కేంద్రంపై సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు

Chandrababu
Chandrababu

అమరావతి: సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ కంటే బీజేపీనే ఎక్కువ మోసం చేసిందని ప్రజల్లో బలంగా ఉందని, విభజన హామీలపై కేంద్రం సమీక్ష జరపలేని స్థితిలో ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో పెట్టినవే ఇవ్వమన్నామని, ఇవ్వాల్సినవి ఇవ్వకుండా వక్రీకరిస్తూ లేఖలు రాస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రజలు కట్టిన పన్నుల్లోంచే రాష్ట్రానికి వాటా ఇస్తున్నారని, కేంద్ర విద్యాసంస్థలకు రూ.11672 కోట్లు అవసరమైతే 576 కోట్లు ఇచ్చారని చెప్పారు. కేంద్ర విద్యాసంస్థలకు రూ.11584 కోట్ల విలువైన భూములు ఇచ్చామని ఈ సందర్భంగా బాబు గుర్తుచేశారు. ‘‘ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి వేల కోట్ల విలువైన భూములు ఇచ్చాం. ఇచ్చిన భూములకు డబ్బులు కూడా ఇవ్వలేదు. ఏ రాష్ట్రంలో జాతీయ రహదార్లకు ఎంత ఖర్చు చేశారో… చర్చ జరిగితే అన్ని విషయాలు తెలుస్తాయి. నడికుడి- కాళహస్తి రైల్వేలైన్‌కు భూమిచ్చి 50 శాతం నిధులిచ్చాం. తామే చేశామని కేంద్రం చెబుతోంది. చట్టంలో ఉన్న దుగరాజపట్నం పోర్టు ఏమైంది?. కేంద్రం తీరుతో విజయవాడ మెట్రో మళ్లీ మొదటికొచ్చింది. ఢిల్లీ, ముంబైకి కేంద్రం నిధులు.. ఏపీకి ఏడీబీ రుణం ఇస్తారా?. ఏపీకి ఒక రూల్‌..వేరే రాష్ట్రాలకు మరో రూలా?. నాకు 5 కోట్ల మంది ప్రజలే హైకమాండ్. నీతివంతమైన పాలన ఇవ్వడం తప్ప మరొకటి తెలియదు’’ అని చంద్రబాబు అన్నారు. ప్రత్యేకహోదాపై రాజీపడి తెలుగువారి ఆత్మగౌరవానికి తాకట్టు పెట్టాలా అంటూ కేంద్రాన్ని చంద్రబాబు నిలదీశారు. ఈఏపీ, పన్ను రాయితీలు ఇస్తామని ఎక్కడా చెప్పడం లేదన్నారు. తమను దెబ్బతీయాలనే దుర్బుద్ధి తప్ప మరోటి కనపడడం లేదని ఆయన దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా విషయం తేలాలని, స్పెషల్‌ పర్పస్ వెహికల్‌ ద్వారా హోదా ద్వారా వచ్చే నిధులిచ్చి… కేంద్రం చేతులు దులుపుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ప్రత్యేక హోదా కింద వచ్చే అన్ని రాయితీలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.