ఓటర్ల సవరణను పొడగించండి

Uttam kumar reddy
Uttam kumar reddy

హైదరాబాద్‌: ఓటర్ల సవరణ కోసం మరోమూడు వారాల పాటు పొడగించాలని, గతంలో ఇచ్చిన 14వ తేది చివరి గడువు ఓటర్ల సవరణను ఏ రకంగా కూడా సరిపోదని, ప్రత్యేక ఓటర్ల సవరణ కోసం క్యాంపులు ఏర్పాటు చేసిన అధికారులు అక్కడ అందుబాటులో ఉండటం లేరని టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు, సోమవారం గాంధీనగర్‌లో టిపిసిసి ఎన్నికల కమిటీ సమావేశం చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి అధ్యక్షతన జరగగా ఎఐసిసి ఇంచార్జ్‌ కుంతియాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్‌రెడ్డి రాష్ట్రంలో ఓటర్ల సవరణకు సంబంధించి వివరాలను వారికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 నుంచి 10వ తేది వరకు తమ కమిటీ గ్రామీణ జిల్లాలలో పర్యటించామని, ఓటర్ల తొలగింపులో అనేక అక్రమాలు జరిగాయని, అశాస్త్రీయంగా ఓటర్ల తొలగింపు జరిగిందన్నారు. ఈనెల 4వ తేదిన, 11వ తేదీన స్పెషల్‌ క్యాంపెయిన్‌ కోసం గ్రామాలలో సవరణ క్యాంపులు పెడుతున్నామని, ఎన్నికల సంఘం ప్రకటించిందని, అయితే చాలా ప్రాంతాలలో క్యాంపులలో సంబంధించి బూత్‌లెవల్‌ అధికారులు ఎవరూ రాలేదన్నారు. అలాంటప్పుడు ఓటర్లు ఎవరి వద్ద తమ ఫిర్యాదులు నమోదు చేస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఉండే ఎలక్ట్రోల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి కూడా అందుబాటులో లేరని ఇక ప్రజలు ఓటర్ల నమోదులోనూ, తొలగింపులలోనూ ఎవరికి ఫిర్యాదు చేస్తారని, వారికి ఫోన్‌లో చేసినా ఎవరూ స్పందించడం లేదన్నారు. ఈ సందర్భంగ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ ఈ నెల 14వ తేది వరకు ఉన్న ఓటర్ల సవరణ చివరి తేదిని మరో మూడు వారాల పాటు పొడగించాలని కోరుతూ ఎన్నికల కమిషనర్‌కు ఒక లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు తొలగించిన ఓటర్ల వివరాలను కూడా ఎన్నికల సంఘం సరైన విధంగా ప్రకటించలేదని, నియోజకవర్గాల వారీగా తొలగించిన ఓటర్ల జాబితాను ఇవ్వాలని కోరినా స్పందించడం లేదని, ఇంత వరకు ఎలాంటి సానుకూల ప్రయత్నం లేదన్నారు. ఈ విషయాలపై సమగ్రంగా శాస్త్రీయంగా వివరాలు అందజేయాలని, అందుకోసం గడువు పొడగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో టిపిసిసి అధికార ప్రతినిధులు నిరంజన్‌, కమలాకర్‌రావు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్‌రెడ్డి, రాజేశ్వర్‌, నరేందర్‌, రాజేశ్‌లు పాల్గొన్నారు.