క్ల‌స్ట‌ర్ల‌కు కాసులివ్వండి

                         క్ల‌స్ట‌ర్ల‌కు కాసులివ్వండి

SMRUTI IRANI, KTR
SMRUTI IRANI, KTR

మరమగ్గాల ఆధునీకరణకు నిధులు మంజూరు చేయండి
కేంద్ర మంత్రి సృతీ ఇరానీని కలిసిన కెటిఆర్‌
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి మరో 10 హాండ్లూమ్‌ క్లస్టర్లను మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేంద్రాన్ని కోరారు. ఈమేరకు మంగళవారంనాడు ఢిల్లీలో కేంద్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సృతీ ఇరానీని ఆయన కలిశారు. అనంతరం ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని చేనేత కార్మికులను ఆదుకునేందుకు కేంద్రం అందించాల్సిన సహాయం విషయంలో రెండు డిమాండ్లపై కేంద్రంతో మాట్లాడేందుకు ఢిల్లీకి వచ్చానన్నారు. తెలంగాణలోని చేనేత కార్మికుల సంక్షేమార్థం రూ. 12వందల కోట్ల బడ్జెట్‌తో తమ ప్రభుత్వం నేతన్నలకు చేయూత, చేనేత మిత్ర వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో చేనేత హాండ్లూమ్‌ క్లస్టర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కొన్ని క్లస్టర్లను కేటాయించినప్పటికీ, ఇంకా అదనంగా మరో 10 క్లస్టర్లు తెలంగాణ రాష్ట్రానికి కావాలని కేంద్ర మంత్రిని కోరగా. ఆమె వెంటనే జాయింట్‌ సెక్రటరీకి ఫోన్‌ చేసి సానుకూలమైన పరిశీలన తీసుకోవాలిందిగా ఆదేశించార్నారు. ఖమ్మంలోని మధిర, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమరచింత తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులను ఆదుకునేందకు కేంద్రం మంజూరు చేసే క్లస్టర్లు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. గతంలో కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రాల చేనేత మంత్రుల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించామన్నారు. తెలంగాణలోని మరమగ్గాలను, పవర్‌లూమ్స్‌ను ఆధునీకరణ చేసేందుకు తమ ప్రభుత్వం 50 శాతం నిధులు ఖర్చుతో ముందుకు వచ్చిందని, సిరిసిల్ల,నల్లగొండ తదితర ప్రాంతాల్లోని పవర్‌లూమ్స్‌ను ఆధునీకరణ చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో 8వేల మగ్గాలను ఆధునీకరణ చేస్తున్నామని. ఈమేరకు కేంద్ర జౌళిశాఖ నుంచి నుంచి కూడా కొన్ని నిధులు రావాల్సి ఉందని, కేంద్ర నిధులు విడుదల ఆలస్యం కావడం వల్ల మరమగ్గాల ఆధునీకరణ వేగంగా జరగడం లేదన్న విషయం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చామన్నారు. దీనికి స్పందించిన కేంద్ర మంత్రి ముంబాయిలో ఉండే జౌళిశాఖ కమిషనర్‌ కవితా గుప్తాకు ఫోన్‌ చేసి నిధుల విడుదల విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని, అవసరమైతే హైదరాబాద్‌కు వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలన చేయాలని చెప్పారన్నారు.