కర్ణాటక ఎన్నికల తర్వాతే ఫ్రంట్‌ భ‌విత‌వ్యం

 

TS CM KCR
K. Chandrasekhar rao

హైదరాబాద్‌: :ఇప్పటి వరకు 20 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన బిజెపి కర్ణాటకలో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని నరేంద్రమోడీ సీరియస్‌గానే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఎఐసిసి జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రచారం హోరు పెంచారు. తాజాగా బిజెపి కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేసి.అందులో చాలా పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న వాటిని నమూ నాగా తీసుకుంది.తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పలు పథకాలను మార్పులు,చేర్పులతో కర్నాటక బిజెపి మేనిపెస్టోలో పొందుపరిచారు. దీనిపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ కూడా చేశారు. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కర్ణాటక ఎన్నికల ప్రచార హోరును ప్రతి రోజూ గమనిస్తున్నారు. వేగుల ద్వారా కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు.సోషల్‌ మీడియాలో ఆయా పార్టీలకు అనుకూలంగా వస్తున్న పలు సర్వేలను కూడా గమనిస్తున్నారు.మొన్నటి వరకు తిరిగి కాంగ్రెస్‌ అధికారంలోకి రావచ్చని, ఇప్పుడు బిజెపి,జెడిఎస్‌ కలిసి ప్రభుత్వం ఏర్పరచవచ్చునని విశ్లేషణలు వస్తున్నాయి. అందుకని ఈనెల 12న పోలింగ్‌ తర్వాత 15న వెల్లడయ్యే ఫలితాలను బట్టే తన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలా? తాత్కాలికంగా వాయిదా వేయాలా?అనే అంశంలో కెసిఆర్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కర్ణాటక ఎన్నికల్లో రెండు పెద్ద పార్టీల మధ్య భారీ పోటీ ఏర్పడి జనతాదళ్‌ ఎస్‌కు లభిస్తే, ఫెడరల్‌ ఫ్రంట్‌కు పదును పెట్టే అవకాశం ఉంది. లేని పక్షంలో కెసిఆర్‌ రూటు మార్చవచ్చునని అంటున్నారు.

ఏప్రిల్‌ 27న టిఆర్‌ఎస్‌ ప్లీనరీలో దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పునకు చేయాల్సిన ప్రయత్నాలపై, ప్రాంతీయ పార్టీలను కలిపి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయడంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సిఎం కెసిఆర్‌కు అప్పగిస్తూ తీర్మానం చేశారు, కానీ పార్టీ శ్రేణులకు, నేతలకు కెసిఆర్‌ తలపెట్టిన ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు,. ఇప్పుడే ఈ విషయాలెందుకు? ముందు బంగారు తెలంగాణ సంగతి చూద్దాం అని అంతర్గతంగా అభిప్రాయపడుతున్నారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికలో వచ్చే ఫలితాలను బట్టి అడుగులు ముందుకు వేయడం మంచిదనే అభిమతంతో ఉన్నారు. ఇవన్నీ గమనిస్తున్న సిఎం కెసిఆర్‌ ఆచితూచి అడుగులు వేసేందుకే ఆలోచన చేస్తున్నారు.గతంలో తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ సాధన కోసం కేంద్రంపై వత్తిడి పెంచడంలో సహకరించిన పలు ప్రాంతీయ పార్టీల నేతలను పెడరల్‌ ఫ్రంట్‌లో కలుపుకుని పోయేందుకు సిఎం కెసిఆర్‌ ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. మడమ వెనక్కు తిప్పన పద్దతిలోనే అందరని కలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించినట్లుగానే ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి దేశానికి దిక్సూచీ కావాలని ఆయన కోరిక, ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం కమ్యూనిస్టు కేంద్రమైన త్రిపుర రాష్ట్రంలో బిజెపి గెలిచినట్లుగా ప్రకటన వచ్చిన రోజే దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు అవసరమని, కాంగ్రెస్‌,బిజెపియేతర పార్టీల కలిసి ఫ్రంట్‌గా ఏర్పడాలని ఆయన ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. ఆ రోజు దేశంలోని పలు పార్టీల నుంచి వచ్చిన సానుకూత స్పందనతో ఉత్సాహంగా ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీని కలిసేందుకు కలకత్తా వెళ్లొచారు.
తర్వాత జార్కండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ తన కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌కు వచ్చి సిఎం కెసిఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిశారు. ఆయన మరుసటి రోజు కాళేశ్వరం పర్యటన కూడా చేశారు. తాజాగా సిఎం కెసిఆర్‌ చెన్న§్‌ుకు పార్టీ నేతలను వెంట తీసుకొని వెళ్లారు.అక్కడ రెండు రోజుల పాటు ఉండి డిఎంకె అధినేత,మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి, ఆయన కుమారుడు పార్టీ సెక్రటరీ జనరల్‌ స్టాలిన్‌, ఎంపీ కనిమొళిని కలిసి వచ్చారు.అంతకంటే ముందు కర్ణాటక ఎన్నికల ప్రచార హోరు జరుగు తున్నా బెంగుళూరుకు వెళ్లి జనతాదళ్‌ (ఎస్‌) అధినేత,మాజీ ప్రధాని దేవేగౌడ, ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కలిసి తన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచనను చర్చించారు.ఈ నెల 2న సమాజ్‌వాది పార్టీ నేత,ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి ప్రగతి భవన్‌లో సిఎం కెసి ఆర్‌తో భేటీ అయ్యారు. గతంలో సిఎం కెసిఆర్‌ అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే మొదటి వారంలో ఒడిస్సా (భువనేశ్వర్‌)కు వెళ్లి బిజూ జనతాదళ్‌ నేత,ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను కలవాల్సి ఉంది. అక్కడ పూరి జగన్నాధ్‌ దేవాలయాన్ని కూడా సందర్శించాల నుకున్నారు. ఈ విషయంపై నవీన్‌ పట్నాయక్‌ భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్‌ పూరి జగన్నాధ్‌ దేవాలయ దర్శనానికి వస్తానని చెప్పారని, తనతో ఫ్రంట్‌ విషయం మాట్లాడలేదన్నారు. కానీ ఇప్పుడు ఆ పర్యటనను కెసిఆర్‌ వాయిదా వేసుకున్నారు. సిఎం కెసిఆర్‌ ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడ ప్రముఖ దేవాలయాలను సందర్శించి దైవదర్శనం చేసుకుంటు న్నారు. తాను తలపెట్టిన ఫెడరల్‌ ఫ్రంట్‌ యజ్ఞం విజయవంతం కావాలని మొక్కుకుంటున్నారు.