కొత్త పంచాయతీరాజ్‌చట్టం పటిష్టమేనా?

                 కొత్త పంచాయతీరాజ్‌చట్టం పటిష్టమేనా?

villages
villages

గ్రామాలే ప్రగతికి పట్టుగొమ్మ లు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. గాంధీ మహాత్ముడు కలలుగన్న గ్రామస్వరాజ్యం ఇప్పటికీ రాలేదు. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలను బలోపేతం చేసి ప్రజలకు మేలు చేసే నూతన పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయవలసి ఉంది. ఇంతకాలంగా నిధులు లేక అస్తవ్యస్తమైన పంచాయతీరాజ్‌ వ్యవస్థను గాడిలో పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. కాని పంచాయతీరాజ్‌ వ్యవస్థను సమూలంగా మార్చుతూ పరోక్షపద్ధతిలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిం చాలన్న ఆలోచన మీద తెలంగాణాలో పెద్దఎత్తున చర్చ సాగు తోంది. తెలంగాణ రాష్ట్రంలో నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకొని రావడం సంతోషం 1981 దాకా సర్పంచ్‌ ఎన్నిక వార్డు మెంబర్ల ద్వారా ఉండేది. వార్డుమెంబర్ల నుండి పరోక్షంగా సర్పంచ్‌ ఎన్నికైనప్పటికి గ్రామాల్లో రాజకీయ గందరగోళాలు జరిగేవి. 1981 తర్వాత గ్రామసర్పంచ్‌ను ప్రజల నుండి ప్రత్యక్షంగా ఎన్నిక విధా నాన్ని ప్రవేశపెట్టారు.

ప్రత్యక్షవిధానం వల్ల యోగ్యులు, అర్హులైన వారు ఓటర్ల నుండి ఎన్నికకాబడి పరిపాలనను అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పంచాయతీరాజ్‌ వ్యవస్థలో ఎన్నో లోపాలున్నాయి. సర్పంచ్‌లు తమవిధులను సక్రమంగా నిర్వహించడం లేదు. గ్రామా లకు మంజూరైన నిధులు సక్రమంగా వాడటం లేదు. గ్రామపంచా యతీ నిర్వహణ సిబ్బందికి జవాబుదారీతనం లేదు. విద్యఅర్హత లేనివారు వార్డుమెంబర్‌, సర్పంచ్‌, ఎంపిటిసి, ఎంపిసి, జెడ్‌పిసిగా ఎన్నికై ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు. చదువ్ఞరాని వారిని సర్పంచ్‌లుగా గెలిపిస్తే వారు పంచాయతీరాజ్‌చట్టం గురించి ఎలా అవగాహన చేసుకుంటారు? ఎలా గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తారు. తెలివిలేని, పరిజ్ఞానంలేని గ్రామసర్పంచ్‌లను మోసం చేసి పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో సమాంతర పాలన చేస్తున్నారు. గ్రామసభలను ఆరునెలలకు ఒకసారి కాకుండా నెలకు ఒకసారి నిర్వహించడం మంచిది. గ్రామ ప్రథమ పౌరుడైన గ్రామ సర్పంచ్‌ ఇంటర్‌ లేదా డిగ్రీ పాసై ఉండాలి. ప్రజల నుంచి ప్రత్య క్షంగా ఎన్నిక జరపాలి.

పరోక్షంగా అంటే వార్డుమెంబర్ల నుండి సర్పంచ్‌ను ఎంపిక చేస్తే ధనవంతులు, ఫ్యూడలిస్టులు లిక్కర్‌ మాఫియా, రియల్‌ఎస్టేట్‌ మాఫియా గ్రామసర్పంచ్‌ సీట్లో కూర్చుం టున్నారు.భారత రాజ్యాంగం 73,74 అధికరణ ప్రకారం పంచాయ తీ రాజ్‌ చట్టాన్ని సవరించాలి. బల్వంతరా§్‌ు మెహతా, జీవికే సింగ్‌ వంటి నివేదికలను ప్రభుత్వం అధ్యయనం చేయాలి. గ్రామ సర్పంచ్‌లను చెప్పుచేతుల్లో ఉంచుకోడానికి ప్రతిపక్షాలను గ్రామస ర్పంచి ఎన్నికల్లో అడ్రస్సు లేకుండా చేయడానికి గ్రామసర్పంచి పద వికి పరోక్ష ఎన్నికల విధానం తెరమీదకు తెచ్చారని విపక్షపార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిధులు ఇచ్చినా, ఏ అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేయాలని తలపెట్టినా గ్రామస్థాయిలో గ్రామపథమపౌరుడు సర్పంచ్‌ ఆధ్వర్యంలోనే సాగుతోంది. కాని పరోక్ష సర్పంచి ఎన్నికల వల్ల పెట్టుబడిదారులు సర్పంచి పోస్టులను వేలంవేసి దక్కించుకునే అవకాశాలుఎక్కువ. ఇంతకాలం ఉత్సవ విగ్రహం వలె నామమాత్రంగా ఉన్న వార్డు మెంబర్‌ పదవి పవర్‌ఫుల్‌ కానుంది.

