కోడిగుడ్డుతో పసందైన వంటలు

రుచి

This slideshow requires JavaScript.

కోడిగుడ్డుతో పసందైన వంటలు

ఎగ్‌ మసాలా

కావలసినవి గుడ్లు-నాలుగు నూనె-ఒక టేబుల్‌స్పూన్‌ జీలకర్ర-ఒక టేబుల్‌స్పూన్‌ ఉల్లిపాయ-ఒకటి దాల్చిన చెక్క-3 అంగుళాల ముక్క ధనియాలపొడి-రెండు టేబుల్‌స్పూన్లు కచ్చాపచ్చాగా కొట్టిన ఎండుమిర్చి పొడి-అర టేబుల్‌స్పూన్‌ పసుపు-అర టేబుల్‌స్పూన్‌ వెల్లుల్లి-రెండు రెబ్బలు ఉప్పు-సరిపడా టమాటాలు-రెండు మంచినీళ్లు-కప్పు కొత్తిమీర తురుము-ఒక టేబుల్‌స్పూన్‌

తయారుచేసే విధానం
కోడిగుడ్లను ఉడికించాలి. తరువాత పెంకు తీసి కాసేపు మంచినీళ్లలో వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల తెల్లసొన సాగకుండా ఉంటుంది. నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనెవేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు దాల్చినచెక్క ముక్కలు వేయాలి. ఉల్లిముక్కలు వేగాక ధనియాలపొడి, ఎండుమిర్చి పొడి, పసుపు, వెల్లుల్లి, ఉప్పు వేసి కలపాలి. రెండు నిమిషాల తరువాత సిమ్‌లో పెట్టి సన్నగా తరిగిన లేదా మెత్తగా రుబ్బిన టమాట గుజ్జు వేసి, నీళ్లుపోసి మూతపెట్టి ఉడికించాలి. గ్రేవీ పచ్చివాసన పోయి మంచి వాసన వస్తూ దగ్గరగా ఉడికిన తరువాత నీళ్లు వంపేసి గుడ్లను సగానికి కోసి కూరలో వేసి మరికాసేపు ఉడికించి దించాలి. వడ్డించేముందు కొత్తిమీర చల్లాలి.

ఎగ్‌ కూర

కావలసినవి
కోడిగుడ్లు-4 ఉల్లిపాయ-ఒకటి టమాట గుజ్జు-రెండు టేబుల్‌స్పూన్లు వెల్లుల్లి రెబ్బలు-నాలుగు అల్లం-అర అంగుళం ముక్క పచ్చిమిర్చి తురుము-ఒక టేబుల్‌స్పూన్‌ కొత్తిమీర తురుము-రెండు టేబుల్‌స్పూన్లు ఉప్పు-రుచికి సరిపడాకారం- రెండు టేబుల్‌స్పూన్లు పసుపు-ఒక టేబుల్‌స్పూన్‌ ధనియాలపొడి-అర టేబుల్‌స్పూన్‌ గరంమసాలా-ముప్పావ్ఞ టేబుల్‌స్పూన్‌ నూనె-మూడు టేబుల్‌స్పూన్లు పన్నీర్‌-పావుకిలో
తయారుచేసే విధానం
కోడిగుడ్లను ఉడికించి పక్కన ఉంచాలి. పన్నీర్‌ను ముక్కలుగా కోసి బంగారువర్ణంలోకి మారేవరకూ వేయించి పక్కన ఉంచాలి. ఉల్లిముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి అన్నీ కలిపి మెత్తగా రుబ్బాలి. బాణలిలో నూనెవేసి ఉల్లి మసాలా వేసి గోధుమరంగులోకి మారేవరకూ వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, ధనియాలపొడి వేసి ఓ నిమిషం వేయించాలి. తరువాత టమాట గుజ్జు కూడా వేసి నూనె తేలేవరకూ వేయించాలి. తరువాత కప్పు నీళ్లుపోసి ఆవిరైపోయేవరకూ ఉడికించాలి. తరువాత పన్నీర్‌ ముక్కలు, ఉడికించిన కోడిగుడ్లు వేసి కలపాలి. ఇప్పుడు మరో కప్పు నీళ్లుపోసి సిమ్‌లో పెట్టి పది నిమిషాలు ఉడికించాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర తురుము చల్లి దించాలి.

