కేశవరెడ్డి స్కూల్స్‌ ఆస్తుల సీజ్‌

– ఆంధ్రాలో రూ.80.67 కోట్లు, తెలంగాణలో రూ.24.55 కోట్లు
– మోసం మొత్తం రూ.750 కోట్లుగా తేల్చిన సిఐడి
– నామ మాత్రపు రికవరీ అంటున్న బాధితులు
హైదరాబాద్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక వెలుగు వెలిగి విద్యార్థుల తల్లిదండ్రులను నట్టేట ముంచిన కేశవ రెడ్డి పాఠశాలల ఆస్తులను సీజ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌.కేశవరెడ్డికి వివిధ సంస్థల పేర్లతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాంతాలలో ఉన్న స్థిరాస్తులను వెంటనే సీజ్‌ చేసినట్లు ప్రకటించారు. ఆ సంస్థ రెండు తెలుగురాష్ట్రాలలో చేసిన మోసం విలువ రూ.750 కోట్లుగా సిఐడీ అధికారులు అధికారికంగా ప్రకటిం చారు. అదే సిఐడీ అధికారులు ఆ సంస్థకు ఆంధ్ర ప్రదేశ్‌లో రూ.80.67 కోట్ల ఆస్తులు, తెలం గాణలో రూ.24.55 కోట్లు ఆస్తులు ఉన్నట్లు తేల్చారు. దీంతో ఆ ఆస్తులన్నింటిని సీజ్‌ చేసినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆస్తుల సీజ్‌ 15 శాతంకు మించలేదన్న విమర్శలు  వినిపిస్తున్నాయి. అదే క్రమంలో సిఐడీ అధికారుల పనితీరుపై కూడా విమర్శలు చేస్తున్నారు. కేశవరెడ్డి గ్రూప్స్‌ పాఠశాలలు విద్యార్థుల డిపాజిట్లకు సంబంధించిన మెచ్యూరిటీలను చెల్లిం చడంలో విఫలమవడంతో వివాదం రేగిన విషయం తెలిసిందే. అది కేవలం డిపాజిట్ల వరకే కాక ఇతర రుణాల విషయంలో కూడా గందరగోళం రేపింది. దీంతో కేశవరెడ్డిపౖౖె డిపాజిట్‌ దారులు,  ఇతర ఆర్థిక వ్యవహారాలలో మెసపోయిన వారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వేర్వరు ప్రాంతాలలో అతనిపై 5 కేసులు నమోదయ్యాయి. ఆ విషయం తీవ్ర వివాదంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దారి తీస్తుందనుకున్న తరుణంలో ప్రభుత్వం కేశవరెడ్డిని అరెస్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో కేశవ రెడ్డి పాఠశాల కేసు విచారణను ప్రభుత్వం సిఐడీకి బదిలీ చేసింది. దీంతో సిఐడీ అధికారులు రంగంలోకి దిగారు. కేశవరెడ్డి సంస్థపై ఉన్న అన్ని కేసులను సిఐడీ ఒక్కటిగా చేర్చి విచారణ జరిపింది. అందులో భాగంగా అన్ని పాఠశాలలో తనిఖీలు చేశారు. ఆ తనిఖీలన్ని కూడా డిపాజిట్ల సేకరణ, చెల్లింపులపైనే జరిగినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి పాఠశాలతో పాటు, తిరుపతిలోని 6 పాఠశాలలు, చిత్తూరు జిల్లా కేంద్ర పరిధిలోని 2 స్కూల్స్‌, శ్రీకాకుళంలోని 3 బ్రాంచీలలో అధికారులు నిశితంగా సోదాలు చేశారు. అక్కడి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. చాలా పాఠశాల్లో కంప్యూటర్ల హర్డ్‌ డిస్క్‌లను కూడా వారు తీసుకుపోయారు. కేశవరెడ్డి స్కూల్స్‌ విద్యార్థుల నుంచి సేకరించిన డిపాజిట్ల మెచ్యూరిటీలు చెల్లించలేదని గుర్తించినట్లు సిఐడీ ప్రకటించింది. ఆ మొత్తం విలువ రూ.750 కోట్లని తేల్చారు.  2010 వరకు చెల్లింపులు సాఫీగా జిరిపిన కేశవరెడ్డి 2011 నుంచి చెల్లింపులు నిలిపివేశారు. అప్పటికే వివాదంకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల మేరకు సిఐడీ అధికారులు విచారణ చేశారు. అదే తరుణంలో సదరు సంస్థలకు రెండుతెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆస్తుల లెక్క తేల్చారు. ఆంధ్ర ప్రదేశ్‌లో 44 ప్రాంతాలలో రూ.80,67,14,446  విలువ చేసే ఆస్తులను, తెలంగాణ రాZషంలోని వేర్వరు ప్రాంతాలలో రూ. 24,55,12,738  విలువ చేసే ఆస్తులను గుర్తించారు. ఆయా ఆస్తులన్నింటిని సీజ్‌ చేసినట్లు ప్రకటించారు. అయితే  డిపాజిట్లు, రుణాలు తదితర మోసాలు రూ.750 కోట్ల వరకు ఉన్నట్లు సిఐడీ అధికారులు లెక్క తేల్చారు.  కాని ఆస్తులు మాత్రం రూ. 104 కోట్ల మేరకే ఉన్నట్లు గుర్తించడంపై డిపాజిట్‌ దారు లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతే కాక ఆ కేసులో రాజకీయ ప్రలోభాలు పని చేసినట్లు విమర్శిస్తున్నారు. కేశవ రెడ్డిని కాపాడేందుకు,  అతని సంస్థలను తమ విద్యాసంస్థలలో కలుపు కునేందుకు ప్రయత్నిస్తున్న నాయకుడు ఇదంతా జరిపి ఉండవచ్చని చర్చ జరుగుతోంది. అద ఏ క్రమంలో సిఐడీ అధికారులు కూడా నిక్కచ్చిగా వ్యవహరించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కేశవరెడ్డి పాఠశాలల ఆస్తుల సీజ్‌ విషయంలో అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటు సిఐడీ అధికారులు కూడా విమర్శలెదుర్కోన్నారు.