కరోనా నేపథ్యంలో ప్రజలకు ప్రధాని మోడీ సూచనలు

కరోనా మహమ్మారి ప్రజలను వదలడం లేదు. ఇప్పటికే మూడు వేవ్ లలో మనుషుల ప్రాణాలు తీసిన ఈ మహమ్మారి ..ఇప్పుడు మరోసారి వణికిస్తోంది. కరోనా పుట్టినిల్లు చైనా లో రికార్డు స్థాయిలో నమోదు అవుతుండగా..ఇప్పుడు ప్రపంచ దేశాలు అలర్ట్ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ ప్రజలకు పలు సూచనలు తెలియజేసారు.

కరోనాపై అప్రమత్తంగా ఉండాలని మోడీ దేశ ప్రజలకు సూచించారు. పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో.. ప్రజలు తప్పకుండా మాస్క్‌లు ధరించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని, భౌతికదూరం పాటించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది (2022) చివరి ఎపిసోడ్ ‘మన్ కీ బాత్’ 96వ ఎడిషన్‌లో భాగంగా ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ 2022లో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావించడంతోపాటు.. 2023 సవాళ్ల గురించి కూడా చర్చించారు. 2022 సంవత్సరం అనేక విధాలుగా అద్భుతమైనది.. స్పూర్తిదాయకం అని ప్రధానమంత్రి అన్నారు.

వచ్చే ఆగస్టుతో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుందని.. ఈ సంవత్సరంతో అమృత్ కాలం ప్రారంభమైందని పీఎం మోడీ తెలిపారు. ప్రపంచంలో భారత్ ఐదో ఆర్ధిక శక్తిగా ఎదిగిందని, ఇది సాధారణ విషయం కాదని తెలిపారు. 2022లో భారతదేశానికి 20 కి అధ్యక్షత వహించే బాధ్యత లభించిందని గుర్తుచేశారు. రికార్డు స్థాయిలో 220 కోట్ల కరోనా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేశామని వివరించారు.