క‌నువిందు చేసిన అరుణ చంద్రుడు

red moon
red moon

న్యూఢిల్లీః మహా నీలి అరుణ చంద్రుడు (సూపర్ బ్లూ బ్లడ్ మూన్) బుధవారం ప్రపంచ ప్రజానీకానికి కనువిందు చేశాడు. భారీసైజు (సూపర్),ఒకే నెలలో రెండోసారి నిండుచంద్రుడి రూపంలో రావటం (బ్లూమూన్),ఎరుపు వర్ణం (బ్లడ్) ఇవన్నీ కలగలసి వచ్చిన చంద్రుడు అందరినీ అలరించాడు. ఈ విధంగా మూడు లక్షణాలతో చందమామ ప్రత్యక్షం కావటం అత్యంత అరుదైన ఖగోళ పరిణామం. దీనిని చూడటానికి మనదేశంలోనూ ప్రజలు తండోపతండాలుగా ప్లానెటేరియంలకు వెళ్లారు. 1982 తర్వాత తొలిసారిగా సంపూర్ణ చంద్రగ్రహణం, బ్లూమూన్ ఏర్పడటం మనదేశంలో ఇదే తొలిసారి. ఈ అరుదైన ఘటనను తిలకించటానికి స్పేస్ ఇండియా అనే సంస్థ వివిధ పట్టణాలు, నగరాల్లో ప్రత్యేకంగా టెలిస్కోపులను ఏర్పాటు చేసింది. సాయంత్రం 4.21 గంటలకే చంద్రగ్రహణం ప్రారంభమైంది. భూమి ఛాయ నుంచి చంద్రుడు పూర్తిగా తప్పుకునే వరకూ (9.38 వరకూ) గ్రహణం కొనసాగింది.
భూమి నీడలో ఉన్నప్పుడు చంద్రుడు ఎరుపు వర్ణాన్ని సంతరించుకొని అరుణచంద్రుడిగా కనిపించాడు. దీనినే బ్లడ్ లేదా రెడ్ మూన్ అని పిలుస్తుంటారు. గ్రహణం సమయంలో భూమికి అత్యంత సమీపానికి రావటంతో సాధారణం కంటే 14 శాతం అధిక పరిమాణంతో, ప్రకాశంతో చందమామ కనిపించింది. అందువల్లే ఈ చంద్రుడిని సూపర్‌మూన్ (మహాచంద్రుడు)గా కూడా అభివర్ణించారు. ఇక ఈ నెలలో వచ్చిన రెండో నిండుచంద్రుడు కూడా కావటంతో ఈ చందమామను బ్లూమూన్‌గా కూడా పిలిచారు. ఒకేనెలలో రెండోసారి వచ్చే నిండుచంద్రుడిని బ్లూమూన్ అని అంటారు. ఈ విధంగా సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ఒకేసారి ప్రజలకు కనువిందు చేసింది.