కామ‌న్వెల్త్‌లో భార‌త్‌-పాక్ హాకీ మ్యాచ్ డ్రా

Team India Hockey
Team India Hockey

గోల్డ్‌కోస్ట్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భాగంగా నేడు భారత్‌-పాకిస్థాన్‌ తలపడ్డాయి. పురుషుల హాకీలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరు డ్రాగా ముగిసింది. విజయం అంచున నిలిచిన భారత్‌కు చివరి క్షణంలో గోల్‌ ద్వారా పాకిస్థాన్‌ షాక్‌ ఇచ్చింది. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 13వ నిమిషంలోనే దిల్‌ప్రీత్‌ సింగ్‌ భారత్‌ తరఫున తొలి గోల్‌ నమోదు చేశాడు. అనంతరం 19వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్ రెండో గోల్‌ సాధించాడు. దీంతో మ్యాచ్‌పై భారత్‌ పట్టు సాధించింది. 38వ నిమిషంలో పాక్‌ ఆటగాడు మహమ్మద్‌ ఇర్ఫాన్‌ తొలి గోల్‌ చేసి భారత్ ఆధిక్యాన్ని తగ్గించాడు. మరో నిమిషంలో మ్యాచ్‌ ముగియనుందనగా.. ఇక విజయం భారత్‌దే అనుకున్న వేళ.. ముబాషర్‌ అలీ గోల్‌ చేసి 2-2తో మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. భారత్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. పూల్‌-బిలో ఉన్న భారత్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా పాక్‌ మూడులో కొనసాగుతోంది. గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌ భారత పురుషుల జట్టు రజతం దక్కించుకున్న సంగతి తెలిసిందే.