కర్ణాటక సంకీర్ణంలో పెరుగుతున్న అసమ్మతి

KARNATAKA
KARNATAKA

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి రాజుకుంటున్నది. మంత్రివర్గప్రమాణ స్వీకారం జరిగినప్పటినుంచి బెర్త్‌లు లభించని సీనియర్లు అలకవహించిన సంగతి తెలిసిందే. సంకీర్ణకూటమి సమన్వయకర్తగా నియమితులైన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఇపుడు ఈ అసమ్మతి ఎమ్మెల్యేలందరూ కలుస్తున్నారు. పదిరోజులపాటు పశ్చిమఘాట్‌ప్రాంతంలో ప్రకృతివైద్యంకోసం వెళ్లిన సిద్ధరామయ్యను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మొత్తం ధర్మశాలకు మాజీ సీఎంను పరామర్శించే సాకుతో వెళ్లి కలిసి చర్చలుజరిపారు. సంకీర్ణప్రభుత్వ మంత్రివర్గం విస్తరణ జరిగినప్పటినుంచి ఈ అసమ్మతి రాజుకుంటూనే ఉంది. కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ జి.పరమేశ్వరపైనే వీరి ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. అనేక మంది కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ పరమేశ్వర కేవలం తన సొంతప్రయోజనాలుమాత్రమే చూసుకుంటున్నారని, ఉపముఖ్యమంత్రి పదవి లభించిన తర్వాత ఇక పార్టీ సీనియర్లను పూర్తిగా విస్మరించారన్న ఆక్రోశం ఎమ్మెల్యేలు వెళ్లగక్కుతున్నారు. ఇపుడు అసమ్మతినేతలందరూ తమకు సిద్దరామయ్య ఒక కీలక నేతగా లభించారన్న భావనతో అందరూ ఆయనవద్దకే క్యూకడుతున్నారు. కాంగ్రెస్‌జనతాదళ్‌ సంకీర్ణప్రభుత్వాన్ని విమర్శిస్తూ సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలున్న వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌చేయడంతో అటు జెడిఎస్‌, ఇటు కాంగ్రెస్‌ హైకమాండ్‌లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్‌జెడిఎస్‌ సంకీర్ణప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలవరకూ పనిచేస్తుందా లేక ఆతర్వాత అయినా కొనసాగుతుందా అన్న మీమాంసను వ్యక్తంచేస్తూ వచ్చిన వార్తలతో సంకీర్ణంలో అపుడే అసమ్మతి సెగ మొదలయిందన్న భావన సర్వత్రా వినిపిస్తోంది. ఇక సిద్దరామయ్య,కుమారస్వామిలమధ్య ఉన్న విభేదాలు,వైషమ్యాలు పాతవని, ఇపుడు కొత్తగాపుట్టుకువచ్చినవేమీ కావని కొందరు నేతలు చెపుతున్నారు. అయితే ఈ వివాదాలను హైకమాండ్లుజోక్యంచేసుకుంటే సమసిపోతాయని చెపుతున్నారు. ప్రధానంగా సిద్దరామయ్య తాను బడ్జెట్‌ప్రవేశపెట్టినతర్వాత మళ్లీ కుమారస్వామి పూర్తిస్థాయి బడ్జెట్‌ దేనికని ప్రశ్నిస్తున్నారు. ఈ బడ్జెట్‌ అంశంపై కుమారస్వామి రాహుల్‌గాంధీనిసైతం కలిసి తన పంతం నెగ్గించుకున్నారు. ఇక పిసిసి మాజీ ఛీఫ్‌ పరమేశ్వర ఇపుడు అస్మతికి కేంద్ర బిందువుగా మారారు. మాజీముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అత్యంత సన్నిహితుడైన ఒక నేత మాట్లాడుతూ మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో 30మందివరకూ మాజీ ముఖ్యమంత్రిని ధర్మశాలలో కలిసారని చెపుతున్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు దినేష్‌ గూండూరావుకూడా