నెలకొకసారి జరిగే గ్రామసభ, గ్రామపంచాయతీ సమావేశాలకు హాజరయ్యే గౌరవ సభ్యులకు సిట్టింగ్‌ ఫీజు ఇవ్వాలన్నది టిఆర్‌ఎస్‌ ఎన్నికల తాయిలమే. గ్రామ పంచాయితీ పాలక వర్గాల పదవీకాలం ఐదేళ్లు. వచ్చే జూలై 31 నాటికి ప్రస్తుత గ్రామపంచాయితీపాలక వర్గాలకు పాలించే హక్కు ఉంది. ఎన్నికలు జూలై కన్న మూడు నెలల ముందు నిర్వహించు కోవచ్చు. కాని గ్రామసర్పంచి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? ఎలా నిర్వహిస్తారు? ప్రత్యక్షంగా? పరోక్ష పద్ధతా? కొత్తపంచాయ తీల సంగతి ఏమిటి? 200ఓటర్లు ఉన్న తండాలను గ్రామపంచా యతీలుగా మార్చుతున్నారు. దాని సంగతి ఏమిటో తెలియడం లేదు. ప్రభుత్వం ప్రతి గ్రామసర్పంచ్‌కు నెలకు ఐదువేల గౌరవ వేతనం ఇవ్వడంతో గ్రామసర్పంచి పోస్టుకి ఎక్కడ లేని డిమాండ్‌ ఏర్పడింది. క్రేజీ వచ్చింది. గతంలో సర్పంచ్‌ జీతం నెలకు రూ. 750 ఇచ్చేది. అది కూడా గ్రామపంచాయతీ ఇంటి పన్ను వసూలు చేసి తీసుకోవల్సి వచ్చేది. ప్రస్తుత ప్రభుత్వం నెలకు ఐదువేల చొప్పున ఐదుఏళ్లలో మూడు లక్షల రూపాయలు బంగారు పళ్లెంలో పెట్టి సర్పంచ్‌లకు ఇస్తుంది. గల్లీస్థాయి లీడర్లను ‘జోష్‌ పెంచడానికి సర్పంచ్‌ గౌరవ వేతనం నెలకు 15వేలకు పెంచుతారనే ప్రచారం ఉంది.

ఒక వేళ పెంచితే ఐదుఏళ్లలో జీతం ద్వారా తొమ్మిది లక్షలు పొందే అవకాశం వస్తుంది. గ్రామపంచాయతీకి అన్నిపవర్స్‌ ఇచ్చి గ్రామాలను ప్రగతి పథంలో నడిపించాలి. వార్డుమెంబర్‌ సర్పంచి పోస్టుకు విద్య అర్హతను ప్రవేశపెట్టాలి. పనిచేయని సర్పంచ్‌లను రీకాల్‌ చేసి గౌరవ వేతనం నిలిపివేయాలి. ఇదిలావ్ఞండగా ఎమ్‌పిటిసి, జెడ్‌పిటిసిలు తెలంగాణ, ఆంధ్రప్ర దేశ్‌ రాష్ట్రాలో ఉత్సవ విగ్రహం వలె ఉన్నారు. అధికారాలు, బాధ్య తలు లేవ్ఞ. కనీస ప్రోటోకాల్‌ వీరికి లేదు. గ్రామ పంచాయతీలో ఎమ్‌పిటిసికి కుర్చీలేదు. లేని ఎమ్‌పిటిసి పోస్టు తమకు ఎందుకని ఎమ్‌పిటిసిలు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. మండల పరిషత్తు కార్యాలయాల్లో జెడ్‌పిటిసి సభ్యులకు ఛాంబర్‌ లేదు. కనీసం కుర్చీకూడా లేదు. జెడ్‌పిటిసి మీటింగులో మాట్లాడే అధికా రం ఎమ్‌పిటిసి, జెడ్‌పిటిసిలకు ఇద్దరికి ఉంది. ఒక్క డ్యూటీకి రెండు పోస్టులు ఎందుకనే ప్రశ్న వస్తుంది. మండల పరిషత్తు సర్వ సభ్యసమావేశానికి సర్పంచ్‌ ఎమ్‌పిటిసి, సింగిల్‌ విండో ఛైర్మెన్లు ముగ్గురు హాజరై అధికారులను ప్రశ్నిస్తున్నారు.

