కేసీఆర్‌ పథకాలతో గెలవలేదు…దొడ్డిదారిన గెలిచారు

addanki dayakar
addanki dayakar

ఎన్నికలలో అక్రమాలపై దొంగలను బయటపెడతాం
టీ పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌
హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ సంక్షేమ పథకాలతో గెలవలేదనీ…దొడ్డిదారిన గెలిచారని టీ పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు. ఎన్నికలలో జరుగుతున్న అక్రమాలను, అక్రమాలు చేస్తున్న దొంగలను బయటపెట్టడానికి కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై పిటిషన్‌ దాఖలు చేశామనీ, వీవీ ప్యాట్‌ల లెక్కింపు జరగాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తున్నదని చెప్పారు. వీవీ ప్యాట్‌లలో నిక్షిప్తం అయిన కౌంటింగ్‌ ఐదేళ్ల వరకు ఉంటుందని ఎన్నికల కమిషన్‌ చెబుతున్నదని చెప్పారు. ఇప్పటికీ 40 రోజులు దాటినా ఎన్నికల కమిషన్‌ సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌ల లెక్కింపు సమాచారం ఇవ్వడం లేదనీ, ఇంకా కొన్ని రోజులు గడిస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. ఈవీఎంలను పోలింగ్‌ అయిన తరువాత స్ట్రాంగ్‌ రూంలలో భద్రపరచాల్సి ఉండగా, ప్రైవేట్‌ ప్లేస్‌కు తరలించారనీ, 12 గంటల తరువాత స్ట్రాంగ్‌ రూంకు తరలించారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో 22 లక్షల ఓట్లు తొలగించబడ్డాయని ఎన్నికల తరువాత రజత్‌కుమార్‌ సారీ చెప్పారనీ, కేసీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులకు బుద్ధి ఉండాలని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగితే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎలా గెలిచిందని కేసీఆర్‌ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ఈవీఎం యంత్రాలు గెలిచాయి…ప్రజలు ఓడారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వివి ప్యాట్‌లు ప్రింట్‌ అయిన తరువాత బాక్స్‌లో పడేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘానికి లేఖ రాయబోతున్నామని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యంతో పాటు…ఓట్ల కూల్చివేత కూడా జరిగిందనీ, పార్లమెంటు ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడానికి ఫిబ్రవరి 1, 2న సమావేశం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాల నుంచి కాంగ్రెస్‌ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. మండల, జిల్లా స్థాయి నేతలతో పార్లమెంటు ఎన్నికలపై సమావేశం ఉంటుందని తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో తాను పోటీ చేబోతున్నాననీ, పార్టీ ఏ స్థానం నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని దయాకర్‌ స్పష్టం చేశారు.