కోడి పందాలు నిషేధించాలన్న వ్యాజ్యంపై విచారణ

Kodi pandem
– అఫిడఫిట్‌ సమర్పించాలని ఎపి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
– గతంలో హైకోర్టు నిషేధాన్ని కొట్టేసిన సుప్రీంకోర్టు
హైదరాబాద్‌ : కోడి పందాల వాజ్యం మళ్లీ తెర పైకి వచ్చింది. కోడి పందాలు నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. గత సంక్రాంతికి ముందు హైకోర్టు కోడి పందాలను నిషేదించిన విషయం తెలిసిందే. దానిని సుప్రీం కోర్టు ఎత్తివేయడం కూడా అందరికి విదితమే. గత ఏడాది సంక్రాతి పండుగకు రెండు రోజుల ముందు సుప్రీం కోర్టు కోడి పందాలు ఆడకోవచ్చేంటూ తీర్పునిచ్చింది. అయితే పూర్తి విచారణను మాత్రం హైకోర్టుకు అప్పగించడం తెలిసిందే. అదే క్రమంలో పీపుల్‌ ఫర్‌ అనిమల్స్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం పిటిషన్‌ విచారణ జరిగింది. ఆ పిటీషన్‌పై తమ అభిప్రాయాన్ని తెలుపుతూ అఫిడఫిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణను 7వ తేదికి వాయిదా వేసింది. ఈ వివాదానికి సంబంధించి గతంలో కోర్టు వ్యాజ్యం వివరాలిలా ఉన్నాయి.. రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో వందల కోట్ల రూపాయల జూదం కోళ్ల పందాలలో జరుగుతుందనడంలో సందేహం లేదు. జూదం మాట ఎలా ఉన్నా కోడి పందాలలో కత్తులు కట్టడం, పోటీలు పెట్టడం కోళ్లను హింసించే ప్రక్రియ అని జంతు సంక్షేమ సంఘం భావించింది. దీంతో వారు 2014లో ఉమ్మడి హైకోర్టులో కోడి పందాలు నిషేధించాలంటూ పిటీషన్‌ దాఖలు చేశారు. వారి వాదనలు విన్న కోర్టు పోలీసు, ప్రభుత్వ అభిప్రాయాలు తీసుకుంది. చివరకు రెండు రాష్ట్రాలలో కోడి పందాలు నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయంపై పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బిజెపి నాయకుడు రఘురామ కృష్ణంరాజు సుప్రీం కోర్టులో హైకోర్టు తీర్పును సవాల్‌ చేశాడు. కోడి పందాలు సంక్రాంతి పండుగ సంస్కృతిలో భాగమని అలాంటి సాంప్రదాయాన్ని ఎలా కాదంటారు అంటూ ప్రశ్నించారు. అంతే కాక కోడి పందాలలో కోడికి కత్తి కట్టకుండా, డబ్బులు పెట్టకుండా ఆడుకునేందుకు అనుమతించాలని కోరాడు. అతని వాదనలు విన్న సుప్రీం కోర్టు కత్తులు, జూదం లేకుండా ఆడుకోవడంలో తప్పులేదని భావించింది. అంతే కాక కోడి పందాల నిషేధంపై అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోక ముందే హైకోర్టు ఎలా నిర్ణయం తీసుకుందని హైకోర్టును ప్రశ్నించింది. దీంతో కోడి పందాల నిషేధంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. హైకోర్టు నిషేధానికి ముందు కొడి పందాలకు సంబంధించి ఎలాంటి అనుమతులు ఉన్నాయో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని యధాతథంగా కొనసాగించాలని తీర్పునిచ్చింది. అంతే కాక కోడి పందాల నిషేధం కోరుతూ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన జంతు సంరక్షణ సంఘం ఎదైనా వాదనలు విన్పించేది ఉంటే హైకోర్టులోనే విన్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత సంక్రాంతికి భారీ ఎత్తున కోళ్ల పందాలు జరిగాయి. ఈ సంక్రాతికి అప్పుడే సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితులలో కోర్టులో విచారణ జరుగుతోంది. తీర్పు ఎలా ఉంటోందనన్న ఆసక్తి పందెం రాయుళ్లలో నెలకొంది.