కలవని మనసులు

couples
వివాహ వ్యవస్థ బీటలు వారుతోంది. కలవని మనసులు మధ్య కలుసుకొని కలకాలం కాపురం ఉండలేని జీవితాలెన్నెన్నో. అందుకే నేడు ఒకరికొకరు ఆలంబనగా ఉంటేనే జీవితం అనే వైవాహిక సారాన్ని నేటి యువతీ యువకులు పక్కన పెట్టేసారు. సాఫ్ట్‌వేర్‌ రంగం వర్ధిల్లడంతో కొత్త రకం ప్రేమలు ఎలా చిగురించాయో అదే మాదిరి దాని కొనసాగింపుగా వచ్చే పెళ్లిల్లు పెటాకులైన సందర్భాలూ ఉన్నాయి. ఇటీవల చేసిన ఒక తాజా సర్వే ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
మనదేశంలో బ్రహ్మచారుల సంఖ్య పెరుగుతోంది. కానీ మనరాష్ట్రం మాత్రం ఆ విషయంలో కాస్త మెరుగ్గానే ఉంది. 2010 సంవత్సరంలో మనదేశ జనాభాలో పెళ్లిళ్లు చేసుకున్న వారి వాటా 57.7 శాతం ఉండగా, 35.9 మంది తామసలు పెళ్లిమాటే ఎత్తబోమని చెప్పారు. ఇలాంటి కఠోర బ్రహ్మచారుల జాబితాలో జమ్ముకాశ్మీర్‌ 45.4శాతం అగ్రస్థానంలో ఉండగా, మనరాష్ట్రం 30.4శాతంతో అట్టడుగున ఉంది. అసోంలో 42.3, యూ.పీలో 41.6, జార్ఖండ్‌లో 38.5, ఢిల్లీలో 38.4, మహారాష్ట్రలో 35.5, కర్ణాటకలో 34.5, మహారాష్ట్రలో 32 శాతం బ్రహ్మచారులు ఉన్నారట. పెళ్లిళ్లు చేసుకున్నవారి జాబితాలో గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ రెండూ 61.4 శాతంతో అగ్రస్థానంలో నిలవగా తర్వాత మహారాష్ట్ర 61 శాతం, కేరళ, పశ్చిమబెంగాల్‌ 60.1శాతం, రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌ 59.8 ఉన్నాయి. ఇక 2010 నాటికి విధవలు, విడాకులు తీసుకున్నవారు, విడిపోయిన వారి డబ్ల్యుడీఎస్‌ జాబితాలో తమిళనాడు రాష్ట్రం అగ్రస్థానంలో నిలవగా, అట్టడుగున ఢిల్లీ ఉంది. మొత్తమ్మీద తమిళనాడులో ఇలాంటి వాళ్లు 8.8శాతం ఉండగా, ఢిల్లీలో మాత్రం 4.1 మాత్రమే ఉన్నారు. డబ్ల్యుడీఎస్‌లో పురుషులు (2.9) కంటే మహిళల సంఖ్య(10శాతం) మూడింతలు ఎక్కువ.

దేశం మొత్తంమ్మీద పదేళ్లపైబడిన వయసువారిలో 7శాతం మంది విధవలు కావడం లేదా విడాకులు తీసుకోవడం లేదా విడిపోవడం జరిగినట్లు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ 2010 సమాచారం నిర్థారించింది. ఈ నివేదికను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖకు సమర్పించింది. ఈ విషయంలో మన రాష్ట్రం కూడా పైనే నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో మొత్తం డబ్ల్యుడీఎస్‌ జనాభా 8.2శాతం ఉంది. తర్వాతి స్థానాల్లో ఒడిసా(7.2), హిమాచల్‌ప్రదేశ్‌ (7.1) మహారాష్ట్ర (7) ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ ఎంత పెద్దదైనా అక్కడ ఈ సంఖ్య 3.7శాతం మాత్రమే ఉంది. ఇక మహిళల విషయానికొస్తే తమిళనాడులో అత్యధికంగా పదేళ్ల పైబడిన జనాభాలో 14.5శాతం మంది ఈ జాబితాలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా కర్ణాటక (14.2) కేరళ(14) ఆంధ్రప్రదేశ్‌ (13.6) మహారాష్ట్ర (11.7) ఉన్నాయి. మహారాష్ట్రలో అయితే డబ్ల్యుడీఎస్‌ జనాభాలో పురుషుల కంటే మహిళల సంఖ్య ఆరురెట్లు ఎక్కువగా ఉంది. మనరాష్ట్రంలో కూడా ఇలాంటి పురుషుల సంఖ్య జనాభాలో 2.7శాతం మాత్రమే ఉండగా, మహిళల సంఖ్య 14శాతం ఉంది.