కర్తవ్యోన్ముఖులను చేసే కరదీపిక!

      కర్తవ్యోన్ముఖులను చేసే కరదీపిక!

LORD KRISHNA
LORD KRISHNA

అవతారపురుషులు, మహర్షులు, మహానుభావులు జన్మించినపుడు లోకానికి మేలు జరుగుతుంది. ఆ మహానుభావులు చేసిన మంచికి కృతజ్ఞతగా వారి జన్మదినాన్ని జయంతిగా జరుపుతారు. అలాగే భగవద్గీత వలన లోకానికి చేకూరిన మహోపకారం వలన గీతాజయంతిని జరుపుకుంటారు. ఈ ప్రపంచంలో మరే ఇతర గ్రంథానికీ జయంతిలేదు. సుమారు 5200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్యాణం సమయంలో కలియుగం కారుమేఘంలాంటి అజ్ఞానంలో ప్రవేశిస్తున్న తరుణంలో అజ్ఞానపు గాడాంధకారాన్ని చీల్చుకుంటూ మానవజాతిపై వెలుగులు విరజిమ్ముతూ పవిత్రగ్రంథం భగవద్గీత ఉదయించింది.

ఏ జ్ఞానం తెలిస్తే మనిషికి ఇక జీవితంలో ఏదీ తెలుసుకోవాల్సిన అవసరం లేదో, ఏది ఆత్మ – పరమాత్మ తత్వాన్ని సమగ్రంగా తెలుపగలదో మనిషిని ముక్తిమార్గం వైపు నడిపించగలదో ఆ గొప్ప విషయమే భగవద్గీత. భగవద్గీత వృద్ధాప్యంలో చదువుకోవాల్సిన గ్రంథం అనుకుంటే అది శుద్ధ పొరపాటు. ఏ మనిషికి తను నిర్వర్తించవలసిన కర్తవ్యం బోధపడుటలేదో, ధర్మం తెలియుట లేదో అటువంటి వారికి తక్షణం దారి చూపే దేవతే ఈ గీతామాత! యువతరం చదివి అనుసరించాల్సిన ఆదర్శగ్రంథం భగవద్గీత.

ఇది చదివితే వైరాగ్యం వస్తుందనుకోవటం తప్పు! భగవద్గీత విన్న అర్జునుడు అడవులకు పోనూలేదు, సన్యాసం స్వీకరించనూ లేదు. గాండీవం ధరించి యుద్ధానికి సిద్ధమైనాడు. కర్తవ్య విముఖుడైన వాడిని కార్యోన్ముఖుడిని చేసే ఏకైక సాధనం భగవద్గీతా గ్రంథం. ప్రపంచంలోని పాశ్చాత్యదేశాలు భగవద్గీతవైపు మనోవేగంతో పరుగులు తీస్తున్నాయి. అన్యమతస్థులు సంవత్సరాల తరబడి చేసే వివిధ రకాల ప్రచారాలకు లొంగని ప్రపంచం శ్రీకృష్ణతత్వాన్ని గురించి, గీతామాత గురించి ఇస్కాన్‌ ద్వారా తెలుసుకుని విదేశీయులు సైతం కృష్ణ భక్తులుగా మారి భగవద్గీతకు దాసోహం అంటున్నారు.

ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీతను కోట్‌ చేసినవారే! భగవద్గీత చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించినవారే! మానవజీవితం మూడువంతులు విషాదంతోనే నిండి ఉంటుంది. దానికి కారణం పరిస్థితులు ప్రతికూలించడం. పరిస్థితులు అనుకూలించక పోవటానికి కారణం అహంకార, మమకారాలు, రాగద్వేషాలు కారణం వీటివల్లే సుఖదుఃఖాలు. ఇదే సంసారబంధం. అర్జునునికి ఎదురైన స్థితి ఇదే. ఇదే విషాదం. అందుకే గీత విషాదయోగంతో ప్రారంభం అయింది. ఒక్క అర్జునునికే కాదు మనందరికీ నిత్యమూ ఎదురయ్యే సమస్యే ఇది.

ఈ విషవలయంలో చిక్కి సతమతమయ్యే మనిషికి దారి చూపటానికే శ్రీకృష్ణపరమాత్ముడు విషాదయోగంతో అర్జునునికి బోధిస్తూ మొత్తం పద్ధెనిమిది అధ్యాయాలు ప్రపంచానికి ప్రసాదించాడు. నిత్యజీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలన్నింటికీ పరిష్కారం, మన ప్రశ్నలన్నింటికీ సమాధానం తప్పక లభించే ఏకైక మార్గం భగవద్గీతా పఠనం. సంసారసాగరాన్ని అవలీలగా దాటించే అమృతగ్రంథం శ్రీమద్భగవద్గీతా గ్రంథం అనుటలో ఎటువంటి సంశయమూ లేదు. అన్యమతస్థులు సైతం అనుసరించి ఘనతను అభినందించగలిగిన గొప్ప గ్రంథం. హిందువుగా జన్మించి గీత గొప్పతనం తెలుసుకోగల్గిన ప్రతివారి జీవితం ధన్యమైనదే! జై శ్రీకృష్ణ! 

– సురేఖా భాస్కర్‌