కోచింగ్‌…టీచింగ్‌….!

                                                   కోచింగ్‌…టీచింగ్‌….!

coaching center
coaching center

                                                      ఉపాధ్యాయ అభ్యర్థులు కోచింగ్‌ సెంటర్ల బాట
                                                5 ఏళ్ల తర్వత నోటిఫికేషన్‌ రాకతో కిక్కిరిస్తున్న కేంద్రాలు
                                                             ఫీజులు అధికం, వసతులు శూన్యం…
                                                         నిబంధనలు పాటించకుండా కేంద్రాలు నిర్వహణ
                                                                   అయోమయంలో అభ్యర్థులు..
హైదరాబాద్‌: టీఆర్‌టీ నోటిఫికేషన్‌తో నగరంలో కోచింగ్‌ సెంటర్లు, ఉపాధ్యాయ అభ్యర్థులతో కిక్కిరిసిపోతున్నాయి. సుమారు 5 ఏళ్ల తర్వాత
నోటిఫికేషన్‌ రావడంతో నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు శిక్షణ తీసుకోవటానికి ఈ కేంద్రాలకు వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల మంది బీఈడీ, డీఈడీ పూర్తి చేసి టెట్‌లో అర్హత పొంది ఉన్నారు. రాష్ట్రం విడిపోకముందు 2012లో చివరిసారిగా డిఎస్సి నిర్వహించారు. మరల తిరిగి ఎప్పుడు ఈ భర్తీలు పూర్తి కాలేదు. దాంతో గతంలో అభ్యర్థులు శిక్షణ పొంది ఉన్నప్పటికీ, ఈ సారి ఎలాగైనా కొలువు సంపాదించాలి. అనే తాపత్రయంతో మరల శిక్షణ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని శిక్షణ కేంద్రాల నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారని పలువురు ఉపాధ్యాయ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. టీఎస్‌పీఎస్‌సీ ఫిబ్రవరిలో ఉపాధ్యాయ నియామక పరీక్ష( టీఆర్‌టీ)ని నిర్వహిస్తామని సిలబస్‌ను, నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దాంతో ఇప్పటీకే వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది అభ్యర్థులు నగరానికి చేరుకున్నారు. రాష్ట్రం మొత్తం మీద సుమారు 2వేల కోచింగ్‌ సెంటర్లు ఉంటే, వాటిలో సగానికి పైగా కేంద్రాలు నగరంలోనే ఉన్నాయి. నగరంలోని అమీర్‌పేట్‌, అబిడ్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, గాంధీనగర్‌, అశోక్‌నగర్‌,  దోమల్‌గూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, కూకట్‌పల్లి, ఎస్‌ఆర్‌ నగర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, ఈసిఐయల్‌, తార్నాక తదితర ప్రాంతాలలో ఈ శిక్షణ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాలన్నీ ఉపాధ్యాయ అభ్యర్థులతో నిండిపోయాయి. ఇప్పటికే ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కొందరు వారి కొలువులకు తాత్కాలికంగా సెలవులు పెట్టి మరి ఈ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్నారు. మరి కొందరైతే ఏకంగా ఆ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి ఉపాధ్యాయ కొలువు కోసం కసరత్తులు చేస్తున్నారు. వాస్తవంగా జీవో నెంబర్‌ 200 ప్రకారం ఒక  పాఠశాల అనుమతి కొరకు ఎన్ని నిబంధనలు వర్తిస్తాయో, అవే నిబంధనలు కోచింగ్‌ సెంటర్లకు కూడా వర్తిస్తాయి. అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి అనుమతితో పాటు, ఒక తరగతి గదిలో ఎంతమంది విద్యార్థులకు కోచింగ్‌ ఇవ్వాలో కూడా ఈ జీవోలో స్పష్టంగా పొందుపర్చారు. కానీ ఈ నిబంధనలకు విరుద్ధంగా నగరంలో కోచింగ్‌ సెంటర్లు నడుస్తున్నాయని పలువురు ఉపాధ్యాయ అభ్యర్థులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఈ కేంద్రాలను పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పలు కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందే అభ్యర్థులు పేర్కొన్నారు. గతంలో కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు డీఈఓ కార్యాలయాల్లో రూ. 1000 తో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనీ, ఆ తర్వాత వాటిని పరిశీలించి శిక్షణ కేంద్రాలు నిర్వహించడానికి అన్ని వసతులు ఉంటే విద్యాశాఖ తరఫున గుర్తింపు ఇస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. గుర్తింపు లేని కేంద్రాలను మూసివేయాలని కూడా గతంలో మంత్రి ప్రకటించారు. కానీ ఇప్పటివరకు కోచింగ్‌ సెంటర్లు రిజిస్ట్రేషన్లకు దరఖాస్తు చేసుకోలేదని విశ్వసనీయ సమాచారం. ఈ కోచింగ్‌ సెంటర్లలో కనీస  నిబంధనలు, ప్రమాణాలు పాటించకున్నా అధికారులు పట్టించుకోవటం లేదని కోచింగ్‌ తీసుకుంటున్న అభ్యర్థులు చెబుతున్నారు. వీటిల్లో కొంత మంది ఒక షెటర్‌లో తాత్కాలిక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుని, శిక్షణ కేంద్రాలను నిర్వహించడానికి ఫంక్షన్‌ హాల్స్‌ను షాపింగ్‌ మాల్స్‌, కాలేజీలు, స్కూల్స్‌, ఆడిటోరియం, ఇండిపెండెంట్‌ ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారని పలువురు చెబుతున్నారు. ప్రతి విభాగంలో సుమారు 500 నుంచి 2000 మందికి ఒకే సారి శిక్షణ ఇస్తున్నారని శిక్షణ పొందే ఉపాధ్యాయ అభ్యర్థులు వెల్లడించారు. ఈ కేంద్రాలలో కనీస వసతులు మంచినీరు, బాత్‌రూములు కూడా లేకుండా కేంద్రాలను నిర్వహిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇక శిక్షణ పొందే ఒక్కో అభ్యర్థి నుంచి సుమారు 15 వేలు నుంచి 20 వేల రూపాయల వరకు కోచింగ్‌ సెంటర్ల యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. వీటితో పాటు మెటీరియల్‌, నోట్స్‌ పేరిట అదనంగా మరో 2 నుంచి 3 వేల రూపాయల తీసుకుంటున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. గతంలో కోచింగ్‌ సెంటర్ల దోపిడీపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పటికీ ఇప్పటి వరకు స్పందన లేకపోవటం గమనార్హం.

ప్రభుత్వానికి అభ్యర్థుల విన్నపం:
నిరుద్యోగులకు అనుగుణంగా జిల్లాకో రెండు, మూడు ప్రభుత్వం తరఫున శిక్షణ కేంద్రాలను పెట్టి కోచింగ్‌ ఇవ్వాలని నిరుద్యోగ అభ్యర్థులు
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.