కొత్త బడ్జెట్‌ రూ.లక్షా 80వేల కోట్లు

ASSEEMBLY
ASSEEMBLY

కొత్త బడ్జెట్‌ రూ.లక్షా 80వేల కోట్లు

వాడివేడిగా అసెంబ్లీ భేటీకి అంతా సిద్ధం
కత్తులు నూరుతున్న కాంగ్రెస్‌
డాలు సిద్ధం చేసుకుంటున్న టిఆర్‌ఎస్‌
పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాట్లు

హైదరాబాద్‌: ఈసారి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు వాడివేడీగా జరుగనున్నాయా? అధికార టిఆర్‌ఎస్‌ పార్టీకి ఎన్ని కల బడ్జెట్‌ కానుందా? ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ సభలో దుమ్ము రేపనుందా? అనేప్రశ్నలకు సమాధా నాలు రానున్నాయి. ఒక పక్క ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ యాత్రల ప్రభావం, మరో పక్క మిలియన్‌ మార్చ్‌ నిర్వహణ ఇవేమీ పట్టకుండా దేశంలో మూడో ఫ్రంట్‌ ఆలోచనలు, ఇదే సమయంలో రాజ్యసభ ఎన్నికలు తదితరఅంశాలన్నీ అసెంబ్లీని ఉక్కిరి బిక్కిరిచేయనున్నాయి. ఈనెల 12 నుంచి ప్రారంభ మయ్యే బడ్జెట్‌ సమావేశాల నిర్వహణకు అసెంబ్లీ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఈనెల 15న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.ఈసారి వార్షిక బడ్జెట్‌ రూ.లక్షా 75వేల కోట్ల నుంచి రూ.లక్షా 80వేల కోట్ల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. కాగా. ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడివేడీగా ఉండనున్నాయి. ఎలాగో వేసవి కాలం అయినప్పటికీ, ఎసి ఉండే సభలో వేడి వాతావరణమే ఉండనుంది. ప్రజా సమస్యలపై, పాలనా లోపాలపై ఇప్పటికే కాంగ్రెస్‌ మొదటి దఫా యాత్ర చేపట్టింది. అసెంబ్లీ సమావే శాల తర్వాతకూడా రెండో దఫా యాత్ర చేయనుంది. కాంగ్రెస్‌ యాత్రల సమయంలోనే టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లా యాత్రలు చేశారు.కాంగ్రెస్‌ విమర్శలకు అక్కడిక్కడే సమాధానాలు ఇచ్చారు.రైతు సమన్వయ సమితుల శిక్షణా తరగతులు నిర్వహణ సందర్బంగా ప్రధాని నరేంద్రమోడీపై ఏక వచన వ్యాఖ్య చేసి తెలంగాణ బిజెపి వర్గాలకు కోపం తెప్పించారు. కానీ వారి కోపం కెసిఆర్‌కు మరింత కోపం తెప్పించింది. ఏకంగా కాంగ్రెస్‌, బిజెపికి వ్యతిరేకంగా యుద్దం ప్రకటిస్తూ మూడోఫ్రంట్‌ అవసరం ఉందని, దానికి నాయకత్వం వహిస్తానని ప్రకటించి ఏకంగా దేశ రాజకీయాల్లోనే వేడి పుట్టించారు.