కేజీ టు పీజీ వచ్చే ఏడాది నుండి అమలు

Kavitha
టీచర్లకు ఇన్‌కంటాక్స్‌ మినహాయింపునకు కేంద్రంతో కొట్లాడతా : టిఆర్‌ఎస్‌ ఎంపి కవిత
హైదరాబాద్‌ : వచ్చే ఏడాది నుండి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కేజీ టు పీజీ విద్యా విధానం విజయవంతానికి టీచర్లు సైనికుల్లా పని చేయాలని నిజామాబాద్‌ టిఆర్‌ఎస్‌ ఎంపీ కవిత కోరారు. టీచర్లకు ఆదాయ పన్ను మినహాయింపును ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతామన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌ (టిటియు) డైరీ ఆవిష్కరణకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజానికి ఉత్తమ పౌరులను అందిస్తున్న ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులను పడుతున్నారని కవిత పేర్కొన్నారు. ఒకే పని చేస్తున్నా..వేర్వేరు యాజమాన్యాలు ఉండటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. వివిధ రకాల సర్వీస్‌రూల్స్‌ వల్ల అటు టీచర్స్‌, ఇటు ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని ఆమె తెలిపారు.

గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నాశనం చేశాయని కవిత అవేదన వ్యక్తం చేశారు. ముఖమంత్రి కేసిఆర్‌ ఈ పరిస్థితిని మార్చేందుకు యత్నిస్తున్నారన్నారు. అందులో భాగంగానే కులమతాలకు అతీతంగా ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్స్‌ నిర్మాణం జరుగుతోందిన, ముస్లిం విజ్ఞప్తి మేరకు వారికి మండల స్థాయిలోనూ ప్రత్యేక హాస్టల్స్‌ నిర్మిస్తున్నారని కవిత పేర్కొన్నారు. పేదలకు చదువు భారం కాకూడదని సిఎం కేసిఆర్‌ కేజీ టు పీజీ విద్యా విధానాన్ని ప్రకటించారన్నారు. ఇంకెప్పుడు పెడతారంటూ విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయన్నారు. ఆలస్యమైనా…ఒకటికి పదిసార్లు ఆలోచించే సిఎం నిర్ణయం తీసుకుంటారని, ఎవరికి ఇబ్బంది లేనివిధంగానే వచ్చే విద్యా సంవత్సరం నుంచే కేజీటుపీజి విద్యా పథకం అమలవుతుందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో టీచర్స్‌ యూనియన్‌ పాత్ర మరువలేనిదని కవిత కొనియాడారు. టిటియుకు ప్రభుత్వ గుర్తింపు లభించేలా కృషి చేస్తామని ఆమె హామినిచ్చారు. అలాగే సంఘానికి ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటాయన్నారు. ఈకార్యక్రమంలో టిఎన్‌జిఓ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్‌, రాష్ట్ర అద్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్‌, టిటియు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణిపాల్‌రెడ్డి, వేణుగోపాల్‌, రాష్ట్ర నాయకులు రవికిరణ్‌, నరసింహాస్వామి, సుజాత, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.