కోఫ్తా కర్రీలు

రుచి

ప్రతి బుధవారం)

This slideshow requires JavaScript.

కోఫ్తా కర్రీలు

కూరగాయలతో వెరైటీగా ఎన్ని కూరలు చేసినా ఒకోసారి ఏదో కొత్త వెరైటీ రుచి చూడాలని పిస్తుంది. అలా మీరు కూడా తయారు చేయాలనుకుంటే మీ డిన్నర్‌లోకి ఈ కోఫ్తాకర్రీలు చాలా బాగుంటాయి. మరి ప్రయత్నించండి.

క్యాబేజి కోఫ్తా

కావలసినవి
క్యాబేజి-అరకిలో, శనగపిండి-4టేబుల్‌స్పూన్లు నూనె-వేయించడానికి సరిపడినంత గ్రేవీకోసం: ఉల్లిపాయలు-రెండు, అల్లం-చిన్నముక్క, యాలకులు-ఒకటి దాల్చినచెక్క-చిన్నముక్క, లవంగాలు-ఒకటి జీలకర్ర-ఒక టీస్పూన్‌, ధనియాలు-ఒక టీస్పూన్‌ కారం-సరిపడినంత, టమాటాలు-రెండు పలావ్ఞ ఆకులు-రెండు
తయారుచేసే విధానం
క్యాబేజీని సన్నగా తరగాలి. తరువాత అందులో శనగపిండి, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి కలపాలి. వీటిని ఉండలుగా చేసి నూనెలో వేయించి తీయాలి. గ్రేవీ తయారీ: మసాలా దినుసులన్నీ ముందుగా మిక్సీ వేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా గుజ్జులా చేయాలి. ఓ పాన్‌ తీసుకుని అందులో రెండు టీస్పూన్ల నూనె వేసి పలావ్ఞ ఆకులు, మసాలా ముద్ద వేసి వేయించాలి. తరువాత టమాట గుజ్జు కూడా వేసి నూనె పైకి తేలేవరకూ వేయించాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. మంచి వాసన వస్తుండగా వేయించిన కోఫ్తాలను మెల్లగా అందులో వదిలి మూతపెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించి దించాలి.

దాల్‌ కోఫ్తా

కావలసినవి
శనగపప్పు-కప్పు, జీలకర్ర-చెంచా ధనియాలు -చెంచా, ఉప్పు, కారం-రుచికి తగినంత నూనె-వేయించడానికి సరిపడినంత, మొక్కజొన్న పిండి-పావ్ఞ కప్పు గ్రేవీకోసం: జీలకర్ర-అరచెంచా, ఉల్లిపాయముక్కలు-పావ్ఞ కప్పు అల్లం, వెల్లుల్లి ముద్ద-అరచెంచా, పసుపు-చిటికెడు చింతపండు రసం-కొద్దిగా, జీలకర్రపొడి, ధనియాలపొడి-అరచెంచా ఉప్పు-తగినంత, కొత్తిమీర-రెండు చెంచాలు నూనె- మూడు చెంచాలు
తయారుచేసే విధానం
శనగపప్పును శుభ్రంగా కడిగి నానబెట్టాలి. మూడు గంటలయ్యాక నీళ్లు వంపేసి అందులో జీలకర్ర, ధనియాలు, కారం, ఉప్పు, కొత్తిమీర వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత ఉండలుగా చేసి మొక్కజొన్న పిండిలో అద్దుకోవాలి. తరువాత బాణలిలో నూనె వేడిచేసి, ఉండల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో నూనెపోసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు మగ్గించి, అల్లం, వెల్లుల్లి ముద్ద, పసుపు, చింతపండు రసం, జీలకర్ర, ధనియాలపొడి ఉప్పు, కారం, కొత్తిమీర వేసి మూతపెట్టాలి. గ్రేవీ తయారయ్యాక వేయించిన ఉండల్ని అందులో వేయాలి. అవి మెత్తగా అయ్యాక దించేసి కొత్తిమీరతో అలంకరించుకుంటే సరిపోతుంది. దాల్‌కోఫ్తాని అన్నం, పరోటాలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

