కూటమి ఓటమిపైనే ఆశ!

TS CM KCR
TS CM KCR

హైదరాబాద్‌: విపక్షాల కూటమిపై టిఆర్‌ఎస్‌ అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి ఆశలు పెట్టుకున్నారా..అవును మీరు చదివిందే వాస్తవమే..తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి విజయ దుందుభి మోగిస్తుందనే కొన్ని సర్వేల ప్రచారంతో ఫలితాలపై అంతటా ఆసక్తి కనిపిస్తుండగా, కెసిఆర్‌ శిబిరంలో అంచనాలు మాత్రం కూటమి వల్లనే టిఆర్‌ఎస్‌కు అధిక ప్రయోజనం కలుగుతుందని, విజయం తధ్యమనే విధంగా వారిలో అశలు పెరుగుతున్నట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్‌, టిడిపి, సిపిఐ, టి.జెఎస్‌ల మధ్య పొత్తుల చర్చలు సుదీర్ఘంగా సాగుతుండటంతోపాటు సీట్ల సర్దుబాటు అంత సులువు కాదని తేలడటంతో సహజంగానే ప్రత్యర్థి బలహీనతను తమ బలంగా మార్చుకోవడానికి ఎవరైనా గట్టి ప్రయత్నాలే చేస్తారు. అయితే టిఆర్‌ఎస్‌ ఎలాంటి చొరవ తీసుకోకపోయినప్పటికీ ఇంకా కూటమిగా అవరించని భాగస్వామ్య పార్టీల మధ్య అంతా గందరగోళం నెలకొంది. తాజాగా టిజెఎస్‌ అధినేత కోదండరాం తనకు అత్యధిక సీట్లు కావాలనే అల్టిమేటంతోపాటు కూటమితో సంబంధం లేకుండా తన పార్టీ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తాని చేసిన హెచ్చరికలతో టిఆర్‌ఎస్‌ నేతల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఎవరి బలం ఎంత అనేది తాము నిర్వహించే సర్వే ప్రాతిపదికగా సీట్ల సంఖ్యను నిర్ణయించడంతోపాటు అభ్యర్థుల ఎంపికను ప్రకటిస్తేనే కూటమికి మేలు జరుగుతుందని, ఈ మేరకు తమ లక్ష్యం టిఆర్‌ఎస్‌ను ఓడించగలమని కాంగ్రెస్‌ నేతలు పెద్దన్న పాత్రను పోషిస్తూ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. పైగా ఎవరికి వారు తమ బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకుంటూ అధిక సీట్లనే డిమాండ్‌ చేస్తుండటం వల్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చంధంగా మారి, టిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రయోజనం కలిగిస్తున్నది మంగళవారం పైగా అమవాస్య నాడు సమావేశమై చర్చలు జరపడమే కూటమి భాగస్వామ్య పార్టీల నిర్ణయం లోపంగా చెబుతుండగా, ఈ మీటింగ్‌ జరిగినా అమవాస్య పేరుతో మరో మీటింగ్‌ నిర్వహించి కూటమిలో ఎవరికి ఎన్ని సీట్లు అనేది నిర్ధారిస్తామని నేతలు చెబుతున్నారు. ఉపకరిస్తున్న మైండ్‌ గేమ్‌ ముష్టి మూడు సీట్ల కోసం కోదండ పొర్లుదండాలు పెడుతున్నారని మంత్రి కెటిఆర్‌ విమర్శలు టిజెఎస్‌లో అధికంగానే ప్రభావం చూపాయని అందుకు ఆ పార్టీ కూడమిలో ఎక్కువ వాటా కోసం పట్టుబడుతుందని, టిఆర్‌ఎస్‌ గేమ్‌ ప్లాన్‌ ఈ మేరకు విజయవంతం అయిందని ప్రచారం జరుగుతున్నది. కూటమి లక్ష్యం టిఆర్‌ఎస్‌ ఓటమి కాగా తమతమ బలాలు ఎంతో తెలుసుకోవడానికి ఈ ఎన్నికలే ప్రాతిపదిక ఉండబోతున్నాయని, పోటీ చేస్తే కదా బలం తేలేదనే దృక్పదం ఆయా భాగస్వామ్య పార్టీల మధ్య కనిపిస్తున్నది. కానీ పొత్తులతో చేసే పోటీ ఏ ఒక్క పార్టీ బలం-బలగం కాదని