కలుష నివారిణి కావేరీ పుష్కర ప్రాశస్త్యం

Kaveri
Kaveri

కలుష నివారిణి కావేరీ పుష్కర ప్రాశస్త్యం

నదులను దేవతా స్వరూపాలుగా ఆరాధించే భార తీయ సనాతన సంస్కృతి మనది. ‘ఆపోవా ఇదం సర్వం జగత్తంతా జలరూపమని, జలంతో నిండిన నదులు ‘ఆపోవై దేవానాం ప్రియం ధామ దేవతలకు ప్రియం కలిగించేవి నదులనివేదం ఉద్బోధిస్తున్నది.అందుకే నిత్యపూజాది కాలలోనేగాక, ఏ శుభకార్యం తలపెట్టినా నదులను నదీజలాలను ఆవాహన చేస్తున్నాం.

‘ఆపఃస్వన్తర మృతప్సు భేషజమ్‌ నదీజలం లో అమృతమున్నది. ఔషధాలున్నాయి. ఇవి మన శరీరాలకు దేహ శుద్ధినీ, ఆంతరికంగా మంచి మనస్సును బుద్ధిని కలుగచేస్తున్నాయి. నదులు పుష్కర సమయంలో మరింత పవిత్రాలై పాపహరాలై రోగ నివారకమైన జలాలతో మరిన్ని సత్ఫలితాలనిస్తున్నాయి. భుక్తి ముక్తి ప్రదాయకాలాని నదులను కీర్తిస్తారు. మనదేశంలో పుణ్యనదులన్ని టికీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. పుష్కరమంటే పవిత్ర సమయం. పర్వకాలం భారతదేశమంతా ఒకే ఆత్మ. ఈ పవిత్రమైన భావాన్ని ఉత్తేజపరుస్తూ భారతీయులందరూ కుల,వర్గ, విచక్షణలేకుండా జరుపుకునే పర్వదినాలు. మనదేశంలో ‘పుష్కర సంస్కృతి ప్రత్యేకమైన పాత్ర కలిగి ఉంది. మూడున్నర కోట్ల తీర్థాలకు అధిపతి అయిన పుష్కరుడు బృహస్పతి (గురుడు)తో కలిసి చేసే రాశిసంచారాన్ని అనుసరించి ఈ పుష్కరకాలం నిర్ణయిం చబడుతుంది. జ్యోతిషశాస్త్ర మర్మం కూడా ఈ నిర్ణయంలో దాగి ఉందని అంటారు శాస్త్రజ్ఞులు. ఖగోళంలో జరిగే మార్పులకీ, భూమి పై ఉండే జీవ్ఞల చైతన్యానికీ సంబంధం ఉందంటారు.

ఈ పుష్కర సమయంలో త్రిమూర్తులతోపాటు సకలదేవతలు,ఇతర పుణ్యనదుల జలాలు పుష్కరనదిలో ఉంటాయని శాస్త్రవచనం. అందుకే దేశమం తటా నివసిస్తున్న ప్రజలందరూ ఆ పుష్కర నదిలో స్నానం చేసి పునీతలవ్ఞతూ శాస్త్రాలు నిర్వచించిన విధి విధానాలను పాటిస్తూ కృతార్థులవ్ఞతున్నారు. బృహస్పతి పుష్కరునితో కలిసి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఆ సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరం అని చెప్పుకున్నాం. మేషరాశిలో సంచరించేటప్పుడు గంగానదికి, వృషభరాశిలో ఉన్నకాలం నర్మదకు,సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి, కన్యరాశిలో మసలునప్పుడు కృష్ణానదికి ఇలా పన్నెండు పుణ్యనదులకు ఆయారాశులలో గురుగ్రహ సంచారాన్ని బట్టి పుష్క రాలు వస్తాయి.

ఈవిధంగా ఈ సంవత్సరం 12.9.2017 సార్థత్రికోటి దేవతా తీర్థరాజు పుష్కరునితో కలిసి బృహస్పతి తులా రాశిలో ఉదయం 6.51 ని.లకు, కావేరి నదిలోనికి ప్రవేశిస్తాడు. అప్పుడు కావేరీ నదికి పుష్కరాలు. కావేరీనది కర్ణాటక రాష్ట్రం కొడ గు జిల్లా సహ్యద్రి పర్వతశ్రేణిలో ఉన్న బ్రహ్మగిరి వద్ద 1276 మీII ఎత్తులో ఉన్నతల కావేరీ వద్ద జన్మించి దక్షిణ తూర్పు దిశలలో 756 కి.మీ ప్రవహిస్తూ 81,550 చ.కి.మీ పరీవాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు జీవనాడిగా ఉంటూ తమిళనాడులోని ఫుంఫూర్‌ వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తున్నది. ఈ నదీతీరంలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు నిలయంగాచేసుకున్నాయి. కావేరి జన్మవృత్తాంతాన్నీ, ఆ నదీ పరీవాహక ప్రాంత ప్రాశస్త్యాన్ని తెలుసుకుని పుష్కర సమయంలో పుణ్యక్షేత్రాలను దర్శించి తరించుదాం.

