కాశ్మీర్‌లో 35ఎ అధిక’రణం!

కాశ్మీర్‌లో 35ఎ అధిక'రణం!


శ్రీనగర్‌: జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా ఘటన అనంతరం పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. కాశ్మీరీలకు ప్రత్యేక అధికారాలు దఖలుపరిచే రాజ్యాంగంలోని 35ఎ అధికరణంపై రేసు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో వేడి మరింతపెరిగింది. ముందస్తుచర్యలుగా భద్రతా దళాలు ఇప్పటికే కాశ్మీర్‌లో 150మందికిపైగా వేర్పాటు వాదులను అదుపులోనికి తీసుకున్న ప్రభుత్వం కాశ్మీర్‌లోయలో అదనంగా పదివేలమందికిపైగా పారామిలిటరీదళాలను మోహరింపచేసింది. 35ఎ అధికరణం ఏంచెపుతోంది. కాశ్మీరీలకు వచ్చే ప్రయోజనాలేమిటి అన్న అంశంపై చర్చిస్తే జమ్ముకాశ్మీర్‌లో శాశ్వతపౌరులను గుర్తించి వారికి ప్రత్యేక హక్కులను కల్పించే స్వేఛ్ఛను రాష్ట్ర అసెంబ్లీకి కల్పించేందుకు 35ఎ అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చారు. దీనిపరిధిలో రాష్ట్రశాసనసభ చేసే ఏచర్యనూ సవాల్‌చేయడానికి వీల్లేదు. శాశ్వతహోదా ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి రాష్ట్రంలో ఆస్తులు కొనుగోలుచేయడానికి, ఉపకారవేతనాలు, ఇతర ప్రభుత్వసాయం,సంక్షేమపథకాలు పొందడానికి అర్హులవుతారు. ఇతర ప్రాంతాలవారు వీటికి అనర్హులు. ఇతర రాష్ట్రాలవారిని వివాహంచేసుకున్న స్థానిక మహిళలు కూడా ఇక్కడ ఆస్తిహక్కును కోల్పోతారు. ఇలాంటి మహిళల వారసులకుసైతం ఇదే వర్తిస్తుంది. 1954లో జవహర్‌లాల్‌నెహ్రూ కేబినెట్‌ సలహాతో ఆనాటి రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్‌ రాజ్యాంగంలో ఈ అధికరణను చేరుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే పార్లమెంటు ఆమోదంలేకుండా రాష్ట్రపతి ఉత్తర్వులతో అధికరణాన్ని చేర్చడంపై మొదటినుంచి వివాదాలు రగులుతూనే ఉన్నాయి. జమ్ముకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే 370వ అధికరనం కింద ఈ మార్పును చేపట్టారు. అయితే 370వ అధికరణం తాత్కాలికమేనని దానిద్వారా మరింతగా హక్కులు కల్పించడం సరికాదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సుప్రీం సోమవారం తుదినిర్ణయం ప్రకటించనున్నది. జమ్ముకాశ్మీర్‌లో స్థానికులకు ప్రత్యేక హక్కులు కల్పించే 35ఎ అధికరనంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణజరుగుతున్నందున ప్రభుత్వం వేర్పాటువాదులపై ఉక్కుపాదంమోపింది. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా జమ్ముకాశ్మీర్‌కు అదనంగా 100 కంపెనీల పారామిలిటరీ బలగాలను వాయుమార్గంలో తరలించింది. అయితే నాయకుల నిర్బంధాన్ని నిరసిస్తూ వేర్పాటువాద సంస్థల కూటమి జాయింట్‌ రెసిస్టెన్స్‌ లీడర్‌షిప్‌ లోయలో బంద్‌కు పిలుపిచ్చింది. 35ఎ అధికరణంపై విచారణజరిగేందుకు ముందు జరుగుతున్న దాడులు అనుమానాస్పదంగా ఉన్నట్లు వెల్లడించింది.