కోహ్లీ శ‌త‌కం

Virat kohli
Virat kohli

నాటింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీ సాధించాడు. 191 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్‌లో 23వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీంతో భారత్‌ ఆతిథ్య జట్టుపై 447 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులతో తృటిలో శతకాన్ని చేజార్చుకున్న భారత కెప్టెన్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఆచితూచి ఆడుతూ శతకాన్ని సాధించాడు. అంతేకాకుండా ఇంగ్లండ్‌ గడ్డపై ఒక సిరీస్‌లో 400 పరుగులకు పైగా పరుగులు చేసిన రెండో భారత కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు. అంతకు ముందు అజారుద్దీన్‌(426) ఈ ఘనతను అందుకున్నాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 124/2తో మూడో రోజు ఆట ఆరంభించిన భారత్‌ బ్యాట్స్‌మెన్‌ కోహ్లి-పుజారాలు బ్రిటీష్‌ బౌలర్లకు ఎలాంటి అవకాశాన్ని ఇవ్వలేదు. ఇం‍గ్లండ్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్‌ బోర్డును పరిగెత్తించారు. పుజారా అర్థ సెంచరీ చేసిన అనంతరం స్టోక్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 113 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.  తర్వాత క్రీజులోకి వచ్చిన రహానేతో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం భారత్‌ స్కోర్‌ 279/3.