కాళేశ్వరంకు గ్లోబల్‌ టెండర్లు ఎందుకు పిలవలేదు

UTTAM KUMAR REDDY
UTTAM KUMAR REDDY

నిరుపేదలు, ఎస్టీలు కోర్టుకు వెళితే నేరమా ?
కోర్టులపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలి
హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మంత్రి హరీష్‌రావు గ్లోబల్‌ టెండర్లు ఎందుకు పిలవలేదని టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఇంట్లో కూర్చుని రూ.వేల కోట్ల పనులను సింగిల్‌ టెండర్లుగా ఇచ్చారనీ, ఇది నిజం కాదా అని ప్రశ్నించారు. బుధవారం ఇక్కడి గాంధీభవన్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబం అవినీతి విషయంలో ఇప్పుడు అంబానీ, ఆదానీలతో పోటీ పడుతుందని వ్యాఖ్యానించారు. తుమ్మిడి హట్టి దగ్గర నీటి లభ్యతపై ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నదనీ, నిపుణుల కమిటీ తుమ్మిడి హట్టికి ఓకే చెప్పింది నిజం కాదా ? అని నిలదీశారు. ఆస్తులు సంపాదించాం కాబటి ఇప్పుడు పేదలను బానిసలుగా చేస్తామంటే కాంగ్రెస్‌ ఊరుకోదని స్పష్టం చేశారు. కాళేళ్వరం ప్రాజెక్టుపై తాము అవినీతి ఆరోపణలకు సంబంధించి సీఎం కేసీఆర్‌ అసలు విషయాలు చెప్పకుండా, రాజకీయ ఆరోపణలకు పరిమితం అయ్యారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించిన టెండర్లలను బయటపెట్టొచ్చుగా అని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతలా అవినీతికి పాల్పడిన ప్రభుత్వం ఎక్కడా లేదంటూ పేర్కొన్నారు. కాళేశ్వరంకు కాదు …తుమ్మిడి హట్టి, సిరిసిల్ల దగ్గరికి టూరిజం ట్రిప్‌లు తీసుకెళ్లాల్సిందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ నేతల్లాగా తాము చిల్లర మాటలు మాట్లాడలేమనీ, హిట్లర్‌ కేబినెట్‌లో గ్లోబల్‌ లాగా రాష్ట్రంలో హరీష్‌ రావు ఉన్నాడని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ తాను అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ హరీష్‌రావు సూటిగా సమాధానం ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ రైతుల గురించి ఆలోచిస్తుంటే కేసీఆర్‌ కాంట్రాక్టర్ల గురించి ఆలోచిస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణ మాఫీని కాంగ్రెస్‌ పార్టీ అమలు చేసి చూపుతుందని స్పష్టం చేశారు. నిరుపేదలు, దళితులు, ఎస్టీలు తమ భూములు లాక్కుంటున్నారని కోర్టుకు వెళితే నేరమా ? కోర్టులు ఏమైనా నిషాధిత సంస్థల అని ప్రశ్నించారు. కేసీఆర్‌ హయాంలోనే ఎక్కువ అన్యాయం జరుగుతోంది కాబట్టి న్యాయం కోసం కోర్టులకు వేళ్లాల్సి వస్తోందన్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోలేమనీ, తెలంగాణ ఏమైనా కేసీఆర్‌ జాగీరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని విచారించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ నిరాహార దీక్షను ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు నాడు కోర్టులను ఆశ్రయించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దళితులు ఎస్సీ,ఎస్టీల పట్ల కేసీఆర్‌కు చులకన భావం ఉందనీ, సిరిసిల్లలో వారిపై ప్రభుత్వం జరిపిన అకృత్యాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌ పార్టీ 75 స్థానాలను గెలుస్తుందని ఉత్తమ్‌ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.