చెబుతున్నా తమతమ పార్టీల ప్రాభల్యం పెంచుకునేందుకు ఈ నాలుగుపార్టీలు చేస్తున్న ప్రయత్నాలు టిఆర్‌ఎస్‌కు మేలు చేసే విధంగా మారుతున్నాయని భావిస్తున్నారు. కూటమి భాగస్వాములైన టిడిపి పరంగా పెద్దగా పేచీలేకపోయినా, ఇతర రెండు పార్టీల వల్లనే కాంగ్రెస్‌కు సమస్యలు పెరుగుతున్నాయి. టిజెఎస్‌ మరింత అధిక సంఖ్యలో సీట్లు డిమాండ్‌చేస్తుండటంతోనే పొత్తుల ప్రక్రియ-సీట్ల సర్దుబాటు జాప్యం జరుగుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. సిపిఐ కూడా మరింత హేతుబద్ధంగా ఉండాల్సిన పరిస్థితిపై చర్చ చేస్తున్నామన్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం 119 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌ స్వంతంగా మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో సింహభాగం తమ పార్టీ అభ్యర్థులను గెలుపించుకునేలా సీట్ల సర్ధుబాటుకు ప్రయత్నాలు చేస్తున్నది. కాదు అంతా తామే అన్నట్లుగా కాంగ్రెస్‌ అధికంగా ఊహించుకుంటుందని, తమ పార్టీ ఉద్యమం నిర్వహించిన కాలం నాటి సపోర్టు తమ నేత కోదండకు అధికంగాఉన్నందునే 30 సీట్లకు పైగా డిమాండ్‌ చేస్తున్నట్లుగా టిజెఎస్‌ నాయకులు భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమ కాలం నాటి కోదండ రాం ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుందని, అన్ని వర్గాల ప్రజలు తమ వైపు ఉన్నారని, దీంతో తాము సముచిత సంఖ్యలోనే సీట్లు కోరుతున్నామనేది వారి వాదనగా ఉంది. సీట్ల సర్దుబాటు జాప్య ంల్ల నష్టం పెరుగుతుందని అందుకే తమ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తున్నామని కూడా ప్రస్తావించారు. కోదండను ఎన్నికల్లో నిలబెట్టకుండా, ఆయన తెలంగాణ వ్యాప్తంగా నాలుగు కూటమి పార్టీల అభ్యర్థుల విజయం కోసం ప్రచారం నిర్వహించేలా బాధ్యత అప్పగించాలనే ప్రతిపాదన కూడా కూటమి నేతలమధ్య చర్చకు వచ్చినప్పటికీ టిజెఎస్‌ నేతలు ఇందుకు ఆసక్తి కనబర్చడం లేదని అంటున్నారు. అయితే కోదండ పార్టీకి వారు కోరుకున్న స్థాయిలో టికెట్టు ఇవ్వడం కుదరదని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. అరడజన్‌ సీట్లకు లోపుగానే ఆ పార్టీకి ఇవ్వడం తమ ఉద్ధేశ్యమని అధిక సీట్లు వారికి కేటాయిస్తే ప్రత్యర్థి పార్టీ టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించేందుక అవకాశం ఇచ్చినట్లు అవుతుందనేది కాంగ్రెస్‌ నేతల వాదనగా ఉంది. ఇదే విధమైన ఆశలతో టిఆర్‌ఎస్‌ శిభిరం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్‌ అభ్యర్థులు లేని చోట్ల టిఆర్‌ఎస్‌ అధికంగా తమ దృష్టిని కేంద్రీకరించుకొని వ్యూహాత్మకంగా సీట్ల సంఖ్య పెంచుకునేలా ప్రయత్నాలు చేయాలనేది కూడా టిఆర్‌ఎస్‌ ప్రణాళికగా చెబుతున్నారు. కూటమిగా ఏర్పడి, సీట్ల సర్ధుబాటు జరిగినా.. అంగబలం, ఆర్థిక బలం కొంత తక్కువగా ఉన్న కోదండ పార్టీ అభ్యర్థులను ఈ మేరకు టార్గెట్‌ చేయాలని ఆ పార్టీ భావిస్తున్నది. ఇప్పటికే టిఆర్‌ఎస్‌ తన