కూరగాయల కొరత లేకుండా చర్యలు

vegetables
vegetables

హైదరాబాద్‌: తెలంగాణలో కూరగాయలకు కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని ప్రాంతాల్లో జనాభాకు సరిపడా కూరగాయలు స్థానికంగా సాగు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం క్రాప్‌ కాలనీల పేరుతో ఉద్యాన శాఖ ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి దాన్ని అమలు చేస్తోంది. ఒక్కో క్రాప్‌ కాలనీ కింద 15 నుండి 20 గ్రామాలను ఎంపిక చేసి ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని జిల్లాల్లోని జనాభాకు సరిపడా కూరగాయలను పండించే లక్ష్యంగా ఈ క్రాప్‌ కాలనీలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని జయశంకర్‌ జిల్లాను పరిగణలోకి తీసుకుంటే జిల్లాలో 7,11,280 మంది జనాభా ఉండగా, వీరికి ప్రతీ రోజూ ఒక్కొక్కరికి దాదాపు 300 గ్రాములు కూరగాయలు అవసరం ఉంటుంది. ఈ లెక్కన జిల్లా ప్రజలకు సంవత్సరానికి 84,683 మెట్రిక్‌ టన్నుల కూరగాయలు, 1,093 మెట్రిక్‌ టన్నుల ఉల్లిపాయలు అవసరం అవుతాయి. జిల్లాలో గత ఖరీఫ్‌ సీజనులో అన్ని రకాల కూరగాయల పంటలు కలుపుకుని 2.474 హెక్టార్లలో జిల్లాలోని రైతులు సాగు చేశారు. దీంతో కేవలం 37,129 మెట్రిక్‌ టన్నుల కూరగాయలు మాత్రమే దిగుబడి వస్తోంది. ఇది పోను ఇంకా 47,551 మెట్రిక్‌ టన్నుల కూరగాయలు జిల్లా ప్రజలకు అవసరం అవుతాయి. ఇందులో టమోట ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం జిల్లాల నుండి ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతీ రోజూ కూరగాయల వ్యాపారులు ఇతర ప్రాంతాల నుండి రవాణా చేసుకుంటున్నారు. అలాగే ఉల్లిగడ్డలను కూడా ఇతర ప్రాంతాల నుండి జిల్లా అవసరాలకు తగినట్లుగా దిగుమతి చేసుకుంటున్నారు. ఈవిధంగా ప్రతీ రోజూ ఇతర ప్రాంతాల నుండి కూరగాయలు, ఉల్లిపాయలను దిగుమతి చేసుకోకుండా ఉండాలనే ప్రధాన ధ్యేయంతో కూరగాయల ఉత్పత్తి కోసం క్రాప్‌ కాలనీలను ఏర్పాటుతో స్థానకంగా రైతులు కూరగాయలు పండించి జిల్లా ప్రజలకు అందించే విధంగా చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా జిల్లా పరిధిలోని భూపాలపల్లి, మహదేవపూర్‌, ములుగు, ఏటూరునాగారం ప్రాంతాల్లో క్రాప్‌ కాలనీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఆయా జిల్లాల్లో కూరగాయలు, ఉల్లిపాయల అవసరాలకు తగినట్లుగా వాటిని సాగు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి.