కొత్త లోక్‌సభకు ‘కొత్త స్పీకర్‌!

OM BIRLA, LOK SABHA SPEAKER
OM BIRLA, LOK SABHA SPEAKER


కొత్త లోక్‌సభకు ‘కొత్త స్పీకర్‌గా రాజస్థాన్‌కు చెందిన ఓమ్‌బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. లోక్‌సభ స్పీకరంటే సాధారణమైన పదవి కాదు. అది అత్యున్నతమైన పదవి. 542 మంది సభ్యులుండే లోక్‌సభాపతి పదవి చిన్నదెలా అవ్ఞతుంది? ఆ గౌరవాన్ని పొందగలగడం కూడా అంత సులభం కాదు. నిజానికి, ఈసారి మొన్న లోక్‌సభ తొలి సమావేశానికి ప్రొటెం (తాత్కాలిక) స్పీకర్‌గా వ్యవహరించిన వీరేంద్రకుమార్‌నే శాశ్వత సభాపతిని చేస్తారని తొలి వార్తలు సూచించాయి. ఇందిరాగాంధీ చిన్న కోడలు మేనకాగాంధీ (బిజెపి) అయినా శాశ్వత స్పీకర్‌ కావచ్చునని కొన్ని వార్తలు సూచించాయి.
కాని, చాలా మందికి తెలియని, వినిపించని ఓమ్‌బిర్లా పేరు అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది! ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. మంచిదే.

ఇదివరలో కొందరు తెలుగువారు కూడా లోక్‌ సభ స్పీకర్‌ పదవి నిర్వహించారు.వారిలో మొదటివారు – తిరు పతికి చెందిన మాడభూషి అనంతశయనం అయ్యంగార్‌. ఆయన ఈ రచయితకు సన్నిహితులు. ఆయన చమత్కార సంభాషణా చతురుడు. మంచి వక్త. లోక్‌సభ మొట్టమొదటి స్పీకర్‌ జి.వి. మౌలంకర్‌ (మహారాష్ట్ర) కాగా, అప్పటిలో డిప్యూటీ స్పీకర్‌గా వ్ఞన్న అయ్యంగార్‌ ఆ తరువాత స్పీకర్‌. ఆ పదవిని అత్యంత సమర్థంగా నిర్వహించిన ఘనత అయ్యంగార్‌కు దక్కింది. ఆయన తరువాతి కాలంలో నీలం సంజీవరెడ్డి లోక్‌సభ స్పీకర్‌అయినారు. విచిత్రం- లోక్‌సభ స్పీకర్‌ అయిన తరువాత సంజీవరెడ్డి ఏకగ్రీవంగా భారత రాష్ట్రపతి అయిన గౌరవం దక్కించుకున్నారు. టి.డి.పికి చెందిన జి.ఎమ్‌.సి బాలయోగి లోక్‌సభ స్పీకర్‌ పదవిని సమర్థంగా నిర్వహించిన మరో తెలుగువారు.


ఇక, ఓమ్‌బిర్లా విషయానికి వస్తే, ఆయన రాజస్థాన్‌లోని కోట నియోజకవర్గం నుంచి మూడుసార్లు శాసనసభ్యులుగా ఎన్నికైనారు. సహజంగా బిర్లాలు వ్యాపారదక్షులు. అంతేకాక, కార్యదక్షులు. మాటకారులు. ఓమ్‌బిర్లా స్పీకర్‌ కావడానికి ఈ లక్షణాలతోపాటు ఆయన ప్రధాని మోడీకి ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రికాక పూర్వమే, అంటే, కిందటి శతాబ్ది చివరి నుంచి కూడా అత్యంత సన్నిహితులు. మోడీ జోడీ అమిత్‌షాకు, ఇప్పటి బిజెపి కార్యవర్గాధ్యక్షుడు జె.పి నడ్డాకు కూడా సన్నిహితుడు.


అయినప్పుడు, రాజుతలచుకుంటే.. అన్నట్టు, అంతటి అదృష్టానికి నోచుకున్న వారికి ఏ పదవి అయినా సులభసాధ్యమే. ఓమ్‌ బిర్లా కామర్స్‌ పట్టభద్రుడు. కోట నియోజకవర్గం నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైనారు. ఓమ్‌బిర్లా తన చాతుర్యం, సహజసిద్ధమైన సంభాషణా నైపుణ్యంతో లోక్‌సభ నిర్వహణలో విజయం సాధించగలరని ఆశించవచ్చు. ఆయన వయస్సు 56 సంవత్సరాలు.

  • డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు(”పద్మశ్రీ అవార్డు గ్రహీత)