ఒక పనికి ముగ్గురు ప్రశ్నలు అడగడం అవసరమా? అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఉన్న ఎమ్‌పిటిసి, జెడ్‌పిటిసి పోస్టులను రద్దు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏనాడో బాంబులాంటి ప్రకటన చేశారు. ప్రతినెల ఎమ్‌పిటిసి, జెడ్‌పిటిసిలకు ఇస్తున్న గౌరవవేతనాలు దుబారా కాకుండ చూడటానికే ముఖ్యమంత్రి ఇలా అన్నారని అనుకున్నారు. 2018 ఎన్నికల నాటికి ఎమ్‌పిటిసి, జెడ్‌పిటిసి పోస్టులు రద్దు చేయబడి నేరుగా ఎమ్‌పిపి అధ్యక్షులు, జెడ్‌పి అధ్యక్షులు ఎన్నిక అవ్ఞతారని గ్రామ, మండల, జిల్లాస్థాయి లీడర్లలో చర్చసాగింది. కాని ఇప్పటికి ఎమ్‌పిటిసి, జెడ్‌పిటిసిలు ఉంటాయా? రద్దుచేస్తారా? ఒకవేళ ఉంటే ఎమ్‌పిటిసిలనుండి మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షున్ని జెడ్‌పిటిసి నుండి జెడ్పిఛైర్మన్‌ను ఎన్నుకుంటారా? అన్నదిక్లారిటి లేదు. నూతన పంచాయతీరాజ్‌ చట్టానికి సంబంధించి ముసాయిదా కూడా సిద్ధం అయింది. ఇందులో ఏముందో ఎవరికి తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలసంఖ్య 10 నుండి 31కి పెరగడం వల్ల సర్పంచ్‌ ఎమ్‌పిటిసి, జెడ్‌పిటిసిల పోస్టుల స్థాయి ఘోరంగా మారింది.జిల్లాల పునర్‌విభజన వల్ల మండల పరిషత్తు అధ్యక్షులు, జెడ్పిఛైర్మన్‌ పదవ్ఞలు రిజర్వేషన్‌ వారికిసులభంగా లభించవచ్చు.

56 మండలాలు ఉన్న కరీంనగర్‌జిల్లా ఐదు జిల్లాలుగా మారటంతో జెడ్‌పిటిసి స్థానాలు తగ్గిపోయాయి. కొన్ని జిల్లాల్లో ఆరు జెడ్‌పిటి సిలు ఉండగా మరికొన్ని జిల్లాల్లో 16 దాక జెడ్‌పిటిసిస్థానాలు ఉన్నాయి. 16 జెడ్‌పిటిసి స్థానాల నుండి జెడ్‌పిటిసి ఛైర్మన్‌ను ఎన్నుకోవటం చాలా ఈజీ. జెడ్‌పిటిసి, ఎమ్‌పిటిసి స్థానాలకు సర్పంచ్‌స్థానాలు పరిమితం అయిన నేపథ్యంలో అన్ని స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిపితే క్రీయాశీలురు, రాజకీయ పరిణతిచెందిన వారు అధికారంలోకి వస్తారనే వాదన ఉంది. 1987లో జరిగిన స్థానిక ఎన్నికల్లో జిల్లా ప్రజాపరిషత్‌ ఛైర్మన్‌, మండల ప్రజాపరిషత్‌ ఛైర్మన్‌లను నేరుగా ఎన్నుకున్నారు. అప్పట్లో విద్యావంతులు, యువకులు రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణాలో ఉన్న 463 మండలాలు, జిల్లాపరిషత్‌ల రిజర్వేషన్లు మారనున్నాయి. నూతన పంచాయతీరాజ్‌చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టేముందు, గ్రామ, మండల, జిల్లా పరిషత్‌ సభల్లో డ్రాప్టును ప్రవేశపెట్టి సభ్యులు, వివిధ పార్టీల, విషయనిపుణుల సలహాలు తీసుకోవాలి. హడావిడిగా చట్టం చేస్తే అనర్థమే. 

– రావుల రాజేశం