కేంద్రంపై కార్మిక వర్గం సమర శంఖం

    కేంద్రంపై కార్మిక వర్గం సమర శంఖం

labour unions
labour unions

జాతీయ స్థాయిలో పది కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, వివిధ ఉద్యోగ, కార్మిక అసోసియేషన్లు కేంద్రంలో మోడీ నాయకత్వంలోని ఏన్టీయే ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరపాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చింది. ఇదివరకే దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల నాయకత్వాన కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై 2015-2016 సంవత్సరాలలో దేశవ్యాప్త సమ్మెలు, 2017 నవంబర్‌ 9,10,11 తేదీలలో లక్షలాది మంది కార్మికులతో పార్లమెంట్‌ స్ట్రీట్‌ ఢిల్లీలో మహాపడావ్‌ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వం గత నాలుగున్నర ఏళ్లుగా ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను దూకుడుగా కొనసాగిస్తున్నది. కార్మికుల, రైతుల, వ్యవసాయ కూలీల సామాజిక తరగతుల బతుకులను దిగదార్చుతున్నది. కేంద్రప్రభుత్వ విధానాల వల్ల సంపన్నుల ఆస్తులు అనేక రెట్లు పెరిగాయి. 73 శాతం సంపద 1 శాతంగా ఉన్న ధనవంతుల వద్ద కేంద్రీకృతమైంది. అందువల్లనే దేశంలో నిరుద్యోగం, కనీస వేతనాలు, గిట్టుబాటు ధరలు, దారిద్య్రం, వలసలు తదితర సమస్యలు పరిష్కారం కావటం లేదు.

కార్పొరేట్‌ అనుకూల విధానాల వల్ల నిత్యావసర ధరలు పెరిగిపోయి, కార్మికుల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయి. రైతాంగానికి గిట్టుబాటు ధర ప్రభుత్వ రుణ వసతి, నాణ్యమైన ఎరువులు, విత్తనాల సరఫరా లేకపోవటంతో ఆత్మహత్యలు పెరిగాయి. రైతుల పరిస్థితే ఇట్లుంటే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది కార్మికుల పరిస్థితి మరీ దారుణం.కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో కార్మికుల్ని బానిసలుగా చేసే కుట్రలో భాగంగా కార్మిక చట్టాల నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం అనేక త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా సవరించి యాజమాన్యాలకు అనుకూలంగా, కార్మికులకు నష్టం జరిగే రీతిలో సవరణకు పూనుకున్నది.

8 గంటల పని విధానానికి తూట్లు పొడిచి పొడిగించే ప్రయత్నాన్ని తీవ్రతరం చేసింది. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదాలతో హైర్‌ అండ్‌ ఫైర్‌ (వాడుకుని వదిలేసే) పద్ధతిలో శ్రమజీవులను బానిసలుగా మార్చే నిర్ణయాలు చేస్తున్నది. ప్రస్తుతం అమలులో ఉన్న ఉద్యోగుల భవిష్యనిధి, ఇయస్‌ఐ మొదలైన వాటిని సంక్షేమ కోర్టు ద్వారా విచ్ఛిన్నం చేయటానికి ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నది. సాంఘీక సంక్షేమ నిధికి కార్మికులు కూడబెట్టిన 24 కోట్ల రూపాయలను షేర్‌ మార్కెట్‌ వ్యాపారానికి మళ్లించటానికి ప్రయత్నం ఉద్దేశపూర్వకంగా మోసపూరితంగా ఈ పథకాలను ఒకే తాటిపైకి తేవాలని ప్రయత్నిస్తుంది.

కార్మికుల కనీస హక్కులను, రక్షణలను, సంక్షేమ పథకాలను అమలు పర్చలేని దుర్భర పరిస్థితులను సృష్టిస్తుంది. పర్మినెంట్‌ ఉద్యోగి వ్యవస్థకు తిలోదకాలు ఇస్తూ కార్మికులను వాడుకొని వదిలేసి పూర్తి దుర్మార్గ చర్యకు పూనుకుంటుంది. మరోవైపు నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ చట్టానికి తూట్లు పొడిచింది. రైతాంగం తీవ్ర సంక్షోభంలోనికి కూరుకుపోయేలా చేస్తున్నది. ఇలా కార్మిక, కర్షక బాగోగులను పట్టించుకోవటం మానేసి కార్పొరేట్‌ సేవలో కేంద్రం మునిగితేలుతున్నది.

1957 ఇండియన్‌ లేబర్‌ కాంగ్రెస్‌ (ఐఎల్‌సి) 15వ తీర్మానం, 1992 సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ ప్రకారం కార్మికుల కనీస వేతనం నేటి మార్కెట్‌ ధరల ప్రకారం నెలకు రూ.26 వేలు ఇవ్వాలి. అయినప్పటికీ 7వ పే కమిషన్‌ సందర్భంగా నిర్ణయించిన రూ.18 వేలను కనీస వేతనంగా అమలు జరపమని దేశంలోని జాతీయ కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా కోరుతున్నప్పటికీ కేంద్రప్రభుత్వం పెడచెవిన పెడుతుంది.

2016 అక్టోబర్‌ 26న సమాన పనికి సమాన వేతన విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు డైరెక్షన్స్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినప్పటికీ వేతన విధానాన్ని అమలు పర్చటం లేదు. కనీస పెన్షన్‌ 6 వేలు అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల మూలధన వాటాల విక్రయం, విశృంఖలంగా సాగిస్తున్న ప్రైవేటీకరణ ఆపాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని, సాంఘీక భద్రతా చర్యలు, సంక్షేమ పథకాలు చేపట్టాలని నూతన పెన్షన్‌ స్కీం రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫెడరేషన్లు దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తున్నా కేంద్రం నిరాకరిస్తుంది.

ప్రొII స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుకు అనుగుణంగా ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించి రైతాంగాన్ని ఆత్మహత్యల గండం నుండి గట్టెక్కించాల్సిన కేంద్ర ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతున్నది. గత ఎన్నికల ముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల భర్తీ చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ వాగ్దానం నెరవేరలేదు. వేలాది ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగులను దగా చేస్తుంది. అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశ తదితర స్కీంల్లో శ్రామిక మహిళల ఉద్యోగ భద్రతకు ముప్పు తెచ్చే ప్రైవేటీకరణ చర్యలను వేగవంతం చేసింది.

మరోవైపు మతం, సాంప్రదాయాలు, మూఢత్వాల పేరుతో దేశ ప్రజల ఐక్యతకు చిచ్చు పెడుతుంది. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించడం, కార్మికుల, ఉద్యోగుల ట్రేడ్‌ యూనియన్‌ హక్కులను ద్వైపాక్షిక, త్రైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించడం, ఉద్యోగుల వేతనాల కొరకు జరిగే సంప్రదింపుల క్రమంలో 7వ పే కమిషన్‌ సిఫార్సు

మేరకు సవరించాల్సిన వేతనాల విషయం పెడచెవిన పెట్టడం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నూన పెన్షన్‌ పథకం రద్దు చేయాలని, కనీస వేతనం అమలుకు గ్యారెంటీ కోరినా ఎటువంటి హామీ లేదు. ఈ నేపథ్యంలో న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు ఐక్యంగా చేస్తున్నసమ్మెకు రాష్ట్రంలోని కార్మికులు ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి.
– ఉజ్జిని రత్నాకర్‌ రావు