక్కి పంపారన్నారు. ఇంత మద్దతు ధర ఎర్రజొన్నలకు దక్కడం చారిత్రాత్మకమని, రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎంతో చేస్తోందని జీవన్‌రెడ్డి వివరించారు.