కెసిఆర్‌, కెటిఆర్‌తో పవన్‌ ముచ్చట్లు

TS KCR
TS KCR .Pawan

కెసిఆర్‌, కెటిఆర్‌తో పవన్‌ ముచ్చట్లు

రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్‌కు ప్రముఖుల హాజరు

హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఏర్పాటైన ఎట్‌హోమ్‌ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌, టిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌తో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. ఇది రాజకీయ వర్గాల్లో అసక్తి రేకెత్తించింది. ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతివ్వాలని కెటిఆర్‌ ఇటీవల జగన్‌ను కలిసి మద్దతు కోరారు. దీంతో టిఆర్‌ఎస్‌,వైఎస్సార్‌కాంగ్రెస్‌ ఒక్కటయ్యా యని టిడిపి విమర్శిచింది. టిఆర్‌ఎస్‌,వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కలయికను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా తప్పుపబట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెనాలి వెళ్లిన పవన్‌ పెదరావూరు సభలో కార్యకర్తల నుద్దేశించి మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నించారు. వైఎస్‌ జగన్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు టిఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకున్నారు. తెలంగాణలో జగన్‌ను అడుగుపెట్టనీయబోమని ప్రకటించిన నేతలే ఇప్పుడు ఆయనకు సపోర్టు చేస్తున్నారు అని విమర్శించారు. ఏపి సిఎం చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని, ఏపి రాజ కీయాల్లో జోక్యం చేసుకుంటామని తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కెసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై తొలిసారి ప్రనకటన చేసినప్పుడు పవన్‌ కళ్యాణ్‌ స్వాగతించారు. కానీ ఆ తర్వాత ఎప్పుడూ దానిపై స్పందించలేదు.ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ కెసిఆర్‌,కెటిఆర్‌తో చాలా సేపు మాట్లాడటం చర్చనీయాం శమైంది. పవన్‌ కళ్యాణ్‌ వారిద్దరితో ఏం మాట్లాడి ఉంటారనే అంశంపై రాజకీయ వర్గాలు చర్చించుకుం టున్నాయి. గవర్నర్‌ నరసింహన్‌ను కూడా పవన్‌కళ్యాణ్‌ ప్రత్యేకంగా పలకరించారు. కాగా, రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోమ్‌ కార్యక్ర మానికి ఏపినుంచి డిప్యూటీ సిఎం కెఇ కృష్ణ మూర్తి, మంత్రి పితాని సత్యనారాయణ, తెలంగాణ పిసిసిచీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌, టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. అంతకు ముందు జానారెడ్డిని సిఎం కెసిఆర్‌ ప్రత్యేకంగా కలిసి ఆలింగనం చేసుకున్నారు. తర్వాత బట్టి విక్రమార్కతో ప్రత్యేకంగా మాట్లాడారు. రాజ్‌భవన్‌లోని ఎట్‌హోమ్‌ కార్యక్రమంలో కొద్దిసేపు రాజకీయ సందడి నెలకొంది.