కలిసారని సమాచారం. పార్టీలో పరమేశ్వరపై అసమ్మతి ఎగిసిపడుతున్నదని, త్వరలోనే ఆయన పార్టీ చీఫ్‌ పదవినుంచి వైదొలుగుతారని చెపుతున్నారు. అయితే పార్టీపై అటు పరమేశ్వర ఇటు గూండూరావు ఇద్దరికీ పట్టు అంతగా లేదని, సిద్ధరామయ్యకు మాత్రమే ఉందని నేతలు చెపుతున్నారు. పిసిసి ఛీఫ్‌ కొత్తపేరునుప్రకటించడంలో హైకమాండ్‌ జాప్యం, పరమేశ్వరపై పెరుగుతున్న అసమ్మతి వంటివి మాత్రమే ప్రస్తుతం ఎమ్మెల్యేల్లో అసహనాన్ని పెంచి సిద్ధరామయ్యను కలిసేంతవరకూ పెంచాయి. మాజీ సీఎంకు అత్యంత సన్నిహితుడు రాజరాజేశ్వరినగర్‌ ఎమ్మెల్యే మునిరత్నా ఒకరు. ఆయనమాత్రంపార్టీలో అసమ్మతిలేనేలేదని పైపైకి చెపుతున్నారు. మేమంతా పార్టీకోసం పనిచేస్తున్నామని, కాంగ్రెస్‌ పార్టీ ముందు ఆతర్వాతనేస్వప్రయోజనాలని ఆయన అన్నారు. సిద్దరామయ్యనేతృత్వంలో అసమ్మతి వర్గం అన్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. ఇప్పటికీ ఆరుమంత్రిపదవులు ఖాళీగానే ఉన్నాయి. మాజీ మంత్రి ఒకరు మాట్లాడుతూ పదవులకోసం మాజీ సీఎంను లాబీయింగ్‌చేయడం సహజపరిణామంగానే చెప్పుకొస్తున్నారు. కోఆర్డినేషన్‌కమిటీకి ఛైర్మన్‌ అయినందున ఎమ్మెల్యేలు తమవంతుప్రయత్నాలుచేయడంలో తప్పులేదన్నారు. అటు మంత్రిపదవికానీ, ఇటు నామినేటెడ్‌పోస్టుకానీ ఏదోఒకటి సాధించేలక్ష్యంతో వారు సిద్దరామయ్యవద్ద లాబీయింగ్‌చేస్తున్నట్లు సమాచారం. అయితే జెడిఎస్‌ సుప్రీమో దేవెగౌడ మాట్లాడుతూ సంకీర్ణప్రభుత్వానికి ఢోకాలేదనిచెపుతుంటే ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలవరకూ తనను ఎవ్వరూ టచ్‌చేయలేరని ఢంకాబజాయించి మరీచెప్పడం కాంగ్రెస్‌తో లోలోపల ఉన్న అసమ్మతిని తెలియజేస్తోంది. ప్రస్తుతం పార్టీని, ప్రభుత్వాన్ని నడపగలిగే సత్తా ఒక్క సిద్దరామయ్యకు మాత్రమే ఉందని, అందువల్లనే ఎమ్మెల్యేలు ఆయన్ను లీడర్‌గా ఎంచుకుంటున్నట్లు రాజకీయ నిపుణులు చెపుతున్నారు. అయితే పార్టీ నియమావళిని ఉల్లంఘించి సిద్ధరామయ్య పనిచేయబోరన్న వాదన కూడా ఉంది. కురుబ కులానికి చెందిన ఓటర్లలో మంచి పట్టున్న నేతగా రావడంతో సిద్దరామయ్యకు పార్టీలో తిరుగులేదన్న భావన కూడా వ్యక్తం అవుతోంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టడంపై సిద్దరామయ్య విమర్శలను జెడిఎస్‌ అధినేత కొట్టివేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి బడ్జెట్‌పై చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని, అయితే సంకీర్ణప్రభుత్వం వచ్చినతర్వాత బడ్జెట్‌ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోందని దేవెగౌడ తన కుమారుని వాదనను సమర్ధించుకున్నారు. మొత్తం మీద కర్ణాటకలో కాంగ్రెస్‌జెడిఎస్‌ సంకీర్ణానికి రోజులు దగ్గరపడ్డాయన్న భావన సర్వత్రావినిపిస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఇటీవల ఎమ్మెల్యేలు సిద్దరామయ్యను కలవడం, ఆయన జెడిఎస్‌సంకీర్ణప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలుచేయడం వంటివి ఊతం ఇస్తున్నాయి.