ఎగ్‌ బిర్యానీ

కావలసినవి
కోడిగుడ్లు-8 ఉల్లిపాయ-ఒకటి నెయ్యి-అరకప్పు వెల్లుల్లి రెబ్బలు-రెండు పలావ్ఞ ఆకులు-రెండు దాల్చిన చెక్క-అంగుళం ముక్క నల్లయాలకులు-రెండు పచ్చయాలకులు-నాలుగు పసుపు-అర టేబుల్‌స్పూన్‌ కారం-అర టేబుల్‌స్పూన్‌ బాస్మతి బియ్యం-2కప్పులు గోరువెచ్చని నీళ్లు-రెండున్నర కప్పులు ఉప్పు-రుచికి సరిపడా గరంమసాలా-ఒక టేబుల్‌స్పూన్‌ కొత్తిమీరతురుము-ఒక టేబుల్‌స్పూన్‌ టమాటాలు-నాలుగు

తయారుచేసే విధానం
కోడిగుడ్లను ఉడికించి పెంకు తీసి పక్కన ఉంచాలి. బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి ఉల్లిముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత పలావ్ఞ ఆకులు, దాల్చిన చెక్క ముక్కలు, యాలకులు వేసి వేయించాలి. ఇప్పుడు గుడ్లను జాగ్రత్తగా పాన్‌లో వేయాలి. తరువాత పసుపు, కారం వేసి 5నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ముందుగానే కడిగి నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి జాగ్రత్తగా రెండు నిమిషాలు వేయించాలి. తరువాత నీళ్లుపోసి ఉప్పువేసి, గరంమసాలా కూడా వేసి కలిపి మూతపెట్టి మీడియం మంటమీద ఉడికించాలి. నీళ్లన్నీ ఇంకి బియ్యం ఉడికిన తరువాత కొత్తిమీర తురుము చల్లి టమాట ముక్కలతో అలంకరించి వడ్డించాలి.

ఎగ్‌ డ్రాప్‌ కర్రీ

కావలసినవి
ఉల్లిపాయ-ఒకటి టమాట-ఒకటి వెల్లుల్లి-రెండు కొబ్బరిపాలు-అరకప్పు గుడ్లు-నాలుగు ఉప్పు-సరిపడా మసాలా కోసం కాశ్మీరీ మిర్చి-ఆరు ధనియాలు-రెండు టేబుల్‌స్పూన్లు జీలకర్ర-ఒక టేబుల్‌స్పూన్‌ పసుపు-అర టేబుల్‌స్పూన్‌ కొబ్బరితురుము-నాలుగు టేబుల్‌స్పూన్లు చింతపండు-నిమ్మకాయంత వెల్లుల్లి రెబ్బలు-రెండు
తయారుచేసే విధానం
మసాలాకోసం తీసుకున్నవన్నీ మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి మెత్తగా రుబ్బాలి. వెడల్పాటి పాన్‌లో నూనె వేసి కాగాక ఉల్లికముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత టమాటముక్కలు వేయాలి. అవి వేగాక మసాలా వేసి కలపాలి. ఇప్పుడు చిటికెడు ఉప్పువేసి కాసేపు వేయించాలి. తరువాత కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. ఇప్పుడు గుడ్లను పగులకొట్టి సొనను జాగ్రత్తగా కూరలో వేయాలి. ఈ సొనలు ఒకదానికొకటి తగల కుండా, చెదిరిపోకుండా జాగ్రత్తగా వేయాలి. ఇప్పుడు నెమ్మదిగా ఓ స్పూను గ్రేవీని గుడ్ల సొనమీద వచ్చేలా కప్పాలి. ఇప్పుడు సొనలు ఉడికేవరకూ కదపకుండా ఉడికించాలి. తరువాత కొబ్బరిపాలు పోసి మెల్లగా కలపాలి. గుడ్లు పూర్తిగా ఉడికాయి అనుకున్న తరువాత కొత్తిమీర తురుము చల్లి దించాలి. ఈ ఎగ్‌డ్రాప్‌ కర్రీని గోవావాసులు ఎక్కువగా చేసుకుంటారు.