కావేరి నది జన్మవృత్తాంతం

పూర్వం కవేరుడను రాజర్షిముక్తి కోరి బ్రహ్మకై తపస్సు చేసాడు. బ్రహ్మ సాక్షాత్కరించి ముక్తికి బదులు ఒక పుత్రికను ప్రసాదించి ఆమె ద్వారా ముక్తిని పొందగలవని వరమిచ్చాడు. కవేర కన్య పెరిగి పెద్దయి తండ్రి అంతరంగాన్ని తెలుసుకుని శ్రీహరిని గురించి తప స్సు చేసింది. ప్రత్యక్షమైన శ్రీహరి ఆమె కోరిక తెలుసుకుని తన అంశతో పుట్టిన అగస్త్యుని బ్రహ్మప్రేరణతో వివాహమాడిన ఆక్షణం నదీరూపం పొంది అగస్త్యుని కమండలంలో చేరి అతనితో పాటు సహ్యాద్రిపర్వతశ్రేణిలో బ్రహ్మగిరికి చేరుకుంటావని, ఒకానొక సమ యంలో కమండలం నుంచి నదిగా ప్రవహించగా, అందులో నీ తండ్రి స్నానంచేసి ముక్తిని పొందుతాడని వరమిచ్చాడు. మరొక కథ నం అనుసరించి ఒకప్పుడు దక్షిణ ప్రాంతమంతా కరువు కాటకా లతో కడగండ్లు పాలయ్యాయి. ఆకలిదప్పులతో ప్రాణి కోటి అల్లాడి పోయింది.

పరిస్థితినిచూసి శయనమహర్షి చలించి శివునికై తపస్సు చేసాడు. సాక్షాత్కరించిన శివ్ఞనికి పరిస్థితి చెప్పి గంగను విడువమ న్నాడు. మహర్షి అభ్యర్థనను శిశువ్ఞ గంగకు చెప్పగా గంగ తనలోని ఒక అంశను బ్రహ్మగిరి నుండి నదిగా ప్రవహింపచేసింది. ఆ కార ణంగా కావేరి దక్షిణ గంగగా పేరు పొందింది. కవేరుని కూతురు కావడం చేత కావేరి అని ప్రసిద్ధి పొందింది. యాభైకి పైగా పెద్ద, చిన్న నదులను తనలో కలుపుకుని రెండు దక్షిణాధి రాష్ట్రాల మీదు గా ప్రవహిస్తున్న కావేరీ నదీ తీరం చారిత్రాత్మకంగా ప్రసిద్ధి పొం దింది.

కావేరీ నదీ తీరం సంస్కృతీ సంప్రదాయాలకు ఆలవాలం. సంగీతం, సాహిత్యం, నృత్య కళలలకు ఆటపట్టు. శిల్ప సంపదకు కాణాచి. ఎన్నో పవిత్ర క్షేత్రాలు, ప్రసిద్ధ దేవాలయాలు నదీతీరాన్ని నిలయంగా చేసుకున్నాయి. ఆళ్వార్లూ, నాయనార్లూ కావేరిని బహు ధా శ్లాఘించారు. శైవగ్రంధమైన ‘పెరియ పురాణం తమిళ కావ్యం మణిమేఖలై కావేరిని స్తుతించాయి. ప్రాచీన ఆధునిక కన్నడ, తమిళ సాహిత్యాలు కావేరిని వేనోళ్లపొగిడాయి. కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన తలకావేరి వద్ద కావేరీ మాత ఆల యంఉంది. తులాసంక్రమణ రోజున ముఖ్యంగా పుష్కర సమయం లో కావేరీ మాతకు ఘనంగా ఉత్సవాలు, వేడుకలు నిర్వహిస్తారు. లక్షలాది భక్తులు కావేరీమాతను దర్శించి చరితార్థులవుతారు.

పార్వ తీసహిత విశ్వనాథ ఆలయంలో పరమశిశుని కుటుంబమంతా కొలు వైఉంది.భగమండలం అనుచోట అగస్త్యుడు సుబ్రహ్మణ్యుని గురించి తపస్సు చేసి సాక్షాత్కరింపచేసుకున్నాడు.తానేస్వయంగా శివపార్వ తులను, గణపతిని, సుబ్రహ్మణ్యుని, విష్ణుమూర్తిని ప్రతిష్టించి ఆల యాలను నిర్మించాడని క్షేత్రపురాణం.ఈఆలయంలో ఒకవిశేషముం ది. ఆలయంలో గల అక్షయపాత్రలోని ధాన్యపువిత్తులను రైతులు సేకరించి తమ ధాన్యపు విత్తులతో కలిపి పంట పొలాల్లో జల్లితే పంటలు పుష్కలంగా పండుతాయని కృషీవలుర ప్రగాఢ విశ్వాసం. కావేరినదీ తీరంలో ప్రప్రథమ పుణ్యక్షేత్రం శ్రీరంగనాథస్వామి క్షేత్రం. అంత్యరంగమైన శ్రీరంగం వైష్ణవ మత సంప్రదాయకులకు ప్రధాన క్షేత్రం.

ఎంతో విశాలమైన శ్రీరంగనాథ దేవాలయ ప్రాంగ ణమే ఒక పట్టణంగా భాసిస్తుంది. ఏడుప్రాకారాలతో ఇరువదిఆరు గోపురాలతో ఎన్నో ఉపాలయాలు, మండపాలతో అద్భుతమైన శిల్ప కళతో శోభిస్తూ ఉంటుంది. కావేరీ నది శ్రీరంగం ఇరువైపులా ప్రవ హిస్తున్నది. కావేరి నదికి పన్నెండేళ్లకొకసారి వచ్చే పుష్కర సమ యంలో ఇక్కడ ‘మక్కంకుండ అనే ఉత్సవం నిర్వహిస్తారు.ఇది త్రివేణీ సంగమంలో జరిగే మహాకుంభమేళాను మరిపిస్తుందని అం టారు. శివ్ఞని పంచ భూత స్వరూపాలలో ఒకడైన చిదంబరంలోని ఆకాశలింగం కావేరి నదీతీరంలోనే ఉంది. పుష్కరయాత్రీకులు తప్ప కుండా దర్శించవల్సిన క్షేత్రం చిదంబరం. చిదంబరేశ్వర ఆలయ గోపురం శిల్ప సంపదతో ఉంటుంది.

– ఏ. సీతారామరావు