కీరే కీలకం

CUCUMBER
కీరే కీలకం

ఆరోగ్య ప్రయోజనాలు ఎసిడిటీ: కీరదోసకాయ జ్యూస్‌ తాగడం ద్వారా అందులో ఉండే ఖనిజాలలోని ఆల్కలైన్‌ స్వభావం వల్ల రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. దీంతో ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.

అలాగే కీరదోసకాయ జ్యూస్‌ గ్యాస్ట్రిక్‌, డియోడినం అల్సర్లకు చికిత్సగా ఉపయోగపడి ఉపశమనం కలిగిస్తుంది. రక్తపోటు: ఎటువంటి రంగులూ లేని కీరదోసకాయ జ్యూస్‌ వలన రక్తప్రసరణ క్రమబద్ధంగా ఉంటుంది. ఇందులో గల ఖనిజాలు, సోడియం రక్తప్రసరణ సజావ్ఞగా ఉండడానికి దోహదం చేస్తాయి. చలువ: వాతావరణం పొడిగా, వేడిగా ఉన్న రోజుల్లో కీరదోసకాయ జ్యూస్‌ను ఏవైనా ఆకుకూరల రసంతో కలిపి తీసుకుంటే చలువచేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను సమతులంగా ఉండేలా చేస్తుంది. మూత్రవిసర్జన : మూత్ర విసర్జన చక్కగా జరగడానికి దోహదం చేస్తుంది. మూత్రం ద్వారా శరీరంలోని వ్యర్థపదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి.

అలాగే మూత్రపిండాలలో గల రాళ్ళు కరిగిపోవడానికి కూడా కీరదోసకాయ ఎంతో దోహదం చేస్తుంది. నొప్పితోకూడిన వాపు: కీరదోసకాయ జ్యూస్‌ తాగితే కీళ్లల్లో శుభ్రం చేస్తుంది. కీళ్లల్లో ఉండే యూరిక్‌ యాసిడ్‌ను తొలగించడం వల్ల వాపు, నొప్పి తగ్గిపోతాయి. అంటే ఆర్థరైటిస్‌, ఆస్తమా, గౌట్‌ (వాతం)లాంటి స్థితి తగ్గిపోవడానికి దోహదం చేస్తుంది. జుట్టు పెరుగుదల: కీరదోసకాయలో గల సిలికాన్‌, సల్ఫర్‌ ఖనిజ లవణాలు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. క్యారెట్‌, ఆకుకూర రసం, బచ్చలికూర రసం కలిపి తీసుకుంటే మంచి ఫలితముంటుంది. చర్మం మెరుగుదల: చర్మం పరిస్థితి మెరుగుకావడానికి ఇందులో గల అధిక ‘సి విటమిన్‌ దోహదం చేస్తుంది. సౌందర్యపోషకాలలో కీరరసాన్ని తప్పక కలుపుతారు. ఎగ్జిమ(తామర) సోరియాసిస్‌లాంటి వాటి చికిత్సకు కూడా ఈ కీరదోస రసాన్ని వాడతారు. తీవ్రమైన ఎండ వలన చర్మం కమిలిపోతుంది. అప్పుడు కీరదోసకాయ రసం తీసి కమిలిన చోట బాగా రాస్తే చల్లగా ఉండి శరీరానికి ఉపశమనంగా ఉంటుంది. శరీరంలో నీటి నిల్వ: కీరదోసకాయ రసంలో ఎలక్ట్రోలైట్స్‌ ఉంటాయి.

ఈ ఎలక్ట్రోలైట్స్‌ శరీరంలో తగిన మోతాదులో నీటినిల్వకు దోహదం చేస్తాయి. కళ్ళ చలువ: కీరదోసకాయను గుండ్రని ముక్కలుగా తరిగి కళ్ళపైన ఉంచితే మంటలు తగ్గి ఉపశమించడమే గాక, వాపు ఉంటే తగ్గిపోతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలున్న కీరదోసకాయను అశ్రద్ధ చేయక కూరగాయలతో పాటు దీనిని కూడా తిని ఈ వేసవిలో మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి.