క‌మ‌లంలో చేర‌ను.. కొత్త పార్టీః ఉపేంద్ర‌

 

Upendra
Upendra

బెంగళూరుః కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర.. మరో కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగు నెలల కిందటే తాను ప్రారంభించిన పార్టీ నుంచి ఇప్పుడు ఉపేంద్ర తప్పుకున్నారు. సొంత పార్టీలోనే ఉపేంద్రపై కొందరు తిరుగుబాటు చేయడంతో ఆయన బయటకు రాక తప్పలేదు. బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చినా.. తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించి ఉపేంద్ర ఆశ్చర్యపరిచారు. రాజకీయాల్లోనే ఉంటా.. కొత్త పార్టీ పెడతా.. బీజేపీలో చేరను అని ఉపేంద్ర స్పష్టంచేశారు. ఉపేంద్ర ఓ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన సొంత పార్టీ నేతలే ఎదురు తిరిగారు. దీంతో తమ పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు కోరినా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఓంకార పేరుతో కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్లు ఉపేంద్ర సన్నిహితులు చెప్పారు.  కొన్ని నెలల కిందటే ఆయన ప్రజాకీయ పేరుతో ఓ పార్టీ పెట్టారు. అవినీతిని అంతమొందిస్తాం.. వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడతాం అంటూ ఆ పార్టీని ఉపేంద్ర ఆవిష్కరించారు. అయితే పార్టీ పెట్టిన రోజే తన భార్య, సోదరుడికి పార్టీలో అగ్రస్థానాలు ఇవ్వడంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. పార్టీ పెట్టినా.. ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదు. దీంతో పార్టీలో వ్యతిరేకత మొదలైంది. పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ కూడా ఉపేంద్రపై తిరుగుబాటు చేశారు. ఎన్నికలు మరో రెండు నెలల్లోనే ఉన్నా.. ఇప్పటివరకు మేనిఫెస్టో, ప్రణాళిక ఏమీ లేదని ఆయన విమర్శించారు. ఆయన పెద్ద సినిమా స్టారే కావచ్చుగానీ.. నియంతలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. ఇదే విషయమై ఆయనను ప్రశ్నించినా ఏమీ సమాధానం చెప్పలేదని శివకుమార్ అన్నారు.