అభ్యర్థులకు అవసరమైన సామాగ్రితోపాటు ఆర్థిక వనరులను అందుబాటులోకి తెచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్నది. నాలుగేళ్లకు పైగా తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీగా టిఆర్‌ఎస్‌కు నిధుల కొరత లేదు. ఇది ప్రత్యర్థి పార్టీలకంటే అదనపు అర్హతగా టిఆర్‌ఎస్‌కు ఉంది. తెలుగుదేశం పార్టీ వల్ల కాంగ్రెస్‌కు పెద్దగా ఇబ్బందిలేకపోగా టిఆర్‌ఎస్‌ను దెబ్బతీయడానికి టిడిపి నేతల సలహాలు, సహకారం అన్ని విధాలుగా తీసుకోవడానికి కాంగ్రెస్‌ నేతలు సంసిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల విషయం ఎలా ఉన్నప్పటికీ, ఇతర పార్టీ వారికి కూడా టిడిపి తరపున ఆర్థిక సహకారం కూడా పొందేలా ప్రయత్నాలు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఎపిలో అధికారంలో ఉన్న టిడిపికి కూడా నిధుల కొరత ఉండదు. అయితే టిఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ కొట్టాలనే కసితో ఉన్న టిడిపి గత 2014 ఎన్నికల్లో తాము గెలుచుకున్న 15 సీట్ల వరకు ఇస్తే టిడిపి సంతృప్తి వ్యక్తం చేస్తుంది కానీ, అంతకంటే తక్కువ సీట్లు కూటమి ద్వారా సర్దుబాటు జరిగినా టిడిపి పెద్దగా వ్యతిరేకించే అవకాశం లేదు. కెసిఆర్‌ను ఓడించాలనే లక్ష్యంలో టిడిపి కొంత త్యాగం చేస్తున్నది.పైగా కెసిఆర్‌, టిడిపి-పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేయడం కూడా అందుకోసమే. టిడిపి వల్లనే తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, తిరిగి అదే కావాలా అంటే కెసిఆర్‌ సెంటిమెంట్‌ను రగల్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌, టిడిపి ల మధ్య ఈ మేరకు అవగాహన ఉన్నప్పటికీ ఇతర రెండు పార్టీలతోనే సమన్వయం కుదరడం లేదు. అయితే సిపిఐ కూడా తక్కువ సీట్లతోనే సంతృప్తిపడే అవకాశాలున్నా, టిజెఎస్‌-కోదండ పార్టీ వల్లనే సమస్య కొంత అధికంగా ఉందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి శత్రువు బలంగా ఉన్నందున ఐక్యతతో ఉంటేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని కూటమిలో ప్రాథమికంగా అందరూ అంగీకరించినా వారి మధ్య మరింత సమన్వయం సాధించుకోవాల్సి ఉంది. ఇందులో జరిగే లోటుపాట్లు ఏవైనా అవి టిఆర్‌ఎస్‌ తనకనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. నాలుగు పార్టీల మధ్య సయోధ్య కుదిరినా అది ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు కొనసాగదని, పైగా కూటమి తరపున బలహీన అభ్యర్థులున్న చోట్ల తిరిగి టిఆర్‌ఎస్‌ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని మొత్తంగా కూటమి వల్ల టిఆర్‌ఎస్‌ ఏదో విధంగా లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తుందనే వాదన ముందుకు వస్తున్నది. కెసిఆర్‌ ఈ ఆశలను కూటమి వమ్ము చేస్తుందా? లేక తమ మధ్య పెవికాల్‌ దృఢబంధం ఉందని, ఆర్థిక వనరులను సమీకరించుకొని ప్రత్యర్థిని ఓడిస్తామనే సమన్వయం సాధిస్తారా అనేది వెల్లడికావాల్సి ఉంది.