ఓపికకు హద్దులుంటాయి..హద్దు దాటి మాట్లాడవద్దు..కెటిఆర్
minister ktr
సిరిసిల్ల: మంత్రి కెటిఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ..బిజెపి, కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిగా మాట్లాడితే.. చూస్తు ఊరుకోమని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఓపికకు హద్దులుంటాయని.. హద్దు దాటి మాట్లాడవద్దని కెటిఆర్ అన్నారు. ఈ 20 ఏండ్ల కాలంలో టిఆర్ఎస్ చరిత్రలో ఎన్నో విజయాలు సాధించాం అని అన్నారు.
తెలంగాణ బిజెపి ఏర్పడ్డాయంటే అది కెసిఆర్ భిక్ష అని తెలిపారు. సిఎం కెసిఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నాటి ముఖ్యమంత్రులను ఉరికించిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీకి ఉంది. ఆ విషయాన్ని బిజెపి నాయకులు మరిచిపోవద్దు.. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కూడా వదిలిపెట్టాం. మాటలు మాట్లాడే పరిస్థితి వస్తే.. తాము మీ కంటే ఎక్కువగా మాట్లాడుతామని హెచ్చరించారు. ఈ 20 ఏండ్లలో అనేక ఘటనలు చూశాం. అన్ని పరిస్థితులను నిలదొక్కుకొని ఈ స్థాయికి వచ్చామని కెటిఆర్ స్పష్టం చేశారు. రాష్ర్టాన్ని సాధించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కెసిఆర్ నిలబెట్టారు అని పేర్కొన్నారు.
కెసిఆర్ పరిపాలనాదక్షుడు అని కేంద్రమంత్రులే చెప్పారు. వందశాతం సాగు, తాగునీరు ఇస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ అని కేంద్రం చెప్పిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ 9 గంటల కరెంట్ అని చెప్పి.. ఏ ఒక్క రోజు కూడా 6 గంటల కరెంట్ కూడా ఇవ్వలేదన్నారు. అర్ధరాత్రి కరెంట్ ఇచ్చి రైతుల ప్రాణాలతో చెలగాటమాడారు అని ధ్వజమెత్తారు. ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ర్టం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీలతో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని తేల్చిచెప్పారు.