పనీర్‌ కోఫ్తా

కావలసినవి
పనీర్‌-200గ్రా, బంగాళాదుంపలు-రెండు ఉప్పు, కారం-రుచికి తగినంత, గరంమసాలా-పావ్ఞ చెంచా మొక్కజొన్నపిండి-చెంచా నూనె వేయించడానికి ఉల్లిపాయలు-నాలుగు, టమాటాలు-నాలుగు కొత్తిమీర-కట్ట, పెరుగు-కప్పు జీడిపప్పు-పొడి, పావ్ఞకప్పు,జీలకర్ర-అరచెంచా పసుపు-చిటికెడు, గరంమసాలా-పావ్ఞ చెంచా బిర్యానీ ఆకులు-రెండు , వెన్న-రెండు చెంచాలు

తయారుచేసే విధానం
బంగాళాదుంపలను మూడు కూతలు వచ్చే వరకూ ఉడికించి దించేయాలి. చల్లారాక దుంపల్ని, పనీర్‌ను తురుముకోవాలి. ఈ తురుములో ఉప్పు, కారం, మొక్కజొన్న పిండి, గరంమసాలా చేర్చి పక్కన పెట్టుకోవాలి. కొద్దిసేపయ్యాక చిన్నచిన్న బాల్స్‌లా చేసుకోవాలి. తరువాత బాణలిలో నూనె వేడిచేసి బాల్స్‌ను వేయాలి. అవి బంగారు వర్ణంలోకి వచ్చాక దించేయాలి. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయలను సన్నగా తరిగి కలిపి మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీరను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి. బాణలిలో కొద్దిగా నూనెపోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక జీలకర్ర, బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ, టమాటా ముద్దను వేయాలి. కొద్దిసేపటికి పెరుగు, జీడిపప్పు పొడి, తగినంత ఉప్పు, పసుపు, గరంమసాలా వేసి కలియతిప్పాలి. రెండు నిమిషాలయ్యాక నీళ్లు పోసి మూత పెట్టి సన్నమంట ఉంచాలి. గ్రేవీ దగ్గరగా అయ్యాక వేయించి పెట్టుకున్న కోఫ్తాను వేసి దించి కొత్తిమీరతో అలంకరించుకొంటే సరిపోతుంది.

మొక్కజొన్న కోఫ్తా

కావలసినవి
మొక్కజొన్న గింజలు-కప్పు, శనగపిండి-అరకప్పు అల్లం, వెల్లుల్లి పలుకులు-చెంచా కొత్తిమీర తురుము-నాలుగు చెంచాలు పచ్చిమిర్చి-నాలుగు, ఆమ్‌చూర్‌ పొడి-అరచెంచా ఉప్పు-తగినంత, నూనె-వేయించడానికి సరిపడినంత

తయారుచేసే విధానం
మొక్కజొన్న గింజలు పలుకుల్లా దంచి పెట్టుకోవాలి. అందులో మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని నీరు చేర్చకుండానే కలిపి ఉండల్లా చేసుకోవాలి. వీటిని కాగుతోన్న నూనెలో వేయించి బంగారువర్ణంలోకి వచ్చాక తీసి పెట్టుకోవాలి.

గ్రేవీ తయారీకి:

మొక్కజొన్న గింజలు-చెంచా, వెన్న-రెండు చెంచాలు టమాటాప్యూరీ-కప్పు, గరంమసాలా-అరచెంచా కిచెన్‌ కింగ్‌ మసాలా-చెంచా, ఉల్లిపాయ మిశ్రమం-నాలుగు చెంచాలు అల్లం, వెల్లుల్లి మిశ్రమం-అరచెంచా, ధనియాలపొడి-అరచెంచా పాలు-కప్పు, తాజా క్రీం-రెండు చెంచాలు ఉప్పు, కారం-తగినంత

తయారుచేసే విధానం
బాణలిలో వెన్న కరిగించి మొక్కజొన్న గింజలు వేయించాలి. తరువాత క్రీం, పాలు, కారం తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాలయ్యాక పాలు, ఉప్పు కారం చేర్చి మూత పెట్టేయాలి. కాసేపటికి వెన్న పైకి తేలి మిశ్రమం బాగా ఉడికి దగ్గరపడుతుంది. అందులో వేయించిన కోఫ్తాలు, క్రీం వేసి దింపేస్తే సరిపోతుంది. ఇది పూరీల్లోకే కాదు అన్నంలోకి చాలా బాగుంటుంది.