కీరదోసలో ఆరోగ్య ప్రయోజనాలు

KEERADOSA
Keera Dosa

కీరదోసలో ఆరోగ్య ప్రయోజనాలు

కీరదోసకాయ చలువ చేసి, హాయినిస్తుంది. ఇందులో అనేక ఖనిజలవణాలు ఉంటాయి. అందువల్ల మంచి శక్తిని ఇవ్వగల ఆహారంగా పరిగణిస్తారు. భారతదేశంలో కీరదోసకాయను అనేక ప్రాంతాల్లో ఇష్టంగా తింటారు. వివిధ రాష్ట్రాల్లో విస్తారంగా కీరదోస పండుతుంది. మంచి పౌష్టికాహారంగా తీసుకోవచ్చు. పొటాషియం, సోడియం, మెగ్నీషియం, సల్ఫర్‌, సిలికాన్‌, క్లోరిన్‌, ఫ్లోరిన్‌ తదితర పలు ఖనిజలవణాలు ఉన్నాయి. అందువల్ల దీన్ని పైన తొక్క తీయకుండానే తినాలి. కూరగాయలు, గింజధాన్యాలు, పండ్లు, విత్తనాలు, సలాడ్లతో కలిపి కీరదోసకాయ తీసుకున్నట్లయితే శరీరానికి మంచి పోషక విలువలు లభిస్తాయి. వీటికి పెరుగు కలిపితే చక్కటి రుచిగల సలాడ్‌గా, శక్తినిచ్చే ఆహారంగా తీసుకోవచ్చు. దీనిలో ఉన్న ప్రత్యేక గుణాల వల్ల దీనిని సౌందర్య పోషకంగా కూడా వాడతారు. ముక్కలపై విడిగా సాల్ట్‌ చల్లుకుని కూడా తింటారు. అందుబాటు ధరలో లభించే కీరదోసతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాలు: ఎసిడిటీకి కీరదోసకాయ జ్యూస్‌ తాగడం ద్వారా అందులో ఉండే ఖనిజాలలోని ఆల్కలైన్‌ స్వభావం వల్ల రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. దీంతో ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.

అలాగే కీరదోసకాయ జ్యూస్‌ గ్యాస్ట్రిక్‌, డియోడినం అల్సర్లకు చికిత్సగా ఉపయోగపడి ఉపశమనం కలిగిస్తుంది. రక్తపోటు: ఎటువంటి రంగులూ లేని కీరదోసకాయ జ్యూస్‌ వలన రక్తప్రసరణ క్రమబద్ధంగా ఉంటుంది. ఇందులో గల ఖనిజాలు, సోడియం రక్తప్రసరణ సజావ్ఞగా ఉండడానికి దోహదం చేస్తాయి. చలువ: వాతావరణం పొడిగా, వేడిగా ఉన్న రోజులలో కీరదోసయా జ్యూస్‌ను ఏవైనా ఆకుకూరల రసంతో కలిపి తీసుకుంటే చలువచేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను సమతులంగా ఉండేలా చేస్తుంది. మూత్రవిసర్జన: మూత్రవిసర్జన చక్కగా జరగడానికి దోహదం చేస్తుంది. మూత్రం ద్వారా శరీరంలోని వ్యర్ధ పదార్ధాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. అలాగే మూత్రపిండాలలో గల రాళ్లు కరిగిపోవటానికి కూడా కీరదోసకాయ ఎంతో దోహదం చేస్తుంది. నొప్పితో కూడిన వాపు : కీరదోసకాయ జ్యూస్‌ తాగితే కీళ్లలో శుభ్రం చేస్తుంది.

కీళ్లలో ఉండే యూరిక్‌ యాసిడ్‌ను తొలగించడం వల్ల వాపు, నొప్పి తగ్గిపోతాయి. అంటే ఆర్థరైటిస్‌, ఆస్తమా, గౌట్‌ లాంటి స్థితి తగ్గిపోవడనికి దోహదం చేస్తుంది. జుట్టు పెరుగుదల: కీరదోసకాయలో గల సిలికాన్‌ సల్ఫర్‌ ఖనిజ లవణాలు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. క్యారెట్‌, ఆకుకూర రసం లేదా బచ్చలికూర రసం కలిపి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. చర్మం మెరుగుదల: చర్మం పరిస్థితి మెరుగుకావడానికి ఇందులో గల అధిక సి విటమిన్‌ దోహదం చేస్తుంది. సౌందర్యపోషకాలలో కీరరసాన్ని తప్పక కలుపుతారు. ఎగ్జిమ, సొరియాసిస్‌లాంటి వాటి చికిత్సకు కూడా ఈ కీరదోస రసాన్ని వాడతారు. ఎండతో చర్మం కమిలిపోవడం: తీవ్రమైన ఎండ వలన చర్మం కమిలిపోతుంది. అప్పుడు కీరదోసకాయ రసం తీసి కమిలిన చోట బాగా రాస్తే చల్లగా ఉండి శరీరానికి ఉపశమనంగా ఉంటుంది. శరీరంలో నీటి నిలువ: కీరదోసకాయ రసంలో ఎలక్ట్రోలైట్స్‌ ఉంటాయి. ఈ ఎలక్ట్రోలైట్స్‌ శరీరంలో తగిన మోతాదులో నీటి నిలువకు దోహదం చేస్తాయి. కళ్లచలువ: కీరదోసకాయను గుండ్రని ముక్కలుగా తరిగి కళ్లపైన ఉంచితే మంటలు తగ్గి ఉపశమించడమేగాక, వాపు ఉంటే తగ్గిపోతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలున్న కీరదోసకాయను అశ్రద్ధ చేయక కూరగాయలతో పాటు దీనిని కూడా తిని ఈ వేసవిలో మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి.