కార్తీకి ష‌ర‌తుల‌తో విదేశ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి

SUPREME COURT
SUPREME COURT

ఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం త‌న‌యుడు కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ అందుకు కొన్ని నిబంధనలు విధించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా, ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌‌ కేసులు ఎదుర్కొంటున్న కార్తీ విదేశాలకు వెళ్లకుండా సీబీఐ, ఈడీ అధికారులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. దీన్ని సవాలు చేస్తూ కార్తీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం.ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో ధర్మాసనం కార్తీకి కొన్ని షరతులు విధించింది. విదేశాల్లో ఆయన ఎటువంటి బ్యాంకు ఖాతాలను తెరవడం/మూసివేయడం చేయకూడదని చెప్పింది. దీంతో పాటు ఎటువంటి ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు జరపకూడదని హెచ్చరించింది. అంతేకాకుండా ఆయన ప్రయాణం చేసే విమానం వివరాలను, మళ్లీ భారత్‌కు ఎప్పుడు తిరిగి వస్తారనే దానికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిందిగా సూచించింది. ఆయనపై ఉన్న కేసుల విచారణకు సహకరించాలని, విదేశాల పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే తన పాస్‌పోర్టును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు తప్పనిసరిగా అప్పగించాల్సిందిగా సుప్రీంకోర్టు నిబంధనలు విధించింది. ఈ షరతులన్నింటినీ కార్తీ తప్పనిసరిగా పాటించాల్సిందిగా సుప్రీం ఆదేశించింది. మే 19 నుంచి 27 వరకు ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. కార్తీ విదేశాలకు వెళ్లి అక్కడ ఉన్న బ్యాంకు ఖాతాలను మూసివేస్తున్నారని ఈడీ అధికారులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ కార్తీ కోర్టును ఆశ్రయించారు.