కనీస వేతనం రోజుకు 375 రూపాయలుగా నిర్ణయించడం సిగ్గుచేటు

AITUC
AITUC

సైఫాబాద్‌:  దేశవ్యాప్తంగా కార్మికులకు కనీస వేతనం రోజుకు కనీస వేతనం రోజుకు 375 రూపాయలుగా ఉండాలని, ఆదే విధంగా నెలకు 9,750 రూపాయలుగా ఉండాలని (26 రోజులుకు) వివి గిరి నేషనల్‌ లేబర్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకుడు డా.సప్తతి అధ్యక్షతన కనీస వేతనాన్ని నిర్ధారించేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం నియమించిన సప్తతి చేసిన సిఫార్సు దారుణమని ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కనీస వేతనాల సలహామండలి సభ్యుడు టి.నరసింహన్‌ ధ్వజమెత్తారు. ఈ సిఫార్సు అ శాస్త్రీయమైనదని, కార్మికులను కించపరిచే విధంగా ఉందన్నారు. దేశంలోని రాష్ట్రాలను రీజినల్‌ వారిగా విభజించి ఒక్కొక్క రిజిన్‌కు వేర్వేరుగా కనీస వేతనం ఉండేలా కమిటి సిఫార్సు చేయడం శోచనీయమని, ప్రభుత్వం కనీస వేతనం, బోనస్‌, సమాన పనికి సమానవేతనం లాంటి బిల్లును కుదించి 2017 వేజ్‌కోడ్‌ బిల్లుగా తీసుకువచ్చి ఇందులో దేశవ్యాప్తంగా కార్మికులకు ఒకే విధమైన కనీస వేతనం ఉండాలని పేర్కోన్న నేపధ్యంలో సప్తతి కమిటి సిఫార్సులతో దేశ వ్యాప్తంగా కార్మికులకు కనీస వేతనం నెలకు 9,750 రూపాయలుగా కేంద్రం ప్రకటించే ప్రమాదం ఉందని ఆయన శుక్రవారం నాడిక్కడ పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతన సలహా మండలి 2017లో కనీస వేతనం 15635 రూపాయలుగా ఉండాలని సిఫార్సు చేస్తే కెసిఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం యాజమాన్యాల వత్తిడికి తలవొగ్గి ఇప్పటి వరకు దీనిపైన ఏలాంటి నిర్ణయిం తీసుకోలేదని, ముఖ్యమంత్రి యాజమాన్యాల అనుకూల వైఖరిని అవలంబించడం సిగ్గుచేటని నరసింహన్‌ విమర్శించారు. దేశవ్యాప్తంగా నెలకు కనీస వేతనం 18 వేల ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ నెల 25న దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఎఐటియుసి కేంద్ర కమిటి ఇచ్చిన పిలుపును రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని కార్మికులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.