కూర ‘గాయాలు’

VEGITABLES SELECTION

కూర గాయాలు

పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అవినీతి, చేతకాని తనంతో అదుపులేకుండా పెరిగిపోతున్న నిత్యా వసర వస్తువ్ఞల ధరలతో ప్రజాజీవనం అతలాకుతలం అవ్ఞతున్నది. రెక్కాడితేకానీ డొక్కాడని నిరుపేదల కాదు మధ్యతరగతితో సహా అన్నివర్గాల ప్రజలు ఈ ధరల భారం మోయలేక అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఇటీ వల పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుల జీవితా న్ని నరకప్రాయం చేస్తున్నాయి.

పేదరికం, ఆకలి, పోష కాల లోపాలతో సంక్రమించే ఆరోగ్యరుగ్మతలను వ్యవ సాయోత్పత్తుల ద్వారా అధిగమించి గ్రామీణ ఉపాధిని పెంపొందించి పేదరిక నిర్మూలనకు బాటలు వేయాల్సిన పాలకవర్గాలు ఆ బాటలో పయనించకపోవడంతో పరిస్థి తులు అంతకంతకు దిగజారిపోతున్నాయి. ప్రతి వ్యక్తికి పోషకాహారాలు తీర్చేందుకు రోజుకు 280 గ్రాముల కూరగాయలు అవసరమని ఏనాడో నిపుణులు వివరిం చారు. కానీ ప్రస్తుతం అంచనాల ప్రకారం వంద గ్రాము లయినా కూరగాయలు లభిస్తున్నాయా? లేదా అనేది సందేహమే.

అయితే కూరగాయల ధరలు అదుపు లే కుండా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ము ఖ్యంగా దళారీ వ్యవస్థ అటు ఉత్పత్తిదారులను, ఇటు వినియోగదారులను దగా చేస్తున్నది. ఇది పాలకులకు తెలియంది కాదు. రైతులకు వినియోగదారుల మధ్య ఈ దళారీ వ్యవస్థను తొలగించేందుకు దశాబ్దాల కొద్దీ పాల కులు ప్రయత్నాలు చేస్తున్నా అవేవి ఆచరణకు నోచు కోవడం లేదు. మరొకపక్క దేశవ్యాప్తంగా కూరగాయల సాగు అంతకంతకు పడిపోతున్నది.

దేశంలో దాదాపు రెండుకోట్ల ఎకరాలకు పైగా సాగవ్ఞ తూ దాదాపు పదికోట్ల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవ్ఞతున్నట్లు అంచనా. పెరిగిన, పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా ఉత్పత్తి జరగడం లేదనేది అందరికీ తెలిసిందే. డిమాండ్‌కు ఉత్పత్తికి ఉన్న తేడానుదళారులు చాకచక్యంతో ఉపయోగించుకుంటూ ధరలనుతమ అదు పులో ఉంచుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే పదేళ్లలో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కనీసం సగం జనాభాకు సరిపోయే కూరగాయలు కూడా ఉత్పత్తి అవ్ఞతాయో లేదోననేఅనుమానాలు వ్యక్తమవ్ఞతున్నాయి. ప్రపంచంలో కూరగాయల ఉత్పత్తిలో మొదటిస్థానంలో ఉన్న చైనాతోపోలిస్తే మనదేశం చాలా తక్కువగా ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో మన వాటా కేవలం పదిహేను శాతానికి మించడం లేదు. ఇక ఎగుమతుల్లో ఒక్క శాత మే ఉందంటే అర్థం చేసుకోవచ్చు.

భారత్‌లో 180 రకాల కూరగాయలు పండిస్తున్నా ఉల్లి,ఆలుగడ్డ, టమో టా, కాలిఫ్లవర్‌, వంగ, ఉత్పత్తులే అరవై శాతంపైగా ఉన్నాయి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఇరవై ఐదులక్షల ఎకరాలకుపైగా కూరగాయలు సాగు చేస్తుంటే ఒక కోటిముప్ఫైలక్షల టన్నుల ఉత్పత్తికి మించ డం లేదు. అందులో టమోటానే అగ్రస్థానంలో ఉంది. ఇక మొత్తం కూరగాయల ఉత్పత్తి, ఉత్పాదకల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాలు తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెం గాల్‌ లాంటి రాష్ట్రాలు కూరగాయల సాగులో మనకంటే చాలా ముందున్నాయి.

ఉభయరాష్ట్రాల్లో కూరగాయల సాగు అంతకంతకు తగ్గిపోతుండటం మరింత ఆందోళన కలిగించే అంశం.నగరాల, పట్టణాల పరిసర ప్రాంతాల్లో ఉన్న కూరగాయల రైతులు సాగుకు స్వస్తి చెప్పారు. ఆ భూములు చాలా వరకు ఫ్లాట్లుగా మారిపోయాయి. ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రోత్సాహం కూడా అంతంత మాత్రంగానే ఉంది. దళారుల ప్రమేయం తగ్గించేందుకు రైతు బజార్లను ప్రవేశపెట్టినా అవి కూడా రానురానూ దళారుల వశమైపోయాయి. రైతుల పేరుతో దళారులే ఆ దుకాణాలను ఆక్రమించుకున్నారు.

దీనికి తగినట్లు ఆయా ప్రాంతాలకు, రుతువ్ఞలకు అనుగుణంగా అవసరమైన కూరగాయల విత్తనాలు అందించే దిశగా పాలకులు చర్య లు చేపట్టడం లేదు. హైబ్రిడ్‌ పేరిట భారీ ధరలతో విత్తనాలను రైతులకు అంటగట్టి అమ్ముకునే బహుళజాతి సంస్థలే కూరగాయల రైతులకు దిక్కయ్యాయి. కూర గాయల విత్తనాల్లో జరిగే అవకతవకలు, దోపిడీని నిరో ధించే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటికైనా పాలకులు కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. విత్త నం దగ్గర నుంచి విక్రయించేవరకు ప్రతిస్థాయిలోనూ దోపిడీకి గురవ్ఞతున్న ఈ చిన్న,బక్కరైతులను ఆదుకు నేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. నాణ్యత లేనివి, నకిలీలతో సాగు ప్రారంభించిన రైతులు చివరకు మునిగిపోతున్నారు.

కూరగాయల సాగు నష్టదాయకమని నిర్ధారణకు వచ్చి న రైతులు అటువైపు తొంగి చూసేందుకు కూడా ఇష్ట పడటంలేదు. ఫలితంగా కొండెక్కిన కూరగాయల ధరలు దిగివచ్చే పరిస్థితి కన్పించడం లేదు. ఇదే పరిస్థితి కొన సాగితే రానున్న రోజుల్లో కూరగాయల ధరలు అందు బాటులో లేకుండాచుక్కల్లోకి వెళ్లే అవకాశాలు కన్పిస్తు న్నాయని వ్యవసారంగ నిపుణులే అంచనావేస్తున్నారు.

కనీసం ఈ పరిస్థితుల నుంచి అటు రైతులను ఇటు విని యోగదారులను కాపాడి కూరగాయలను సరసమైన ధర లకు అందుబాటులో ఉంచడంతోపాటు అటు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించవలసిన గురుతర బాధ్యత పాల కులపై ఉంది. ప్రజలకు పోషకవిలువలతో కూడిన ఆహా రాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత పాల కుల దన్నవిషయం విస్మరించరాదు.విత్తుస్థాయి నుంచే చిత్తవ్ఞతున్న కూరగాయల రైతులను ఆదుకోకుంటే పరి స్థితి మరింత ప్రమాదకరంగా తయారుకాక తప్పదు.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