క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌ ఐపిఒ

IPO
IPO

న్యూఢిల్లీ: దేశంలోని రెండో అతిపెద్ద సూక్ష్మ రుణ సంస్థ క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌ ఈ నెల 8న ఐపిఒకు రాబోతోంది. ఇష్యూలో భాగంగా 1.02 కోట్ల షేర్లను జారీచేసి సుమారు రూ.1130 కోట్ల నిధులను సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా రూ.900 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ జారీచేయనుంది. ఇష్యూ ధరల శ్రేని ఒక్కో షేరుకు రూ.418నుంచి 422గా ఉంది. రిటైల్‌ పోర్షన్‌ వాటా 35 శాతంగా ఉంది. ఈ ఐపిఒకు ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌, క్రెడిట్‌ సూసి సెక్యూరిటీస్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, కోటక్‌ మహీంద్రా కేపిటల్‌ కంపెనీలు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మనేజర్లుగా వ్యవహరిస్తాయి. బెంగళూరు కేంద్రంగా 1991లో ప్రారంభమైన ఈ కంపెనీ ఇంతకుముందు గ్రామీణ్‌ కూట ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సేవలందించేది. 2017 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంతో సంస్థకు 16లక్షల మంది కస్టమర్లుఉన్నారు. దేశంలోని 132 జిల్లాల్లో బ్రాంచీలను కలిగిఉన్న క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌ ప్రస్తుతం 5 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, గోవా, కేరళ, ఒడిషా, పాండిచ్చేరి రాష్ట్రాల్లోనూ ఈ సంస్థ సేవలందిస్తోంది. సూక్ష్మరుణ సంస్థల్లో మల్టీనేషనల్‌ కంపెనీగా గుర్తింపును ఈ సంస్థ కలిగి ఉంది. అలాగే బిజినెస్‌లో గ్రామీణ ప్రాంతం వాటా సింహభాగంగా ఉంది. మొత్తం కస్టమర్లలో గ్రామీణ ప్రాంతంలో 1.85 మిలియన్‌ల మంది ఉన్నారు. బలమైన నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ సంస్థ అతితక్కువ నిర్వహణ ఖర్చులతో చక్కని లాభాలను నమోదుచేస్తోంది. 2017లో ఎన్‌బిఎఫ్‌సి, ఎంఎఫ్‌ఐ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే టాప్‌8 సంస్థల్లో ఈ సంస్థ ఒకటి.