కోట‌కీ హ‌త్య కేసును చేధించిన సిబిఐ

CBIF
CBI

న్యూఢిల్లీ : 9 నెల‌ల‌ క్రితం సిమ్లాలో జరిగిన కొటకీ అత్యాచారం, హత్య కేసును కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌(సిబిఐ) ఛేదించింది. ఈ కేసులో స్థానిక పోలీసుల వాదన తప్పని రుజువు చేసింది. సామూహిక అత్యాచారం జరగలేదని, అనీల్‌ కుమార్‌ అనే వ్యక్తి ప్రమేయం మాత్రమే ఇందులో వుందని వెల్లడించింది. పైగా సంఘటనా స్థలంలో అనుమానితులుగా పేర్కొంటూ స్థానిక పోలీసులు అరెస్టు చేసిన వారిలో నిందితుడు లేడని సిబిఐ తన దర్యాప్తులో కనుగొంది. పోలీసులు అరెస్టు చేసిన అనుమానితుల రక్త నమూనాలతో సంఘటనా స్థలంలో దొరికిన నమూనాలు సరిపోలలేదని స్పష్టం చేసింది. ఈ కేసును ఛేదించడానికి కొత్త రకమైన డిఎన్‌ఎ పర్సంటేజ్‌ మ్యాచ్‌, లైనేజ్‌ మ్యాచ్‌లను ఉపయోగించినట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి. స్థానిక వ్యక్తులు, నేరస్తుల నుండి సిబిఐ 250 డిఎన్‌ఎ నమూనాలు సేకరించింది. పలు శాస్త్రీయ సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత అనీల్‌ కుమార్‌ డిఎన్‌ఎ నమూనాలతో సంఘటనా స్థలంలో లభ్యమైన రక్త నమూనా వంద శాతమూ సరిపోయిందని సిబిఐ బృందం వెల్లడించింది. దీంతో అనీల్‌ కుమార్‌ను అసలైన నిందితుడిగా నిర్ధారించి ఈ నెల 13న హిమాచల్‌ప్రదేశ్‌లోని రోహ్రులో అరెస్టు చేశారు